అద్దంకికి ఏం తక్కువ? | People Demand To Addanki Revenue Division | Sakshi
Sakshi News home page

అద్దంకికి ఏం తక్కువ?

Published Mon, Apr 2 2018 9:07 AM | Last Updated on Mon, Apr 2 2018 9:07 AM

People Demand To Addanki Revenue Division - Sakshi

అద్దంకి పట్టణ వ్యూ

అద్దంకి:రెవెన్యూ డివిజన్‌ కావడానికి అన్ని అర్హతలున్న అద్దంకి పట్టణాన్ని రెవెన్యూ డివిజన్‌గా చేయాలని పట్టణంతో పాటు, పరిసర మండలాల ప్రజలు కోరతున్నారు. గతంలో ప్రజా ప్రతినిధులు అద్దంకిని రెవెన్యూ డివిజన్‌ చేయాలని ప్రతిపాదనలు పంపినా పట్టించుకోకుండా, నేడు మార్టూరు, దర్శి రెవెన్యూ డివిజన్లు చేయబోతున్నామనే ప్రకటనలతో మరలా డివిజన్‌ విషయంలో ఆందోళనలు చేసేందుకు ప్రజలు, సంఘాలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే, రెవెన్యూ డివిజన్‌కు అన్ని అర్హతలున్న అద్దంకి పట్టణాన్ని డివిజన్‌గా ప్రకటించాలని పరిసర మండలాల ప్రజలు కోరుతున్నారు. గతంలో దీనిపై లక్ష పోస్ట్‌ కార్డు ఉద్యమం, రాస్తారోకోలు నిర్వహించారు.   

పరిసర పట్టణాలకుకేంద్ర బిందువుగా అద్దంకి..
పరిసర పట్టణాలకు కేంద్ర బిందువుగా ఉన్న అద్దంకి.  పురాతన కాలం నుంచి పరిపాలనకు ప్రధాన కేంద్రంగా పేరుగాంచింది.  ఇక్కడ రాజుల కాలంలోనే రత్నాలు రాశులుగా పోసి విక్రయాలు జరిపినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. రెడ్డి రాజుల మొదలుకుని, ఎందరో రాజులు పట్టణాన్ని రాజధానిగా చేసుకుని, కోట నిర్మాణంతో పరిపాలన సాగించారు. దీంతోపాటు నాటి నుంచి నేటి వరకూ వ్యవసాయ, వర్తక, వాణిజ్య, ఎగుమతులు, దిగుమతుల రంగంలో మంచి పేరు గడించింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ప్రస్తుతం కందుకూరు, మార్కాపురం, ఒంగోలు రెవెన్యూ డివిజన్లు ఉండగా, పరిపాలనా సౌలభ్యం కోసం, మరో రెండు డివిజన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. దీంతో జిల్లాలో ఐదు డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. 

జిల్లాలో ప్రస్తుత డివిజన్ల పరిస్థితి..
జిల్లాలో 56 మండలాలు, 12 నియోజక వర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కాపురం, కందుకురు, ఒంగోలు డివిజన్లు, మరో రెండు డివిజన్లు ఏర్పాటైతే, ఒక్కో డివిజన్‌లో 11 మండలాల వంతున నాలుగు, 12 మండలాలతో ఒక డివిజన్‌ ఏర్పాటు అవుతాయి.

మూడో శతాబ్దం నుంచే రాజకీయ కేంద్రం
అద్దంకి క్రీస్తు శకం మూడో శతాబ్దం నుంచే రాజకీయ కేంద్రంగా, సైనిక స్థావరంగా ఉంది. రెడ్డి రాజుల రాజధాని మొదలు ఎన్నో రాజవంశాలు దీన్ని తమ రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించాయి.

1200 ఏళ్ల నుంచి పట్టణంగా ...
గుండ్లకమ్మ జీవ నది ఒడ్డున ఉన్న అద్దంకి, దాదాపు 1200 ఏళ్ల  నుంచి పట్టణంగా ఉంది.

 గుర్తింపు ఇలా...
  1955 నుంచి నియోజకవర్గ కేంద్రంగా ఉంది. 1950 నుంచి గ్రంథాలయం, 1950లోనే తాలూకా కేంద్రం ఏర్పాటైంది. 1870లో డిస్పెన్సరీ, ప్రస్తుతం అదే 30 పడకల అసుపత్రిగా అభివృద్ధి చెందింది. 1946 నుంచి హైస్కూల్, 1956లోనే ఎన్నెస్పీ ఈఈ కార్యాలయం, 1972 లో సబ్‌ జైలు, గతంలోనే ట్రజరీ, సబ్‌ రిష్ట్రార్‌ కార్యాలయం ఏర్పాటైంది. ఎక్కడా డిగ్రీ కళాశాల లేని రోజుల్లో అద్దంకిలో  1974లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంది. ఇంకా 6 జూనియర్‌ కళాశాలలు, సాంఘిక సంక్షేమ గురుకుల బాలిక కళాశాల, రెండు జిల్లా పరిషత్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మరో జిల్లా పరిషత్‌ పాఠశాల, వివిధ శాఖల ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. పట్టణ, రూరల్‌ పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. రాష్ట్రంలోనే పేరు గాంచిన ప్రముఖ సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి పుణ్యక్షేత్రం ఉంది.

పరిసర మండలాలకు కేంద్రంగా అద్దంకి...
భౌగోళిక చారిత్రక అంశాలను బట్టి పరిశీలిస్తే కొత్తగా ఏర్పాటు చేయబోయో రెండు డివిజన్లలలో ఒక దాన్ని, పరిసర పట్టణాలకు కేంద్రంగా(మధ్యలో) ఉన్న అద్దంకిలో ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలతో పాటూ, వివిధ మండలాల ప్రజలు కోరుతున్నారు.

డివిజన్‌ అయితే కలిసే మండలాలు..
అద్దంకి డివిజన్‌ ఏర్పాటు చేస్తే అద్దంకి, జె.పంగులూరు, ఇంకొల్లు, మార్టూరు, ముండ్లమూరు, సంతమాగులూరు, కొరిశపాడు, యద్దనపూడి, బల్లికురవ, పర్చూరు మండలాలను కలిపి ఏర్పాటు చేయవచ్చనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్త పరుస్తున్నారు.

గతంలోనే అద్దంకి డివిజన్‌ ప్రతిపాదన..
2014కు ముందు స్థానిక ప్రజా ప్రతినిధులు అద్దంకిని రెవెన్యూ డివిజన్‌గా చేయాలనే ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. అందుకు అవసరమైన ఫైల్‌ను తయారు చేసి కలెక్టరుకు, సీఎంకు  పంపారు. ఈ క్రమంలో అప్పట్లో ఉన్న మూడు డివిజన్లే సరిపోతాయనే ఉన్నతాధికారుల నివేదికతో ఆగింది. ప్రస్తుతం మరో రెండు రెవెన్యూ డివిజన్ల ప్రకటనతో అద్దంకి పరిసర మండలాల ప్రజలు, అద్దంకినే డివిజన్‌ చేయాలని కోరుతున్నారు.

పోస్ట్‌ కార్డు ఉద్యమం, ధర్నాలు..
మునిసిపాలిటీగా అద్దంకి అవతరించడం, బల్లికురవ గ్రానైట్‌ ద్వారా, ప్రపంచ వ్యాప్త  వ్యాపారం, వ్యవసాయు ఉత్పత్తుల దిగుబడి, వాణిజ్యం, ఎగుమతులు, దిగుమతుల రంగంలో, ఆదాయ వనరులను కలిగిన అద్దంకిని రెవెన్యూ డివిజన్‌ చేయాలని కోరుతూ పట్టణ అభివృద్ధి కమిటీ ఇటీవల అద్దంకి –నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో చేశారు. అదే విధంగా లక్ష పోస్ట్‌కార్డుల ఉద్యమాన్ని చేపట్టారు. వీటిని త్వరలో సీఎం చంద్రబాబు నాయుని వద్దకు చేర్చబోతున్నారు. ఈ క్రమంలో ఇన్ని వసతులున్న అద్దంకిని రెవెన్యూ డివిజన్‌ గా చేయాలని రాజకీయ నాయుకులు, పరిసర మండలాల ప్రజలు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు కోరుతున్నారు. 

అద్దంకిని రెవెన్యూ డివిజన్‌ చేయాలి
అద్దంకిరూరల్‌: చరిత్ర ఉన్న అద్దంకిను రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా క్రమ శిక్షణ సంఘ సభ్యుడు జ్యోతి హనుమంతరావు అన్నారు.   అద్దంకి– నార్కేట్‌పల్లి రాష్ట్రీయ రహదారిని పట్టణంలో విస్తరణను సక్రమంగా జరగాలని కోరుతూ పట్టణ అభివృద్ధి కమిటీ, అఖిల పక్షం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక బంగ్లారోడ్‌లో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి హనుమంతరావు మాట్లాడుతూ రాజకీయ లబ్ధికోసమే దర్శి, మార్టూరులను రెవెన్యూ డివిజన్‌లుగా ఏర్పాటు చేశారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్‌. సీతారామాంజనేయులు మాట్లాడుతూ ఎంతో చారిత్రక చరిత్ర కలిగిన అద్దంకిని రెవెన్యూ డివిజన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం నాయకుడు గొల్లపూడి వెంకటేశ్వర్లు, పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మన్నం త్రిమూర్తులు మాట్లాడుతూ సమస్యలకు పరిష్కారం లభించే వరకు దీక్షలు కొనసాగిస్తామన్నారు. తొలిరోజు దీక్షలను జ్యోతి చంద్రమౌళి పూలమాలలు వేసి ప్రారంభించారు. పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మన్నం త్రిమూర్తులు, సీపీఐ సీనియర్‌ నాయకుడు గొల్లపూడి వెంకటేశ్వర్లు, డేవిడ్, వడ్లపల్లి ఆంజనేయులు, పవన్‌కుమార్‌ దీక్షలో కూర్చున్నారు. కార్యక్రమంలో నాగినేని రామకృష్ణ, యు. దేవపాలన, యర్రమోతు నాగేశ్వరరావు, చలమారెడ్డి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement