సాక్షి ప్రతినిధి, కడప: నైతిక విలువలు కనుమరుగవుతున్నాయి. చిత్తశుద్ధి లేని ఉద్యమాలు తెరపైకొస్తున్నాయి. గాలివాటం రాజకీయాలు నెరపడంలో ఇప్పటితరం నేతలకు వెన్నతో పెట్టిన విద్యలా మారింది. ప్రాంతీయాభిమానం కన్నా ప్రజాగ్రహం నుంచి తప్పించుకునే ఎత్తుగడలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రాంతానికి ఒక అజెండాతో ఒకే పార్టీ రాజకీయ నాయకులు పరస్పర భిన్న వైఖరిలను ప్రదర్శిస్తున్నారు. ఈకోవలో తెలుగుదేశం పార్టీ ముందు వరుసలో నిలుస్తోంది. చంద్రబాబు కనుసన్నల్లోనే ఉద్యమాలు నిర్వహించేందుకు తెలుగు తమ్ముళ్లు ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. డొంకతిరుగుడు ఉద్యమాలకంటే పార్టీ అధ్యక్షుల తీరుపై నిరసన వ్యక్తం చేయాలని డిమాండ్ చేస్తున్న సీపీఎం వాదనలను సమైక్యవాదులు బలపరుస్తున్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా దిగ్విజయ్‌సింగ్ నియామకం అయ్యాక విభజన వాదం ఒక్కమారుగా ఊపుమీదకు వచ్చింది. రాష్ట్రంలో అడుగు పెట్టగానే తెలంగాణపై నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటన చేశారు. దీంతో ఒక్కమారుగా రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలలో అలజడి ఏర్పడింది. అప్పటి వరకూ స్తబ్ధతగా ఉన్న జాయింట్ యాక్షన్ కమిటీలు ఒక్కమారుగా ఉద్యమబాట పట్టాయి. ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామాలు చేయాలంటూ ఒత్తిడి పెంచారు. ఈనిర్ణయాన్ని స్వాగతిస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాథరెడ్డి, శ్రీనివాసులు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది, ఉపాద్యాయ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య స్పీకర్ పార్మాట్‌లో రాజీనామాలు చేసి జేఏసీ గౌరవాధ్యక్షుడు సీహెచ్‌కు అప్పగించారు. మిగతా ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని ఆయా ప్రాంతాల్లోని సమైక్యవాదుల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీరశివారెడ్డి, కమలమ్మ, ఎమ్మెల్సీ షేక్ హుస్సేన్ రాజీనామాలు చేశారు.
పార్టీ నిర్ణయం ఒకలా... నాయకులు తీరు మరోలా..
రాజకీయ పార్టీల నిర్ణయం ఒకలా ఉంటే సీమాంధ్ర ప్రాంత నాయకుల తీరు మరోలా ఉందని, ఒకే పార్టీలో పరస్పర భిన్న స్వరాలు విన్పిస్తున్నాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. తెలంగాణ ప్రకటన వెలువడగానే తాము ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అప్పట్లో ఆయనపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాన్ని టీడీపీ నేతలు చేపట్టలేదని పలువురు పేర్కొంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నిర్ణయం ప్రకటించగానే సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు పదవులను త్యజించి ఉంటే ఆపార్టీపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉండేదని విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లాలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాత్రమే పదవికి, పార్టీకి రాజీనామా చేసి తన చిత్తశుద్ధిని ప్రదర్శించారు. రాజీనామా తర్వాత కాంగ్రెస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ ఉద్యమిస్తున్నారు. అలాంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి ఉత్పన్నమై ఉంటే యోగ్యకరంగా ఉండేదని పలువురు విశ్వసిస్తున్నారు.
పార్టీలపైనే ఒత్తిడి పెంచాలి....
సమైక్యం కోరుతున్న రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంత కాంగ్రెస్, టీడీపీ నాయకులు వారి పార్టీలపైనే ఒత్తిడి పెంచాలనే డిమాండ్ ఊపుందుకుంటోంది. డొంకతిరుగుడు ఉద్యమాలకు స్వస్తి పలకండి...పార్టీ కావాలో ప్రాంతం కావాలో తేల్చుకోండని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు గురువారం కడపలో పిలువునిచ్చారు. ఈ డిమాండ్‌ను సమైక్యవాదులు బలపరుస్తున్నారు. ఆయా పార్టీల నాయకులు చిత్తశుద్ధి ప్రదర్శించాలని కోరుతున్నారు. పార్టీ అధినేతలు తమ నిర్ణయం మార్చుకునేందుకు ఒత్తిడి పెంచాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ఉద్యమాలు చేస్తున్న నాయకులు పార్టీ సభ్యత్వాన్ని సైతం వదులుకోవాలని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
మనుగడ కోసమే...
Published Sat, Aug 24 2013 4:35 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM
Advertisement
Advertisement