
తీర్మానం విషయూన్ని వెల్లడిస్తున్న ఎంపీపీ రాజ్యలక్ష్మి
తాడేపల్లి: గుంటూరు జిల్లా పెనుమాక, ఉండవల్లిలో భూసేకరణ జరుపరాదంటూ, మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. తాడేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కత్తిక రాజ్యలక్ష్మి ఆధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో రాజధాని భూసేకరణలో భాగంగా ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో రైతుల పంట పొలాలు తీసుకోరాదంటూ తీర్మానాన్ని మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు బురదగుంట కనకవల్లి ప్రతిపాదించారు. దీనికి ఎంపీటీసీ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు.
అలాగే, మండల పరిధిలో ఉన్న 13 ప్రాదేశిక నియోజకవర్గాల అభివృధ్ధికి రూ.26 లక్షలు కేటారుుస్తున్నట్టు రాజ్యలక్ష్మి ప్రకటించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు దండమూడి శైలజారాణి, ఇన్ చార్జి ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యులు పాటిబండ్ల కృష్ణమూర్తి, మేకా హనుమంతరావు, డి.బ్రహ్మానందరావు, ఈదులమూడి శేఖర్, బిరుదుగడ్డ శేషయ్య, అన్నుల దేవి, బి.స్వర్ణకుమారి, గరిక అనిత, జముడుగలిన సుబ్బాయమ్మ, గోడవర్తి సంధ్యాదేవి, సర్పంచులు పాల్గొన్నారు.
సీఎం చంద్రబాబుకు అన్నదాతల లేఖలు
భూసేకరణ పేరుతో తమకు అన్యాయం చేయొద్దంటూ గుంటూరు జిల్లా ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు చెందిన రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు 1,001 ఉత్తరాలు రాశారు. రాజధాని భూసేకరణ పేరుతో ఏడాదికి మూడు పంటలు పండే, సారవంతమైన భూములు ఇవ్వడం తమకు ఇష్టం లేదని, చట్టబద్ధత లేని ల్యాండ్‌పూలింగ్ విధానం వల్ల తాము ఆర్థికంగా నష్టపోతామని ఆ లేఖల్లో పేర్కొన్నారు.
విజయవాడ తమ ప్రాంతాలకు 2 కిలోమీటర్ల పరిధిలో ఉండటం వల్ల భవిష్యత్తులో ఇంతకంటే మంచి రేట్లు వస్తాయని, అలాంటప్పుడు, తమ పంట భూములను వదులుకోవడానికి సిద్ధంగా లేమని వారు స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వం బలవంతంగా భూములను ల్కాంటే, ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని పునరుద్ఘాటించారు.