మాస్కులు కాదు.. మనసు పెట్టండి  | Sakshi Special Interview With Dr Preetham Kumar Poduturi | Sakshi
Sakshi News home page

మాస్కులు కాదు.. మనసు పెట్టండి 

Published Sat, Sep 5 2020 3:57 AM | Last Updated on Sat, Sep 5 2020 4:45 AM

Sakshi Special Interview With Dr Preetham Kumar Poduturi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఎదుగుతున్న దశలో చిన్నారుల ఆరోగ్య, మానసిక పరిస్థితులపై కరోనా వైరస్‌ కనిపించని ప్రభావం చూపుతోంది. నెలల తరబడి ఇంట్లో ఉండాల్సి రావడం, పదేపదే తమ చుట్టూ కరోనా గురించిన మాటలే వినిపిస్తుండటం, వారికి పరిమితస్థాయిలోనైనా అందుబాటులో ఉండే స్నేహితులు దూరం కావడం, ఆన్‌లైన్‌ పాఠాలు, మొబైల్‌ గేమ్స్, టీవీల కారణంగా స్క్రీన్‌ టైం ఎక్కువ కావడం ఇందుకు కారణాలవుతున్నాయి. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో చిన్నారులను కాపాడుకోవాల్సింది వారి తల్లిదండ్రులే. ఈ మహమ్మారి పీచమణిచే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే వరకు వారిని కంటికిరెప్పలా కాపాడుకోవాలి.

ముఖ్యంగా పిల్లలు మానసిక ఒత్తిడికి లోనుకాకుండా చూసుకోవాలి’అని సూచిస్తున్నారు ప్రముఖ పీడియాట్రిక్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ ప్రీతమ్‌ కుమార్‌ పొద్దుటూరి. ఈ సమయంలో పిల్లలకు మాస్కులు పెట్టినంత మాత్రాన తల్లిదండ్రుల బాధ్యత తీరిపోదని, మనసు పెట్టి వారిని పట్టించుకోవాలని చెబుతున్నారు. రాష్ట్రంలోని వేలాది మంది చిన్నారులు ఈ మాయదారి కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో అసలు ఈ మహమ్మారి చిన్నారుల దరి చేరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైరస్‌ సోకినవారిలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి, పిల్లలను ఈ సమయంలో పాఠశాలలకు పంపాలా వద్దా, ఆన్‌లైన్‌ పాఠాలు మేలు చేస్తాయా, కీడు తలపెడతాయా తదితర అంశాలపై శుక్రవారం ఆయన ’సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 

పెద్దల మందులు పిల్లలకు వాడలేం 
పెద్ద వారికి సోకుతున్న విధంగానే కరోనా వైరస్‌ పిల్లల శరీరంలోకి ప్రవేశిస్తుంది. అయితే, అది పిల్లల ద్వారా పిల్లలకు, పిల్లల ద్వారా పెద్దలకు, పెద్దల ద్వారా పిల్లలకు సులభంగా సంక్రమించే అవకాశం ఉంది. వైరస్‌ సంక్రమణే కాదు.. ఎక్కువ లోడ్‌ అయ్యే చాన్స్‌ కూడా పిల్లల్లో ఎక్కువ. ఒకవేళ వైరస్‌ సోకితే పెద్దలకు వాడే అన్ని మందులనూ పిల్లలకు ఉపయోగించలేం. అయితే, చాలామంది పిల్లల్లో అసలు కోవిడ్‌ లక్షణాలు కనిపించడంలేదు. ఇతర ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వచ్చినప్పుడు చేసే యాంటీజెన్‌ టెస్టు ద్వారా వారికి కోవిడ్‌ వచ్చిపోయిందని తెలుసుకోవాల్సి వస్తోంది.  

నెల రోజులుగా ఎంఐఎస్‌సీ కనిపిస్తోంది 
వైరస్‌ సోకి తగ్గిన తర్వాత 2–3 వారాల్లో ఆరోగ్య సమస్యలు వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. గత నెలరోజుల్లో దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. దీన్ని మల్టీ సిస్టమ్‌ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్‌ ఇన్‌ చిల్డ్రన్‌ (ఎంఐఎస్‌సీ) అంటారు. ఈ సిండ్రోమ్‌ వచ్చిన చిన్నారులు ఒక్క హైదరాబాద్‌లోనే వందల మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అదే అమెరికాలో ఇప్పటి వరకు  (ఆగస్టు 20 వరకు) కేవలం 700 మందిలో మాత్రమే ఈ లక్షణాలు కనిపించాయి. చిన్నారులకు ఊపిరితిత్తులు, కాలేయం, గుండె జబ్బులు వస్తున్నాయి. గుండెలోని రక్తనాళాలు ఉబ్బి పగిలిపోయే వరకు వస్తోంది. దీన్ని ’కవాసాకి’గా వ్యవహరిస్తారు. ఇలాంటి సందర్భాల్లో మాత్రం వారికి మెరుగైన చికిత్స అందించాలి. కోవిడ్‌ కంటే పోస్ట్‌ కోవిడ్‌ చికిత్స చాలా ముఖ్యం.  

వారికి మాస్క్‌ వద్దు... ఇల్లే ముద్దు..  
చిన్నారులు ఈ వైరస్‌ బారిన పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఐదేళ్ల లోపు పిల్లలకు మాస్కులు పెట్టడం సరైంది కాదు. ఎందుకంటే ఆ మాస్క్‌ వల్ల వారి శ్వాసలో ఏదైనా ఇబ్బంది వచ్చినా వారు చెప్పలేరు. ఇక, 7–8 ఏళ్ల పిల్లలు తల్లిదండ్రులు చెప్పే విషయాలను అర్థం చేసుకోలేరు. వారికి మాస్క్‌ అనివార్యత అర్థం కాదు. ఐదేళ్ల తరువాతి పిల్లలకు పెట్టే మాస్కులు చాలా శుభ్రంగా ఉండాలి. మాస్కు తీయకుండా ఉండాలని వారి మనస్సుకు తట్టేలా చెప్పాలి. ఏ వయసు వారయినా ఇంట్లోనే ఉంచాలి. బయటకు వెళ్లనివ్వొద్దు. చుట్టుపక్కల ఉండే కుటుంబాల్లోని పెద్దలను దృష్టిలో పెట్టుకొని ఇతర పిల్లలతో ఆటలకు పంపకుండా ఉండడమే మంచిది. దానికి సులువైన పరిష్కారం లేదు. 

గాబరా వద్దు
కరోనా సోకిన చిన్నారులు తీవ్ర అనారోగ్యానికి గురి కావడం, వెంటిలేటర్‌ చికిత్స వరకు వెళ్లడం చాలా తక్కువగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇలా ఇబ్బందులు పడిన చిన్నారులు 0.06 శాతం మాత్రమేనని విశ్లేషణలు చెబుతున్నా యి. తగిన చికిత్సా పద్ధతులు అవలంబిస్తే వారి ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులకు ఆందోళన అవసరం లేదు. పిల్లలకు వైరస్‌ సోకితే, హోం ఐసోలేషన్‌లో ఉంచడమే మంచిది. జ్వరం, ఒళ్లు నొప్పు లు, గొంతు నొప్పి, దగ్గు, జ్వరం (లక్షణాలు కనిపిస్తే) పూర్తిగా తగ్గే వరకు చికిత్స అందించాలి. బలవర్ధకమైన ఆహారం, వీలైతే వ్యాయామం, ఆవిరి పట్టే ప్రక్రియ కరోనా బారి నుంచి బయటపడేందుకు మేలు చేస్తాయి. కానీ, ఏదైనా డాక్టర్ల సలహా మేరకే చేయాలి. గాబరా పడాల్సిన అవ సరం లేదు. ఆ సమయంలో వారిని ఇతర వ్యాపకాల వైపు మళ్లించాలి. కరోనా వైరస్‌ సోకిందనే మాటలు చిన్నారులకు వినపడేలా చర్చించకూడదు. ఇరుగు పొరుగు పిల్లలకు, కరోనా సోకినవారికి మానసిక అగాథాన్ని కలిగించే విధంగా తల్లిదండ్రులు వ్యవహరించకూడదు.

పిల్లలు స్కూల్‌కి వెళ్లాలా వద్దా..
ఇక, కరోనా కారణంగా పిల్లలు స్కూల్‌కి వెళ్లాలా వద్దా అన్నది ఇప్పుడు ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. కానీ, దీనికి అంత సులువైన పరిష్కారం లేదు. ఇందుకు రెండు కారణాలున్నాయి. పిల్లలు ఈ పరిస్థితుల్లో బడికి వెళితే వైరస్‌ విస్తృతంగా వ్యాపించే అవకాశాలు ఎక్కువ. అలాగని ఇంట్లోనే ఉంటే మానసిక సమస్యలు వస్తున్నాయి. ఇక, ఆన్‌లైన్‌ పాఠాల విషయానికి వస్తే విద్య ఏ రూపంలో నేర్చుకున్నా మంచిదే. కానీ, టీచర్‌ ఎదురుగా ఉండి చెప్పేదానికి, స్క్రీన్‌ మీద కనిపించి బోధించడానికి చాలా తేడా ఉంటుంది. ఆ పరిస్థితుల్లో గురుశిష్యుల బంధం ఉండదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఏది ఏమైనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే వరకు వారిని బయటకు పంపకుండా ఉండడమే మంచిది. నెలల తరబడి ఇంట్లో ఉన్న చిన్నారుల ప్రవర్తన పట్ల విసుగు చెందవద్దు. వారికి ఈ సమయంలో తల్లిదండ్రుల ప్రేమ కావాలి. మీరు అందించే మానసిక స్థైర్యమే వారికి కొండంత బలం. మీ ఆప్యాయత, అనురాగాలే నిజమైన సంజీవని’సో, తల్లిదండ్రులూ.. మీ పిల్లల్ని ఈ కష్టకాలంలో మరింత ప్రేమగా చూసుకుంటారు కదూ..! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement