
పవన్ వ్యాఖ్యలను పరోక్షంగా తప్పుబట్టిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం 33వేల ఎకరాలు అవసరమా అన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరోక్షంగా తప్పుబట్టారు. ఎన్ని ఎకరాల్లో అయినా రాజధానిని నిర్మించుకోవచ్చని ఆయన అన్నారు. గురువారం చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజధానిని ఎన్ని ఎకరాల్లో కావాలంటే అన్ని ఎకరాల్లో కట్టుకోవచ్చని అన్నారు.
రాజధాని అంటే నాలుగు బిల్డింగ్లు కాదని, ప్రజల భవిష్యత్ కోసమే రాజధాని నిర్మాణమని చంద్రబాబు పేర్కొన్నారు. బలవంతంగా భూములు లాక్కోవటం లేదని, రైతులు స్వచ్ఛందంగానే భూములు ఇస్తున్నారన్నారు. విలేకర్లు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానం ఇస్తూ రాజధాని నిర్మాణంపై పవన్ కల్యాణ చేసిన వ్యాఖ్యల గురించి తనకు తెలియదని అన్నారు.
రాజకీయ పార్టీలకు దూరదృష్టి అవసరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయాలకు పది ఎకరాలు కావాలి కానీ, అదే రాజధాని నిర్మాణానికి వేల ఎకరాలు అవసరం లేదా అని ఆయన ఎదురు ప్రశ్నించారు.