సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ సోకి తీవ్రమైన లక్షణాలతో ఐసీయూలో ఉన్న రోగులపై కార్టికో స్టెరాయిడ్ ప్రయోగించి సత్ఫలితాలు సాధించినట్లు ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ 4 రోజులక్రితం అంతర్జాతీయ వేదికగా ప్రకటించింది. కార్టికో స్టెరాయిడ్ రకానికి చెందిన డెక్సామెథజోన్ మందుతో ఐసీయూలో ఉన్న పేషెంట్లు వేగంగా కోలుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ విషయా న్ని ఆక్స్‌ఫర్డ్ ప్రకటించడం కంటే ముందే భారత్.. కరోనా చికిత్సలో కార్టికో స్టెరాయిడ్ వినియోగిస్తోంది. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం ఈ డ్రగ్‌ను వినియోగించవచ్చనే సూచనల్ని బట్టి చూస్తే ఆ క్రెడిట్ భారత్‌కే దక్కుతుందని భారత వైద్యుల అసోసియేషన్ అభిప్రాయపడుతోంది.
కార్టికో స్టెరాయిడ్ రకానికి చెందిన మిథైల్ ప్రిడ్నిసలోన్ మందును తమిళనాడులోని ఆస్పత్రులు 2 నెలల క్రితం నుంచే ఐసీయూలోని పేషెంట్లకు వినియోగిస్తున్నారు. తొలుత చెన్నై స్టాన్లీ మెడికల్ కాలేజీలో ఈ డ్రగ్‌ను వినియోగించగా..ఆ తర్వాత మద్రాస్ ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఎక్కువ మందిపై ప్రయోగించారు. చెన్నైలో 35 వేలకు పైగా కేసులు నమోదైనా.. మరణాల రేటు 1.1% మాత్రమే. ఈ ఆస్పత్రుల్లో కార్టికోస్టెరాయిడ్ డ్రగ్ తీసుకున్న పేషెంట్లు అత్యధికులు త్వరితంగా కోలుకున్నారు. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలోనూ ఐసీయూలో ఉన్న కొందరు పేషెంట్లపై ఈ డ్రగ్‌ను వినియోగించారు. దీంతో వారంతా త్వరితంగా కోలుకున్నట్టు గుర్తించారు.
ఈ డ్రగ్ పనిచేస్తుందిలా..
సాధారణంగా శరీరంలోకి వైరస్ ప్రవేశించిన వెంటనే ప్రధాన అవయవాలపై వేగంగా దాడిచేస్తుంది. రోగ నిరోధకశక్తిపై ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో సైటోకైన్లు విడుదలవుతాయి. ఇవి ఎక్కువ సంఖ్యలో విడుదలైతే దుష్ప్రభావాలు మొదలవుతాయి. రోగం తాలూకు లక్షణాలు క్రమంగా పెరగడంతో పేషెంట్లను ఐసీయూలో చేర్చాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో ఐసీయూ పేషెంట్లపై కార్టికోస్టెరాయిడ్ రకానికి చెందిన మిథైల్ ప్రిడ్నిసలోన్‌ను ప్రయోగించారు. ఈ మందు సైటోకైన్ల దూకుడును తగ్గిస్తుంది. ఫలితంగా రోగి త్వరితంగా కోలుకుంటాడు. ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ రకం డ్రగ్‌ను పరిశీలన– పరిశోధన (అబ్జర్వేషన్ స్టడీ)లో భాగంగా ప్రయోగించినట్లు మద్రాస్ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలోని మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ విభాగాధిపతి డాక్టర్ ఎల్.పార్థసారథి తెలిపారు. పేషెంట్ రక్తంలో ఇన్ఫెక్షన్ నమూనాలను పరిశీలించాక ఈ మందును పామ్ (పీఏఎల్‌ఎం) థెరపీలో ప్రయోగిస్తున్నామని, దీంతో పేషెంట్లు త్వరగా కోలుకున్నారన్నారు. పేషెంట్ స్థితి ఆధారంగా డ్రగ్ డోసు పెంచుతామని, ఈ మందు శరీరంలోకి ప్రవేశించిన తర్వాత 24 గంటల నుంచి 36 గంటల వరకు పనిచేస్తుందని ఆయన వివరించారు. నేరుగా ఊపిరితిత్తులపైనే ఈ మందు పనిచేస్తుండటంతో దీన్ని ఎంచుకున్నట్లు చెప్పారు. డెక్సామెథజోన్ శరీరంలో 36 గంటల నుంచి 48 గంటల పాటు పనిచేస్తుందని, మిథైల్ ప్రిడ్నిసలోన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా పెద్దగా ఉండవన్నారు.
మరణాల రేటు తక్కువగా..
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కరోనా వైరస్ సోకిన రోగులు త్వరగా కోలుకునేలా చేయడంతో పాటు మరణాల రేటును తగ్గించడంలోనూ వైద్యులు కీలకపాత్ర పోషిస్తున్నారు. కార్టికో స్టెరాయిడ్ శాశ్వత పరిష్కారం కానప్పటికీ రోగి కోలుకోవడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీన్ని ఎక్కువగా వినియోగిస్తున్న చెన్నైలో తక్కువ మరణాలు నమోదవుతున్నాయి. అక్కడి మరణాల రేటు 1.1% ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆ తర్వాత హైదరాబాద్ జిల్లా వరకు మాత్రమే పరిశీలిస్తే 1.2% డెత్ రేట్ ఉంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రయోగాలు మొదలుపెట్టే నాటికే చెన్నై, హైదరాబాద్‌లో ఈ మందుపై అబ్జర్వేషన్ స్టడీ ప్రారంభించినట్లు ప్రభుత్వ వైద్య కళాశాల (నిజామాబాద్) అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ మాదల తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment