పెన్షన్... టెన్షన్ | Pension ... Tension | Sakshi
Sakshi News home page

పెన్షన్... టెన్షన్

Published Sun, Dec 22 2013 2:59 AM | Last Updated on Mon, Aug 13 2018 3:11 PM

Pension ... Tension

సాక్షి, చిత్తూరు: వృద్ధులు, వికలాంగులు తదితరులకు ప్రతి నెలా 5వ తేదీలోపు పింఛన్ అందేలా మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం 20వ తేదీకీ పింఛన్లు అందని పరిస్థితి నెలకొంది. జిల్లాలో వివిధ రకాల పింఛన్లు 3,88,994 పంపిణీ చేస్తున్నారు. చాలా మంది వృద్ధులు, వికలాంగులు తదితరులకు ఈ పింఛన్లే జీవనాధారం. ఆధార్ లింకేజి, వేలిముద్రలు సరిపోవడం లేదనే సాకుతో కొన్ని చోట్ల పింఛన్లు ఇవ్వడం లేదు.

ఇలా వరుసగా రెండు నుంచి మూడు నెలలు సొమ్ము అందుకోని వారికి శాశ్వతంగా పింఛన్ రద్దు చేస్తున్నారు. ఎక్కడో మారుమూల పల్లెలో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులూ పింఛన్ల కోసం 10 కిలోమీటర్ల దూరంలోని పోస్టాఫీసులకు వెళ్లాల్సిందే. పింఛన్ సొమ్ములో సగం వీరికి ఆటోచార్జీలకే సరిపోతోంది. ఒక వేళ పోస్టాఫీసులో సర్వర్ సమస్య ఉన్నా, సదరు ఉద్యోగి సెలవులో ఉన్నా ఆ రోజు పింఛన్ లేనట్లే. మళ్లీ ఖర్చులు పెట్టుకుని రెండోసారి రావాల్సిందే. చాలా మండలాల్లో సాంకేతిక కారణాలు చూపుతూ నెలకు 250 నుంచి 300 పింఛన్లు తగ్గిస్తున్నారు.
 తప్పని అగచాట్లు
 మండలంలోని అన్ని పంచాయతీలకూ సమీపంలోని పోస్టాఫీసు నుంచి పింఛన్లు తీసుకునే విధంగా అనుసంధానం చేశారు. ఈ పద్ధతి వల్ల వృద్ధులు, వికలాంగులకు అగచాట్లు తప్పడం లేదు. ఆరోగ్యం సహకరించకున్నా వారు రావాల్సిన పరిస్థితే. కొన్ని చోట్ల వృద్ధులను మంచంపైనే బంధువులు పోస్టాఫీసుకు తీసుకు వస్తున్నారు. బయోమెట్రిక్ పద్ధతిలో ఇచ్చిన సిమ్‌లు చాలా చోట్ల పనిచేయడం లేదు. వీటికి సిగ్నల్స్ అందక నానా అగచాట్లు పడుతున్నారు.
 చంద్రగిరి నియోజకవర్గంలో వేలిముద్రలు, ఆధార్‌కార్డులు సరిపోవడం లేదని 250 నుంచి 300 పింఛన్లు ఆపేస్తున్నారు. దూరంలో ఉన్న పోస్టాఫీసుకు వెళ్లేందుకు వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు. తిరుపతి రూరల్, చంద్రగిరి మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
 జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఆరు నెలల నుంచి కొత్త పింఛన్లు ఇవ్వడం లేదు. రద్దయి న పింఛన్ల స్థానంలో ఎమ్మెల్యే సిఫారసు చేసినవారికే ఇస్తున్నారు. ఎస్.ఆర్.పురం, పాల సముద్రం, పెనుమూరు మండలాల్లో 16 నుంచి 20వ తేదీలోపు పింఛన్లు ఇస్తున్నారు.
 పీలేరు నియోజకవర్గంలో బయోమెట్రిక్ విధానంతో పింఛన్లు సరిగా అందడం లేదు. మూడు నెలలు ఇలా వరుసగా పింఛన్లు రాకపోతే తర్వాత రద్దయి పోతున్నాయి. పింఛన్ల కోసం జనానికి తిప్పట తప్పడం లేదు.
 పలమనేరు నియోజకవర్గంలో వృద్ధాప్య పింఛన్లు 8 వేలు, వితంతు పింఛన్లు 4 వేలు, వికలాంగ పింఛన్లు 9 వేలు ఇవ్వాల్సి ఉంది. సాంకేతిక కారణాలతో వీరిలో 50 శాతం మందికి పింఛన్లు ఇవ్వడం లేదు. స్మార్‌‌టకార్డుల వల్ల పింఛన్ల పంపిణీ గందరగోళంగా మారింది. పింఛన్ల పంపిణీలో ఎంపీడీవోల అజమాయిషీలేదు.
 నగరి మండలంలో పింఛన్లు ఇస్తున్నారా లేదా అనేది సామాజిక తనిఖీ చేయడం లేదు. చనిపోయినవారి పింఛన్లను లోపాయికారిగా స్వాహా చేస్తున్నారు. పింఛన్లు రాలేదనే ఫిర్యాదులు అధికంగా ఉన్నాయి. రూరల్‌లో పోస్టాఫీసుల ద్వారా పింఛన్ ఇస్తున్నారు. మొత్తం 17 పంచాయతీలకు 10 పోస్టాఫీసులు ఉన్నాయి. కొన్ని గ్రామాల వారు ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలోని పోస్టాఫీసులకు వెళ్లాల్సి వస్తోంది. ఇంత దూరం వెళ్లినా పింఛన్ సొమ్ము వస్తుందనే నమ్మకం లేదు.
 సత్యవేడు నియోజకవర్గంలో లేనిపోని కారణాలతో పింఛన్లను తగ్గించేశారు. 2011 రచ్చబండలో మంజూరైన పింఛన్లనే ఇంకా పూర్తిగా ఇవ్వడం లేదు. అలాగే 2013లో 466 మందికి కొత్తగా పింఛన్లు ఇవ్వాలని ఆన్‌లైన్‌లో పెట్టారు. తమకు సొమ్ము ఎప్పటి నుంచి వస్తుందోనని దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు.
     
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 23,800 పింఛన్లు ఉన్నాయి. సర్వర్ సమస్య అంటూ పలు గ్రామాల్లో సక్రమంగా సొమ్ము ఇవ్వడం లేదు.
 ఆధార్ లింక్ చేయమని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి నెలా 10వ తేదీలోపు పింఛన్లు అందడం లేదు. రెండు, మూడు నెలలు తీసుకోలేదని 3000 మందికి పింఛన్లు ఆపేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement