
సాక్షి, అమరావతి: ఓ వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం.. మరోవైపు కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం.. ఇలాంటి పరిస్థితిలోనూ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు.. ఇతరత్రా సామాజిక పింఛన్లను మాత్రం నేడే చెల్లించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి తోడు కరోనా వైరస్ విజృంభించడంతో పనులు చేసుకోలేక, ఉపాధి కరువై పేదలు ఇబ్బందులు పడకుండా ఈ నెల 4వ తేదీన రూ.1,000 సాయం అందించడానికి సర్కారు కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఆర్థిక శాఖ మంగళవారం రూ.1,300 కోట్లు విడుదల చేసింది. గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ఆయా కుటుంబాల ఇళ్ల వద్దనే ఈ నగదును పంపిణీ చేయనున్నారు.
నేటి పంపిణీకి ఏర్పాట్లు
► పింఛనుదారులలో సగానికి పైగా వృద్ధులు, వివిధ రకాల వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి ఇబ్బంది కలగకుండా సూర్యోదయం తర్వాతే పింఛన్లు పంపిణీ చేయాలని సెర్ప్ సీఈవో రాజాబాబు సూచించారు.
► మరోవైపు పింఛన్ల పంపిణీకి అవసరమైన నగదును గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులు మంగళవారమే బ్యాంకుల నుంచి డ్రా చేసి, వలంటీర్లకు పంపిణీ చేశారు.
► లాక్‌డౌన్ కొనసాగుతున్న కారణంగా పింఛన్ల పంపిణీలో సమస్యలు, ఇబ్బందులు తలెత్తినా వెంటనే పరిష్కరించడానికి ప్రతి జిల్లాలోని డీఆర్‌డీఏ కార్యాలయంలో, రాష్ట్ర స్థాయిలో సెర్ప్ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌లను ఏర్పాటు చేశారు.