- నిధులు విదల్చని చంద్రబాబు సర్కార్
- సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్న కళాశాలలు
- ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్న విద్యార్థి సంఘాలు
తిరుపతి : ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించదు.. బకాయిలు చెల్లించనిదే కళాశాలల యాజమాన్యాలు కోర్సు పూర్తి అయిపోయినా విద్యార్థులకు టీసీ తదితర సర్టిఫికెట్లు ఇవ్వవు. ఫలితంగా పైచదువులకు వెళ్లాలనుకునే పేద విద్యార్థులు నలిగిపోతున్నారు. సర్టిఫికెట్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు కాళ్లరిగేలా కళాశాలల చుట్టూ తిరుగుతున్నారు.
డబ్బు లేక చదువు మధ్యలో ఆగి పోరాదు. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలనే మహోన్నత లక్ష్యంతో దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి 2008 అక్టోబర్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆయన చనిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పేద విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. బీసీ, ఎస్‌సీ విద్యార్థులకు ప్రీ, పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, ట్యూషన్, స్పెషల్ ఫీజు చెల్లింపులకు విఘాతం ఏర్పడింది.
ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం జిల్లాలో 55 వేల మంది బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లకు సంబంధించి రూ.80 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. 32 వేల మంది ఎస్‌సీ విద్యార్థులకు రూ.47 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు 22 వేల మందికి 30 కోట్లు చెల్లించారు. 1500 మంది ఎస్‌టీ విద్యార్థులకు రూ.2 కోట్లు, 2300 మంది మైనారిటీ విద్యార్థులకు రూ.3 కోట్లు వంతున చెల్లించాల్సి ఉంది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ప్రభుత్వం మంజూరు చేస్తుందన్న నమ్మకం లేక ఇటీవల ఎస్వీయూలో పీజీ అడ్మిషన్లు జరిగినపుడు ఓసీ కేటగిరీ విద్యార్థుల నుంచి అధికారులు ముందుజాగ్రతగా మొత్తం ఫీజు కట్టించుకున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించని ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యా సంవత్సరం పూర్తిచేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా కళాశాలల యాజమాన్యాలు వేధిస్తున్నాయి. దీనిపై విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి.
విద్యారంగం పట్ల నిర్లక్ష్యం
ప్రభుత్వం తీరు చూస్తుంటే విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లుంది. పేద విద్యార్థులు ఎదగడం ప్రభుత్వానికి ఇష్టం లేనట్లుంది. కోట్లాది రూపాయ ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా వారి జీవితాలతో ఆటలాడుతోంది. ప్రభుత్వ వైఖరి మారాలి. ఫీజు రీయిం బర్స్‌మెంట్ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలి.
- పద్మ, ఎస్వీయూ పీజీ విద్యార్థిని
సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు
ఫీజు బకాయిలు ఉన్నాయం టూ కళాశాల యాజమాన్యా లు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ‘ప్రభుత్వం నిధులు మంజూ రు చేయక పోతే ఎలా? మేము నష్టపోవాలా?’ అని కళాశాలల యాజమాన్యాలు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నాయి. తక్షణం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించి ప్రభుత్వమే సమస్యకు పరిష్కారం చూపాలి.
- శ్రావణ్, పీజీ విద్యార్థి
కంప్లయింట్లు అందుతున్నాయి
ఫీజు బకాయిలను సాకుగా చూపి ప్రైవేట్ కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని పడమటి మండలాల నుంచి కంప్లయింట్లు వచ్చాయి. వాటి ని పరిశీలిస్తున్నాం. అయితే ప్రభుత్వ కళాశాలలపై ఎక్కడా ఇలాంటి ఫిర్యాదులు అందలేదు. ఏది ఏమైనా విద్యార్థులను ఇబ్బంది పెట్టే చర్యలను ఉపేక్షించం.
- జీఎల్.నాగభూషణం, ఆర్‌ఐవో