సాక్షి, విజయనగరం : గంట్యాడ మండలానికి చెందిన పి.సరవ అనే వ్యక్తి పట్టణంలోని ఓ ఎలక్ట్రికల్ దుకాణంలో రూ.15 వేల విలువ చేసే ఎలక్ట్రికల్ వస్తువులు కొనుగోలు చేశారు. కాని సదరు వ్యాపారి బిల్లు ఇవ్వలేదు. అడిగితో ఓ చీటీపై రాసిచ్చేశాడు. అలాగే విజయనగరం పట్టణంలోని ఉడాకాలనీకి చెందిన పి.గోపి అనే వ్యక్తి తన వ్యక్తి విజయనగరంలోని ఓ హార్డ్‌వేర్ దుకాణంలో రూ. 15 వేలతో గెడలు, బోల్టులు, తదితర సామగ్రి కొనుగోలు చేశారు. సదరు వ్యాపారి కూడా బిల్లు ఇవ్వలేదు.
బిల్లు ఇవ్వండని గోపి అడగ్గా.. బిల్లు కావాలంటే అదనంగా సొమ్ము చెల్లించాలని వ్యాపారి చెప్పడంతో చేసేది లేక కొనుగోలుదారుడు మిన్నుకుండిపోయాడు. ఇది ఈ ఇద్దరికి ఎదురైన పరిస్థితే కాదు. అనేక మంది వినియోగదారులకు నిత్యం ఎదురువుతున్న పరిస్థితి. ప్రభుత్వానికి పన్ను కట్టాల్సి వస్తుందని నెపంతో వ్యాపారులు పన్ను ఎగవేయడం కోసం విక్రయించిన వస్తువులకు బిల్లులు ఇవ్వడం లేదు . ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది.
రూ.1200 కోట్ల వ్యాపారం..
జిల్లాలో వ్యాపారం ఎక్కువుగానే జరుగుతోంది. సాధారణ రోజుల్లో కంటే పండగ రోజుల్లో వ్యాపారం జోరందుకుంటుంది. సాధారణ రోజుల్లో నెలకు రూ.1200 కోట్ల వరకు వ్యాపారం జరగ్గా, పండగ రోజుల్లో రూ.2 వేల నుంచి రూ.2,500 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది. ముఖ్యంగా దుస్తుల వ్యాపారం ఎక్కువగా జరుగుతుంటుంది. పక్కనే ఉన్న శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన వారు కూడా విజయనగరం వచ్చి దుస్తులు కొనుగోలు చేస్తుంటారు. దీంతో వ్యాపారం ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా కేంద్రంలో ఉన్న బాలాజీ మార్కెట్‌లో 320 వస్త్ర దుకాణాలు ఒకే చోట ఉన్నాయి. ఇవికాకుండా పట్టణంలో మరో 50 నుంచి 60 వరకు వస్త్ర దుకాణాలున్నాయి. వీటిల్లో రోజుకి రూ.4 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది. పండగ రోజుల్లో రూ.6 నుంచి రూ.7 కోట్ల వ్యాపారం జరుగుతుంది.
బంగారం షాపులు 250 ..
జిల్లాలో బంగారం షాపులు 250 వరకు ఉన్నాయి. ఈ దుకాణాల్లో రోజుకు సగటున సుమారు రూ.4 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది. పండగ రోజుల్లో వ్యాపారం రూ.5 కోట్లకు చేరుకుంటుంది.
ఎలక్ట్రికల్, పెయింట్స్, సిమెంట్ దుకాణాలు 2500 జిల్లాలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, పెయింట్స్, హర్డ్‌వేర్, సిమెంట్ దుకాణాలు 2500 నుంచి 3 వేల వరకు ఉన్నాయి. ఆయా దుకాణాల్లో సగటున రోజుకి రూ.10 నుంచి 15 కోట్ల వరకు వ్యాపారం జరుగుతోంది.
నిబంధనలకు విరుద్ధంగా..
వ్యాపారులు విక్రయించిన వస్తువులకు బిల్లులు ఇవ్వడం లేదు. నిబంధనల ప్రకారం కొనుగోలు రూ.100 దాటితే బిల్లు ఇవ్వాలి. విక్రయించిన వస్తువులు రూ.10 వేలు, రూ.15 వేలు దాటినా బిల్లులు ఇవ్వడం లేదు. బంగారం దుకాణాల్లో అయితే రూ.80 వేలు, లక్ష రూపాయలు దాటినా బిల్లులు ఇస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. బిల్లులు ఇచ్చినట్లైతే సదరు వ్యాపారి ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. బిల్లులు ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment