
శ్రీకాకుళం పాతబస్టాండ్: వృద్ధులు, వింతంతువులు, దివ్యాంగులకు పింఛన్ పెంచాం, డ్వాక్రా మహిళలకు రూ.పది వేల చెక్కులు ఇచ్చామంటూ టీడీపీ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. మహిళ సంఘాల ద్వారా అహయహస్తం పథకంలో ఉన్న లబ్ధిదారులకు మాత్రం పింఛన్ పెంచడంలో నిర్లక్ష్యం వహించింది. ప్రభుత్వం తీరుపై మహిళా సంఘాల సభ్యులు, ప్రతినిధులు అందోళన చెందుతున్నారు. మరికొన్ని చోట్ల పింఛన్ల పంపిణీ వద్ద సిబ్బందితో వివాదాలకు కూడా దిగుతున్నారు. జిల్లాలో సుమారు ఏడు వేల కుటాంబాలకు ప్రభుత్వం రిక్తహస్తం చూపింది.
కొత్తగా చేరేవారికి అవకాశం లేదు
అభయహస్తం పథకాన్ని నాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ పథకం ప్రారంభమై ప్రతిఫలాలు అందుతున్నాయన్న సమయంలోనే ఆయన మృతి చెందారు. ఈ పథకాన్ని వైఎస్సార్ అభయహస్తం పేరిట అనంతరం అమలు చేశారు. అభయహస్తంతో చాలా మంది అప్పటిలో చేరారు. తర్వాత కొత్తగా ఈ పథకంలో చేరే అవకాశం కల్పించలేదు. దీంతో కేవలం జిల్లాలో 45 వేల మందికి మాత్రమే ఈ పథకం వర్తిస్తోంది. ఈ పథంలో ఉండి, 60 ఏళ్ల వయస్సు నిండిన వారికి అక్కడ నుంచి వారు జీవించి ఉన్నంత వరకు ప్రతి నెలా రూ.500 పింఛను ఇవ్వాలని అప్పటి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పింఛన్ మొత్తాన్ని పెంచలేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పేరిట సామాజిక భద్రతా పింఛన్లను రెండు వందల నుంచి రూ.వెయ్యికి పంచినా, వీరికి మాత్రం రెండు పర్యాయాలు పెంచలేదు.
45 వేలకు పైగా మహిళా స్వయం శక్తి సంఘాల
జిల్లాలో 45 వేలకు పైగా మహిళా స్వయం శక్తి సంఘాలున్నాయి. వీటిలో సుమారుగా 5 లక్షల మంది వరకు సభ్యులున్నారు. తర్వాత కొత్తగా సంఘాలు ఏర్పడినా.. వారికి ఇప్పటివరకు ఈ ప్రభుత్వం అభయహస్తం పథకంలో చేర్పించిన దఖలాలు లేవు. సుమారు లక్ష మందికి ప్రయోజనం అందకుండా పోయింది. ఈ పథకంలో చేరిన తర్వాత అభయహస్తం పథకంలో ఉండి, 60 ఏళ్లు పైబడి పింఛను పోందుతున్నవారు 6,801 మంది ఉన్నారు. ఈ నెల నుంచి పింఛను పెరుగుతోందని ఆశించారు. ఈ నెల తీరా పింఛను తీసుకొనే సమయానికి వారికి కేవలం రూ.500లు మాత్రమే వచ్చింది. రూ.వెయ్యి అవుతోందని ఆశ ఎంతో కాలం నిలవలేదు.
రూ.వెయ్యి పెంపు..
కిడ్ని వ్యాధి ముదిరి, డయాలసిస్ స్థితిలో ఉన్నవారికి ప్రస్తుతం నెలకు రూ.2500లు పింఛన్ అందజేస్తున్నారు. ఇటువంటి పింఛన్లు పొందేవారు ప్రస్తుతం జిల్లాలో 305 మంది ఉన్నారు. ఈ పింఛన్ ఎందరో పోరాటాలు ఫలితంగా వచ్చింది. ఈ పింఛన్ కూడా రెట్టింపు చేయాల్సింది. కానీ వీరికి మరో వెయ్యి రూపాయిలు కలిపి రూ.3500కి పరిమితం చేశారు. టీడీపీ సర్కార్ చిన్నచూపు చూస్తుందని వారి కుటుంబ సభ్యులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment