- ఏడో తేదీ వ చ్చినా ఊసేలేదు
- ఉత్తర్వులు రాలేదంటున్న అధికారులు
- నేడు హైదరాబాదులో సదస్సు
- 3.13 లక్షల మంది లబ్ధిదారుల ఎదురుచూపులు
మచిలీపట్నం : ప్రతినెలా ఒకటో తేదీనే పింఛను ఇచ్చే ఆనవాయితీకి బ్రేక్ పడుతోంది. కొత్త ప్రభుత్వం కొత్త విధానాలు అవలంబిస్తుండటంతో ఈ నెల పింఛను వస్తుందో రాదోననే అనుమానాలు లబ్ధిదారులు వ్యక్తం చేస్తున్నారు. జూలై ఏడో తేదీ వచ్చినా గ్రామాల్లో, పట్టణాల్లో పింఛను అందజేసే కమ్యూనిటీ సర్వీస్ ప్రొవైడర్ల (సీఎస్పీ) జాడ కనబడటం లేదు. పింఛను ఇస్తారనే ఆశతో పింఛనుదారులు పడిగాపులు పడుతున్నారు.
జిల్లాలో మొత్తం 3,13,028 మంది పింఛనుదారులు ఉన్నారు. వీరికి సుమారుగా రూ.12 కోట్ల 18 లక్షల 79 వేల 700 ప్రతినెలా చెల్లించాల్సి ఉంది. 1,25,350 వృద్ధాప్య, 4,946 చేనేత, 44,838 వికలాంగ, 1,15,686 వితంతు, 1,935 కల్లుగీత కార్మికుల, 20,273 మంది అభయహస్తం పింఛన్ల లబ్ధిదారులు ఉన్నారు. అభయహస్తం, వికలాంగ పింఛన్ల లబ్ధిదారులకు నెలకు రూ.500, మిగిలినవారికి నెలకు రూ.200 చొప్పున పింఛను అందుతోంది.
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛను సొమ్మును పెంచుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అధికారం చేపట్టాక అక్టోబరు నుంచి పెంచిన పింఛన్లను అందజేస్తామని మాట మార్చారు. ఇవన్నీ ఇలా ఉంటే ఈ నెల ఫించను సొమ్మును లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులూ రాలేదని డీఆర్‌డీఎ పీడీ ఎం.రజనీకాంతారావు తెలిపారు. పింఛన్ల మంజూరు తదితర అంశాలపై మంగళవారం హైదరాబాద్‌లో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారని, ఈ సమావేశంలో తగు నిర్ణయం తీసుకునే అవకాశముందని ఆయన చెప్పారు.
ఉత్తర్వులు లేవు...
పింఛన్ల సొమ్ము మంజూరైతే ఆయా మండలాలకు లబ్ధిదారుల వివరాలు, అక్విటెన్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ ప్రతి మండల కార్యాలయానికి ఉత్తర్వులు వచ్చేవని, ఈ నెలలో అలాంటిదేమీ జరగలేదని పలువురు ఎంపీడీవోలు తెలిపారు. గత రెండు నెలల వ్యవధిలో ఫినో మిషన్లకు సంబంధించి ఆన్‌లైన్ సర్వీసును మార్చడంతో సిగ్నల్ అందక పలు ఇబ్బందులు పడ్డామని, ఈ నెలలో పింఛన్లు ఎప్పుడిస్తారో తెలియడం లేదని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. పింఛను వస్తే మందు బిళ్లల ఖర్చుకైనా పనికొస్తాయనే ఆశతో ఉన్నామని పలువురు వృద్ధులు అంటున్నారు.