రాజధానిలో ఆగని కక్షసాధింపు చర్యలు | TDP Govt harassing AP capital region farmers | Sakshi
Sakshi News home page

రాజధానిలో ఆగని కక్షసాధింపు చర్యలు

Published Thu, Apr 7 2016 7:30 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

సర్వేయర్లు పాతిన కర్రలను పీకేస్తున్న రైతులు - Sakshi

సర్వేయర్లు పాతిన కర్రలను పీకేస్తున్న రైతులు

రైతుల అనుమతి లేకుండా సర్వేలు
సర్వే కర్రలు పీకేస్తున్న రైతులు

 
తాడేపల్లి రూరల్: రాజధాని గ్రామాలైన గుంటూరు జిల్లాలోని ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయపాలెం తదితర ప్రాంతాల్లో భూసమీకరణకు భూములు ఇవ్వని రైతులను ప్రభుత్వం నిరంతరం ఏదో విధంగా భయభ్రాంతుల్ని చేస్తూనే ఉంది. బుధవారం కొత్తగా మళ్లీ ప్రైవేటు సర్వేయర్లను ఏర్పాటు చేసి సర్వే చేయించి కర్రలు పాతారు. ఈ తంతు అంతా రైతులు పొలాల్లో లేనప్పుడు మాత్రమే చేస్తున్నారు. ఇది తెలుసుకున్న రైతులు సర్వే చేసి కర్రలు పాతుతున్నవారిని అడ్డుకుని తమ పొలాల్లో కర్రలు ఎందుకు పాతుతున్నారని ప్రశ్నిస్తే సీఆర్‌డీఏ అధికారుల సూచన మేరకు సర్వేచేసి కర్రలు పాతుతున్నట్లు చెబుతున్నారు.

గ్రామాల్లోని సీఆర్‌డీఏ కార్యాలయ ఉద్యోగులను రైతులు ప్రశ్నిస్తే తమకేమీ తెలియదని వారు సమాధానం ఇస్తున్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు తమ పొలాల్లో ఏర్పాటు చేసిన సర్వే పుల్లలను పీకేస్తున్నారు. ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లోని సుమారు 80 ఎకరాలకు సర్వే నిర్వహించి, కర్రలు పాతారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు వాటిని పీకేశారు. పెనుమాకలో రైతులు తిరగబడేందుకు సిద్ధమవడంతో సర్వేయర్లు వెళ్లిపోయారు.
 
పూలింగ్‌కు ఇవ్వని పొలాల్లో ఎలా సర్వే చేస్తారు?
రాజధానికి భూములు ఇవ్వకపోవడంతో మొదటి నుంచి ప్రభుత్వం రైతులను ఏదో విధంగా భయాందోళనలకు గురిచేస్తోంది. కొత్తగా ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ హైవే అంటూ పచ్చని పంట పొలాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. కరకట్ట వెంబడి పూలింగ్‌కు ఇచ్చిన పొలాలున్నాయి. వాటిలో రోడ్లు నిర్మించకుండా పూలింగ్‌కు ఇవ్వని పొలాల్లో రోడ్లు ఎలా నిర్మిస్తారు? ఎలా సర్వే చేస్తారు? సీఆర్‌డీఏ అధికారులే తేల్చాలి.
 - బత్తుల శంకర్, ఉండవల్లి
 
రైతులు తిరగబడేరోజు దగ్గర్లో ఉంది
రైతుల  సహనాన్ని సీఆర్‌డీఏ అధికారులు చేతగాని తనం అనుకుంటున్నారు. బ్యాంకుల్లో రుణాలు ఇవ్వకుండా వ్యవసాయాధికారులు సలహాలు ఇవ్వకుండా తప్పుడు కేసులు పెట్టి రైతులను అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వం ఇలాగే ప్రవర్తిస్తే రైతులు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది.
 - విశ్వనాథరెడ్డి, పెనుమాక
 
అన్నదాత తెగబడతాడు
కోర్టులను ఆశ్రయించాం.. తీర్పు రైతులకు అనుకూలంగా ఇచ్చింది. అయినా ప్రభుత్వం రైతులను భయభ్రాంతుల్ని చేయడం మానడంలేదు. ఇలాగే ప్రభుత్వం చేస్తుంటే కడుపు మండిన అన్నదాత తెగబడతాడు. ప్రభుత్వం అది గమనించాలి. రైతుకు పంటలో నష్టం వస్తే తిరిగి మళ్లీ పంట వేస్తాడు తప్ప పొలాన్ని అమ్ముకోడు. అలాంటి మమ్ములను రాజధాని పేరుతో ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తోంది.  
 - గాదె సాంబశివరావు, ఉండవల్లి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement