రైతుల కన్నీళ్లతో రాజధాని వద్దు: పవన్ కల్యాణ్
రైతుల కన్నీళ్లతో ఆంధ్రప్రదేశ్ రాజధానికి అంకురార్పణ జరగకూడదని సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన గురువారం ఏపీ రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో పర్యటిస్తున్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో పవన్ కల్యాణ్...రైతులతో ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతు కన్నీరు పెడితే ఆ శోకం రాజధానికి తగులుతుందన్నారు. రైతులు ఆనందంగా భూములు ఇస్తే తీసుకోవాలని అన్నారు. రైతుల బాధను చూడలేకే వారి తరపున పోరాడేందుకే తాను వచ్చానని తెలిపారు.
ఏపీ రాజధాని గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ నిలిపివేయాలని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డెడ్లైన్ పేరుతో ఉండవల్లి ప్రాంత రైతుల భూములను లాక్కోవద్దని ఆయన మంత్రులకు సూచించారు. ఈ విషయంపై మంత్రులతో మాట్లాడతానని, అప్పటి వరకూ రైతులు తమ భూములను ఎవరికీ స్వాధీనం చేయవద్దని పవన్ అన్నారు. అన్యాయం ఎక్కడ జరిగినా ఎదిరిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలపై మాట్లాడేందుకు తాను ఎన్ని రోజులు అయినా విజయవాడలో ఉంటానని పవన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు గొప్ప రాజధాని కావాలని తనకు ఉందని, అయితే రైతుల కన్నీళ్లతో వచ్చే రాజధాని వద్దని ఆయన అన్నారు.