కడప కార్పొరేషన్ : వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు మళ్లీ పింఛన్ కష్టాలు మొదలయ్యాయి. ఆగష్టు 1 నుంచి ట్యాబ్‌ల ద్వారా పింఛను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అధికార యంత్రాంగం ఆ దిశగా చర్యలు మొదలు పెట్టింది. మే, జూన్, జూలై నెలల్లో బిల్ కలెక్టర్ల ద్వారా మ్యాన్యువల్‌గానే పింఛన్లు పంపిణీ చేసిన ప్రభుత్వం ఇపుడు మళ్లీ పాత పద్ధతిని అమల్లోకి తెస్తోంది. రూ.15 వేలు విలువగల ట్యాబ్‌లెట్ పీసీలను బిల్ కలెక్టర్లకు పంపిణీ చేసి వాటి ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలని ఆదే శాలు జారీ చేసింది. ఈ మేరకు ఆగస్ట్టు 1వ తేది నుంచి బిల్ కలెక్టర్లు పింఛన్‌దారుల నుంచి వేలి ముద్రలు తీసుకుని పింఛన్లు పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు బిల్ కలెక్టర్లకు ట్యాబ్‌లపై అవగాహన కల్పించినట్లు సమాచారం. అయితే వాటిపై పూర్తి అవగాహన తెచ్చుకోలేని వారు తీవ్ర ఇబ్బందులు పడుతూ పింఛన్‌దారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
పంపిణీపై ప్రభుత్వం పిల్లి మొగ్గలు
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక పింఛన్ మొత్తాన్ని రూ.200 నుంచి రూ. 1000కి పెంచినా, అదే రీతిలో లబ్ధిదారులకు కష్టాలను కూడా రెట్టింపు చేసింది. సామాజిక సార్లు పిల్లిమొగ్గలు వేసి పింఛన్‌దారులను అష్టకష్టాలు పెట్టింది. గత ప్రభుత్వంలో పింఛన్‌దారుల వేలిముద్రలు తీసుకొని స్మార్టు కార్డు విధానంలో సీఎస్‌పీల ద్వారా పింఛన్ పంపిణీ చేస్తుండేవారు. అప్పట్లో మిషన్లలో వేలిముద్రలు సరిగా పడక, చార్జింగ్, సర్వర్ సమస్యలతో పింఛన్ల పంపిణీ ఆలస్యమయ్యేది. ఈ విధానం వల్ల లబ్ధిదారులు నానా ఇబ్బందులు పడ్డారు. కొత్త ప్రభుత్వం వచ్చాక వారందరినీ తొలగించి మున్సిపల్ బిల్ కలెక్టర్ల ద్వారా కొన్ని నెలలు పంపిణీ చేశారు. తర్వాత కొత్తగా మిషన్లు పంపిణీ చేసి, వాటిలో వేలి ముద్రలు తీసుకొని పోస్టాఫీసుల ద్వారా రెండు మూడు నెలలు పంపిణీ చేశారు.
అప్పుడు కూడా చార్జింగ్, సర్వర్, వేలిముద్రల సమస్యలు తలెత్తడంతో ఆ మూడు నెలలు కూడా పింఛన్‌దారులు అష్టకష్టాలు పడ్డారు. కాగా పింఛన్ పుస్తకాలపై ముఖ్యమంత్రి ఫొటో వేసేందుకు పోస్టాఫీసులు అంగీకరించకపోవడంతో పింఛన్ పంపిణీ బాధ్యతల నుంచి పోస్టుమాన్‌లను తొలగించినట్లు సమాచారం. ఫలితంగా మే, జూన్, జూలై మాసాల్లో మళ్లీ బిల్ కలెక్టర్ల ద్వారానే పింఛన్ల పంపిణీ చేస్తూవచ్చారు. తాజాగా బిల్ కలెక్టర్లకు ట్యాబ్‌లు పంపిణీ చేసి, వేలిముద్రల సహాయంతో పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు కడప కార్పొరేషన్‌లో మొత్తం 19154 పింఛన్లు ఉండగా అందులో వృద్ధాప్య పింఛన్లు 9967, చేనేత 23, వితంతు 6107, అభయహస్తం 485, వికాలాంగుల పింఛన్లు 2592 ఉన్నాయి.
50 డివిజన్లు ఉండగా 50 ట్యాబ్‌లు పంపిణీ చేశారు. గతంలోలాగే ఇప్పుడు కూడా సమస్యలు మొదలయ్యాయి. ఇదిలా ఉండగా పింఛన్ పంపిణీ పేరిట ప్రభుత్వం కాంట్రాక్టర్లకు దోచిపెడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పోస్టాఫీసుల ద్వారా పంపిణీ సమయంలో కొత్త మిషన్లు పంపిణీ చేశారు. పోస్టాఫీసులకు పింఛన్ల బాధ్యత తొలగించడంతో అవి నిరుపయోగంగా మారాయి. ప్రస్తుతం ఒక్కో ట్యాబ్‌పై రూ.15 వేలు వెచ్చించి వాటి ద్వారా పింఛన్లు పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టారు. దీనివల్ల ప్రభుత్వంపై అదనపు భారం తప్ప ప్రజలకు ఒనగూరిందేమీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోనీ... ఈ విధానం వల్ల పింఛన్‌దారులకు సరళంగా, సులువుగా పింఛన్ లభిస్తున్నదా అంటే అదీ లేదు. వేలి ముద్రలు తీసుకోవడంలో తీవ్ర ఆలస్యమవుతోంది. వయో వృద్ధులు, వికలాంగుల వేలి ముద్రలను యంత్రాలు గుర్తించలేకపోవడంతో సమస్యలు వస్తున్నాయి. దీనివల్ల గంటల తరబడి వేచి ఉండలేక పండుటాకులు ఇక్కట్లు పడుతున్నారు.
మళ్లీ పింఛన్ కష్టాలు!
Published Sun, Aug 2 2015 1:44 AM | Last Updated on Tue, Oct 16 2018 7:27 PM
Advertisement