
పట్నా: కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి అడ్డుకట్టకు భారత్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇక మూడో వేవ్ ప్రమాదం ఉందని అదీ పిల్లలపై అధికంగా ప్రభావం చూపనున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో చిన్నారులపై పట్నా ఎయిమ్స్‌లో కోవాగ్జిన్ వ్యాక్సిన్ ట్రయల్స్‌ను ప్రారంభించారు. ఈ ట్రయల్స్‌లో భాగంగా సుమారు 70 నుంచి 80 మంది చిన్నారులను ఎంపిక చేసుకొని వాక్సిన్ ఇవ్వనున్నట్లు పట్నా ఎయిమ్స్ సూపరెంటెండెంట్ డాక్టర్ సీఎం సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సిన్లు ఇవ్వనున్న పిల్లలకు ఆర్టీ పీసీర్, యాంటిజెన్ పరీక్షలు ముందే జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ పరీక్షల్లో కరోనా నెగటివ్ వచ్చిన వారిపై మాత్రమే ట్రయల్స్ జరపనున్నట్లు పేర్కొన్నారు. అదే క్రమంలో తరచూ పిల్లల ఆరోగ్య పరిస్థితులను సమీక్షించనున్నట్లు తెలిపారు. 2 సంవత్సరాల నుంచి 18 ఏళ్ల మధ్య వయసు ఉన్న చిన్నారుల పై ట్రయల్స్ నిర్వహించేందుకు డీజీసీఐ అనుమతినిచ్చింది. పట్నాలో ఈ ట్రయల్స్ నమోదుకు కోసం జాబితాలో ఓ 13 ఏళ్ల కుర్రాడు తొలుత పేరును నమోదు చేసుకున్నట్లు డా.సింగ్ తెలిపారు. ట్రయల్స్‌లో పాల్గొనే పిల్లలకు ఆస్పత్రి రావాణా అలవెన్స్ కింద 1000 ఇవ్వనున్నట్లు తెలిపారు. పిల్లలపై ట్రయల్స్ నిర్వహించేందుకు భారత్ బయోటెక్ సంస్థకు గత మే 11వ తేదీన డీజీసీఐ అనుమతినిచ్చింది. ఇక పట్నా ఎయిమ్స్‌తో పాటు ఢిల్లీలోని ఎయిమ్స్, నాగపూర్‌లోని మెడిట్రినా హాస్పిటళ్లలోనూ ఈ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి పొందారు. కాగా దేశంలో ప్రస్తుతం 18 ఏళ్ల వయసు దాటిన వారికి మాత్రమే టీకాలు ఇస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment