శిశువులందరికీ ‘పెంటావాలెంట్’ వేయండి | 'pentavalent' step on children | Sakshi
Sakshi News home page

శిశువులందరికీ ‘పెంటావాలెంట్’ వేయండి

Published Wed, May 6 2015 2:08 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM

శిశువులందరికీ ‘పెంటావాలెంట్’ వేయండి

శిశువులందరికీ ‘పెంటావాలెంట్’ వేయండి

డబ్ల్యూహెచ్‌వో, యునిసెఫ్ విజ్ఞప్తి
దుష్ఫలితాలు ఉండవని స్పష్టీకరణ
వారానికి రెండు రోజులు అందుబాటులో టీకా
11 లేదా 12 నుంచి తెలంగాణలో ప్రారంభం

 
హైదరాబాద్: ఐదు ప్రమాదకర వ్యాధులైన కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం, హెపటైటిస్-బి, హెమోఫిలస్ ఇన్‌ఫ్లూయెంజాలను ఒకే మందుతో నిలువరించే పెంటావాలెంట్ టీకాను పుట్టిన ప్రతి బిడ్డకూ వేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యుహెచ్‌వో) ప్రతినిధి డాక్టర్ కె.ఎన్.అరుణ్‌కుమార్, యునిసెఫ్ ప్రతినిధి డాక్టర్ సంజీవ్ ఉపాధ్యాయ, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జయకుమార్, జోగారావు, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సుదర్శన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ టీకాను ఈ నెలలో ప్రారంభిస్తున్న నేపథ్యంలో వారు మంగళవారం మీడియా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న టీకా కార్యక్రమంలో డీపీటీ, హెపటైటిస్-బి ఇప్పటికే ఉన్నాయని... ఇప్పుడు హిబ్ టీకాను కొత్తగా చేరుస్తున్నామన్నారు. వీటి కలయికనే పెంటావాలెంట్ టీకా అంటారని వివరించారు. హిబ్ టీకాతో హెమోఫిలస్ ఇన్‌ఫ్లూయెంజా టైప్-బి వల్ల కలిగే తీవ్రమైన న్యూమోనియా, మెనింజైటిస్, బ్యాక్టిరీమియా, గొంతువ్యాధులు, సెప్టిక్ అర్ధరైటిస్ వంటి తీవ్రమైన వ్యాధులను నివారించవచ్చన్నారు. పెంటావాలెంట్ టీకా వల్ల శిశువులకు ఇచ్చే ఇంజెక్షన్లు తగ్గుతాయని... ఐదు ప్రాణాంతక వ్యాధుల నుంచి కూడా రక్షణ పెరుగుతుందన్నారు.

తెలంగాణలో 6.31 లక్షల మంది చిన్నారులకు టీకా..
పెంటావాలెంట్ టీకాను ఈ నెల 7న ఏపీలోని తిరుపతిలో సీఎం చంద్రబాబు  చేతుల మీదుగా ప్రారంభిస్తున్నామన్నారు. 9వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో టీకా అందుబాటులోకి రానుందన్నారు. తెలంగాణలోని వరంగల్‌లో ఈ నెల 11 లేదా 12న ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి వారంలో రెండ్రోజులు టీకాను అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రుల్లో నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో 6.31 లక్షల మంది, ఏపీలో 8.36 లక్షల మంది పిల్లలను పెంటావాలెంట్ టీకా వేయడానికి గుర్తించామన్నారు.

ఏటా రెండు తెలుగు రాష్ట్రాల్లో 15 లక్షల మంది శిశువులు జన్మిస్తున్నారని, పుట్టిన ప్రతి బిడ్డకూ 3-6 నెలల మధ్య ఈ టీకా వేయాలన్నారు. పుట్టిన వెంటనే శిశువులకు 24 గంటలలోపు ఇచ్చే హెపటైటిస్-బి మోతాదు యథావిధిగా కొనసాగుతుందని, 16-24 నెల లు, 5-6 ఏళ్ల డీపీటీ బూస్టర్లు ఇంతకుముందులాగే కొనసాగుతాయని,  పెంటావాలెంట్ టీకాతో శిశువుకు ఇచ్చే ఇంజెక్షన్లు 9 నుంచి 3కు తగ్గుతా యని చెప్పారు. ప్రస్తుతం ఉన్నట్లుగా కాకుండా టీకా షెడ్యూల్ మారుతుందన్నారు. ప్రభుత్వం ఈ టీకాలను ఉచితంగా ఇస్తుందన్నారు. ఈ టీకాతో భయపడాల్సిన పనిలేదని, దీనిపై మీడియా కూడా అవగాహన లేకుండా ఏమీ రాయరాదని విన్నవించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement