సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారిని నిలువరించే వ్యాక్సిన్ ఎప్పటికి వస్తుందో నిర్దిష్టమైన అంచనాల్లేవు కానీ... ఆ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఎన్ని దేశాలకు ఎన్ని డోసులు అవసరమవుతాయి, ఎన్ని దేశాలు ఈ వ్యాక్సిన్ ముందే కొనుగోలు చేసుకుంటాయి, ఎన్ని దేశాలు ఈ వ్యాక్సిన్ కూడా దొరక్క అవస్థలు పడతాయన్న దానిపై మాత్రం అంచనాలు ఓ కొలిక్కి వస్తున్నాయి. తాజాగా గ్లోబల్ ప్రిపేర్డ్‌నెస్ మానిటరింగ్ బోర్డు (జీపీఎంబీ) ఇచ్చిన నివేదిక ప్రకారం కోవిడ్ వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చినా మొత్తం తయారయిన వ్యాక్సిన్ డోసుల్లో కేవలం 12 శాతం మాత్రమే 50 శాతం ప్రపంచానికి అందుబాటులో ఉంటాయట. ప్రపంచంలోని ఐదారు దేశాలు మిగతా 88 శాతం డోసులు కొనుగోలు చేసేస్తాయట. ఈ మేరకు ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ, ఆస్ట్రాజెనెకా కంపెనీలతో ఆయా దేశాలు ఒప్పందాలు కూడా చేసేసుకున్నాయని జీపీఎంబీ నివేదిక వెల్లడించింది.
భారత్‌కే ఎక్కువ
జీపీఎంబీ నివేదిక ప్రకారం తొలిదశలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా తయారయ్యే కోవ్యాక్స్ (భారత్‌లో ఆక్స్‌ఫర్డ్ టీకాను కోవిషీల్డ్ పేరుతో విడుదల చేస్తారు) డోసుల్లో సింహభాగం భారతదేశానికి అవసరపడుతాయి. ఎంతగా అంటే మొత్తం తయారయ్యే వ్యాక్సిన్లలో 41శాతం డోసులు మనం కొనుగోలు చేసి సమకూర్చుకోవాల్సిందే. ఈ మేరకు భారత్‌తో పాటు పలు దేశాలు వ్యాక్సిన్ తయారీ కంపెనీలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయని ఆ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం భారత్ తర్వాత యూరోపియన్ యూనియన్, ఆ తర్వాత అమెరికా, చైనా, బ్రెజిల్, యూకే, ఆస్ట్రేలియా దేశాలు... ఎక్కువ డోసులు అవసరమయ్యే, కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్న జాబితాలో ఉన్నాయి.
ఈ లెక్క ప్రకారం ఈ ఆరు దేశాలు, ఈయూ కలిపి మొత్తం తయారయ్యే వ్యాక్సిన్ డోసుల్లో 88 శాతం తీసుకుంటే, ఇక మిగిలిన 50 శాతం ప్రపంచానికి అందుబాటు లో ఉండేది 12 శాతమేనంట. ఇదే నిజమైతే కోవిడ్ మహమ్మారిని అంతం చేయడం జరిగే పనికాదని, వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చుకోలేని దేశాల్లో ఇది మరింత ప్రబలి వ్యాక్సిన్లు సమకూర్చుకున్న దేశాలపైనా ప్రభావం చూపుతుందని జీపీఎంబీ నివేదిక వెల్లడించింది. అందుకే తాము కోవ్యాక్స్ పేరుతో ప్రపంచంలోని పేద, మధ్య తరగతి దేశాలకు తగినన్ని వ్యాక్సిన్ డోసులు పంపేలా ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment