biometric method
-
బయోమెట్రిక్‌తో ఎయిర్‌పోర్ట్‌ల్లో ఎంట్రీ
సాక్షి, న్యూఢిల్లీ : విమానాశ్రయాల్లో ప్రవేశానికి ఇక గుర్తింపు కార్డులను చూపడం మరిచిపోవాల్సిందే. దేశీయ విమానాల్లో బోర్డింగ్ ప్రక్రియను పేపర్ రహితంగా చేపట్టాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో మొబైల్ ఫోన్‌తోనే పనులను చక్కబెట్టుకునేలా కసరత్తు సాగుతోంది. ఆధార్, పాస్‌పోర్ట్ వంటి ప్రయాణీకుల ఐడీలను ఎయిర్‌లైన్స్, ఎయిర్‌పోర్ట్‌ల డేటాబేస్లకు పౌరవిమానయాన శాఖ అనుసంధానిస్తోంది. ఇది అమల్లోకి వస్తే విమాన ప్రయాణీకులు గుర్తింపు కార్డులను చూపకుండా బయోమెట్రిక్స్‌ను ఉపయోగించవచ్చని విమానయాన కార్యదర్శి ఆర్ఎన్ చూబే చెప్పారు. ప్రయాణీకులు బుక్ చేసిన విమాన వివరాలు కూడా ఎయిర్‌లైన్ డేటా బేస్ చూపుతుందని, దీంతో విమాన టికెట్ లేదా ఈ టికెట్లూ అవసరం లేదని ఆయన అన్నారు. విమానంలో ఎక్కే సమయంలో బోర్డింగ్ గేట్లోకి అనుమతించే ముందు ప్రయాణికుడి సెక్యూరిటీ చెకిన్ పూర్తయిందా లేదా అనే వివరాలు సైతం ఎయిర్పోర్ట్ డేటాబేస్‌లో నిక్షిప్తమవుతాయన్నారు. ఈ డిజీయాత్ర కార్యక్రమానికి తుదిరూపు ఇచ్చేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రయాణికులకు మెరుగైన బోర్డింగ్ అనుభూతిని కల్పించేందుకు, భద్రతా సిబ్బందిపై వ్యయాలను తగ్గించేందుకు టెక్నాలజీని విరివిగా వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. -
పింఛన్ల పంపిణీకి కొత్త విధానం
‘సెర్ప్’నుంచి మార్గదర్శకాలు జారీ వేలిముద్రలు నమోదుకాని వారికోసం కమిటీ ఏర్పాటు 10వ తేదీన ఇంటివద్దనే పంపిణీ మిగతా వారికి మొదటివారంలో.. 8వేలమందికి పెండింగ్ బకాయిల విడుదల హన్మకొండ అర్బన్ : డీఆర్డీఏ ఐకేపీ ద్వారా పంపిణీ చేస్తున్న సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీకి సబంధించి గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ(సెర్ప్) కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. జూలై నెల పింఛన్ల నుంచి వీటిని అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అర్హులు ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. పింఛన్ల పంపిణీలో పూర్తిస్థాయిలో స్మార్ట్‌కార్డులు, బయోమెట్రిక్ పద్ధతి అమలు చేస్తున్నప్పటికీ సాంకేతిక కారణాలతో లబ్ధిదారులు ఇబ్బందులు పడితే గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుల ఆమోదంతో వారి వే లి ముద్రలు, ఇతర ఆధారాలతో ఇంటి వద్దనే వారికి పింఛన్ ఇచ్చేలా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. వేలిముద్రలు నమోదు కాకుంటే.. 80ఏళ్లు.. ఆపైబడిన వృద్ధుల విషయంలో వేలిముద్రలు సరిగా నమోదు కాకపోవడంతో బయోమెట్రిక్ మిషన్లు వీరిని లబ్ధిదారులుగా గుర్తించడంలేదు. దీంతో సీఎస్పీలు, పోస్టాఫీస్‌లలో వందల సంఖ్యలో వృద్ధాప్య పింఛన్లు నిలిచిపోయిన సందర్భాలున్నాయి. ఈ విషయంలో గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అధికారులకు వాస్తవాలు తెలిసినా జాలిపడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. ఇదే కారణాలతో జూన్ నాటికి జిల్లాలో 8241మందికి పింఛన్లు ఇవ్వకుండా వివిధ స్థాయిల్లో అధికారులు నిలిపివేశారు. ప్రస్తుతం జారీచేసిన కొత్త నిబంధనల్లో వీరికి పాతబకాయిలు మొత్తం విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త మార్గదర్శకాల్లో కొన్ని.. ప్రతీ నెల ఒకటో తేదీన ప్రారంభించి 8వ తేదీ వరకు పింఛన్లు పంపిణీ చేయాలి. వీటి వివరాలు 15వ తేదీలోగా ఎంపీడీఓలు, కమిషనర్ల ద్వారా అధికారులకు చేరాలి. బ్యాంకులు, పోస్టాఫీస్‌ల ద్వారా పింఛన్ పొందుతున్న వారిలో డబ్బులు తీసుకోని వారి వివరాలు 10వతేదీన అధికారులకు తెలియజేయాలి. మిగిలిన మొత్తం 15తేదీలోగా ప్రభుత్వ ఖాతాలో జమచేయాలి. గ్రామాల్లో పింఛన్ల తొలగింపునకు సంబంధించిన సమాచారం అధికారులు ‘సెర్ప్’కు తెలియజేయాలి. ఇదే క్రమంలో ఇప్పటివరకు వేలిముద్రలు సేకరించని లబ్ధిదారుల వేలిముద్రలు సేకరించాలి. ఇందుకోసం పంపిణీదారులు వేలిముద్రల నమోదు పరికరాలు సమకూర్చుకుని వార్డులు, డివిజన్ల వారీగా తేదీలు ఖరారు చేయాలి. సేకరించిన వేలిముద్రలను ఎంపీడీవో కార్యాలయంలోనూ, మండల కోఆర్డినేటర్లకు అందజేయాలి. గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు వేలిముద్రలు సరిగా నమోదు కానివారు, శాశ్వతంగా మంచానికే పరిమితమైన వారికి(వ్యాధిగ్రస్తులు, చేతులు, కాళ్లు లేనివారు) ఇకపై ప్రత్యేక దూత ద్వారా ఇంటివద్దనే ప్రతినెలా 10వతేదీన పింఛన్ డబ్బులు ఇస్తారు. ఇందుకోసం గ్రామస్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఇద్దరు వీవోలు, కౌన్సిలర్/కార్పొరేటర్, బిల్‌కలెక్టర్ ఇద్దరు స్లమ్ లెవల్ ఫెడరేషన్ సభ్యులుగా ఉంటారు. కమిటీలోని అందుబాటులో ఉన్న ఇద్దరు సభ్యులు ధ్రువీకరించాల్సి ఉంటుంది. జిల్లాలో 4లక్షల మంది లబ్ధిదారులు జిల్లాలో మొత్తం 4,02,512మంది లబ్ధిదారులున్నారు. వీరికోసం ప్రభుత్వం ప్రతినెలా రూ.11.78కోట్లు విడుదల చేస్తోంది. జిల్లాలో ప్రస్తుతం 178గ్రామాలు, అర్బన్ ప్రాంతా ల్లో ఫినో సంస్థ, 455 గ్రామాల్లో ఎంపీడీవోల ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు, 381గ్రామాల్లో పోస్టాఫీస్‌ల ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. -
పెన్షన్... టెన్షన్
సాక్షి, చిత్తూరు: వృద్ధులు, వికలాంగులు తదితరులకు ప్రతి నెలా 5వ తేదీలోపు పింఛన్ అందేలా మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం 20వ తేదీకీ పింఛన్లు అందని పరిస్థితి నెలకొంది. జిల్లాలో వివిధ రకాల పింఛన్లు 3,88,994 పంపిణీ చేస్తున్నారు. చాలా మంది వృద్ధులు, వికలాంగులు తదితరులకు ఈ పింఛన్లే జీవనాధారం. ఆధార్ లింకేజి, వేలిముద్రలు సరిపోవడం లేదనే సాకుతో కొన్ని చోట్ల పింఛన్లు ఇవ్వడం లేదు. ఇలా వరుసగా రెండు నుంచి మూడు నెలలు సొమ్ము అందుకోని వారికి శాశ్వతంగా పింఛన్ రద్దు చేస్తున్నారు. ఎక్కడో మారుమూల పల్లెలో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులూ పింఛన్ల కోసం 10 కిలోమీటర్ల దూరంలోని పోస్టాఫీసులకు వెళ్లాల్సిందే. పింఛన్ సొమ్ములో సగం వీరికి ఆటోచార్జీలకే సరిపోతోంది. ఒక వేళ పోస్టాఫీసులో సర్వర్ సమస్య ఉన్నా, సదరు ఉద్యోగి సెలవులో ఉన్నా ఆ రోజు పింఛన్ లేనట్లే. మళ్లీ ఖర్చులు పెట్టుకుని రెండోసారి రావాల్సిందే. చాలా మండలాల్లో సాంకేతిక కారణాలు చూపుతూ నెలకు 250 నుంచి 300 పింఛన్లు తగ్గిస్తున్నారు. తప్పని అగచాట్లు మండలంలోని అన్ని పంచాయతీలకూ సమీపంలోని పోస్టాఫీసు నుంచి పింఛన్లు తీసుకునే విధంగా అనుసంధానం చేశారు. ఈ పద్ధతి వల్ల వృద్ధులు, వికలాంగులకు అగచాట్లు తప్పడం లేదు. ఆరోగ్యం సహకరించకున్నా వారు రావాల్సిన పరిస్థితే. కొన్ని చోట్ల వృద్ధులను మంచంపైనే బంధువులు పోస్టాఫీసుకు తీసుకు వస్తున్నారు. బయోమెట్రిక్ పద్ధతిలో ఇచ్చిన సిమ్‌లు చాలా చోట్ల పనిచేయడం లేదు. వీటికి సిగ్నల్స్ అందక నానా అగచాట్లు పడుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో వేలిముద్రలు, ఆధార్‌కార్డులు సరిపోవడం లేదని 250 నుంచి 300 పింఛన్లు ఆపేస్తున్నారు. దూరంలో ఉన్న పోస్టాఫీసుకు వెళ్లేందుకు వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు. తిరుపతి రూరల్, చంద్రగిరి మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఆరు నెలల నుంచి కొత్త పింఛన్లు ఇవ్వడం లేదు. రద్దయి న పింఛన్ల స్థానంలో ఎమ్మెల్యే సిఫారసు చేసినవారికే ఇస్తున్నారు. ఎస్.ఆర్.పురం, పాల సముద్రం, పెనుమూరు మండలాల్లో 16 నుంచి 20వ తేదీలోపు పింఛన్లు ఇస్తున్నారు. పీలేరు నియోజకవర్గంలో బయోమెట్రిక్ విధానంతో పింఛన్లు సరిగా అందడం లేదు. మూడు నెలలు ఇలా వరుసగా పింఛన్లు రాకపోతే తర్వాత రద్దయి పోతున్నాయి. పింఛన్ల కోసం జనానికి తిప్పట తప్పడం లేదు. పలమనేరు నియోజకవర్గంలో వృద్ధాప్య పింఛన్లు 8 వేలు, వితంతు పింఛన్లు 4 వేలు, వికలాంగ పింఛన్లు 9 వేలు ఇవ్వాల్సి ఉంది. సాంకేతిక కారణాలతో వీరిలో 50 శాతం మందికి పింఛన్లు ఇవ్వడం లేదు. స్మార్టకార్డుల వల్ల పింఛన్ల పంపిణీ గందరగోళంగా మారింది. పింఛన్ల పంపిణీలో ఎంపీడీవోల అజమాయిషీలేదు. నగరి మండలంలో పింఛన్లు ఇస్తున్నారా లేదా అనేది సామాజిక తనిఖీ చేయడం లేదు. చనిపోయినవారి పింఛన్లను లోపాయికారిగా స్వాహా చేస్తున్నారు. పింఛన్లు రాలేదనే ఫిర్యాదులు అధికంగా ఉన్నాయి. రూరల్‌లో పోస్టాఫీసుల ద్వారా పింఛన్ ఇస్తున్నారు. మొత్తం 17 పంచాయతీలకు 10 పోస్టాఫీసులు ఉన్నాయి. కొన్ని గ్రామాల వారు ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలోని పోస్టాఫీసులకు వెళ్లాల్సి వస్తోంది. ఇంత దూరం వెళ్లినా పింఛన్ సొమ్ము వస్తుందనే నమ్మకం లేదు. సత్యవేడు నియోజకవర్గంలో లేనిపోని కారణాలతో పింఛన్లను తగ్గించేశారు. 2011 రచ్చబండలో మంజూరైన పింఛన్లనే ఇంకా పూర్తిగా ఇవ్వడం లేదు. అలాగే 2013లో 466 మందికి కొత్తగా పింఛన్లు ఇవ్వాలని ఆన్లైన్లో పెట్టారు. తమకు సొమ్ము ఎప్పటి నుంచి వస్తుందోనని దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 23,800 పింఛన్లు ఉన్నాయి. సర్వర్ సమస్య అంటూ పలు గ్రామాల్లో సక్రమంగా సొమ్ము ఇవ్వడం లేదు. ఆధార్ లింక్ చేయమని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి నెలా 10వ తేదీలోపు పింఛన్లు అందడం లేదు. రెండు, మూడు నెలలు తీసుకోలేదని 3000 మందికి పింఛన్లు ఆపేశారు. -
పింఛన్‌కు బయోమెట్రిక్ కష్టాలు
ఆసిఫాబాద్, న్యూస్‌లైన్ : పింఛన్ డబ్బులు పొందడానికి వృద్ధులు, వికలాంగులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. గతంలో గ్రామ పంచాయతీల్లో పింఛన్ పంపిణీ చేయగా.. ఈ నెల నుంచి పోస్టాఫీసు ద్వారా బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నారు. దీంతో పింఛన్‌దారుల వేలిముద్రలు, ఆధార్ నంబరు, ఇతర వివరాలు బయోమెట్రిక్ యంత్రంలో నమోదు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మండలంలో 4,600 మంది పింఛన్‌దారులు ఉండగా.. వీరిలో 300మంది వికలాంగులు ఉన్నారు. అందరికీ కలిపి నెలనెలా రూ.10 లక్షలు పింఛన్‌గా అందజేస్తున్నారు. ఆసిఫాబాద్‌లో 1,700 మంది వృద్ధులు, వికలాంగులు ఉన్నారు. ఆసిఫాబాద్ పోస్టాఫీసులో ఈ నెల మూడున ప్రారంభమైన బయోమెట్రిక్ విధానంలో ఆన్లైన్ ద్వారా లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తున్నారు. రోజుకు 30 నుంచి 40 మందికి మాత్రమే పింఛన్ పంపిణీ చేస్తున్నారు. ఇలా చేస్తే నెల రోజులైనా పని పూర్తయ్యేలా లేదు. దీంతో నాలుగు రోజులుగా వృద్ధులు, మానసిక వికలాంగులు అవస్థలు పడుతున్నారు. ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో నిరీక్షిస్తున్నారు. మానసిక వికలాంగుల వేలిముద్రలు బయోమెట్రిక్ యంత్రంలో నమోదు కాకపోవడంతో వారికి డబ్బులు ఇవ్వడం లేదు. కేవలం పింఛన్‌పైనే ఆధారపడే తమకు కొత్త కొత్త పద్ధతులతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలి పారు. రూ.200 పింఛన్ కోసం నాలుగు రోజలుగా తిరుగుతున్నామని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయ మై ఎంపీడీవో కృష్ణమూర్తిని సంప్రదించ గా బయోమెట్రిక్ విధానంలో పింఛన్‌దారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యమవుతోందని, వచ్చే నెల సకాలంలో పింఛన్ పంపిణీ అవుతుందని పేర్కొన్నారు.