అక్కడ మద్యం ముట్టరు! | People don't take Alcohol at the thanda village | Sakshi
Sakshi News home page

అక్కడ మద్యం ముట్టరు!

Published Thu, Apr 27 2017 10:42 AM | Last Updated on Tue, Sep 5 2017 9:50 AM

అక్కడ మద్యం ముట్టరు!

అక్కడ మద్యం ముట్టరు!

అగళి (మడకశిర) : మూడు దశాబ్దాల క్రితం కుటీర పరిశ్రమల సారా కాచిన అగళి మండలంలోని హెచ్‌డీ తండా వాసుల్లో పరివర్తన వచ్చింది. సారా తయారీనే కాదు ఆఖరుకు మద్యం కూడా ముట్టడం లేదు. ఒకప్పుడు మత్తులో జోగిన వారే నేడు పంట సాగులో అద్భుత ఫలితాను సాధిస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే.. వంద కుటుంబాలు ఉన్న హెచ్‌డీ తండాలో 500 మంది జీవిస్తున్నారు. 30 ఏళ్ల క్రితం బాల్యా నాయక్‌ అనే వ్యక్తి మాత్రమే అక్కడ విద్యావంతుడు. మిగిలిన వారికి అక్షరంముక్కరాదు. కుటుంబ పోషణకు గ్రామస్తులు సారా కాచేవారు.

గ్రామంలోని పలు కుటుంబాలు సారా మత్తులో జోగుతుండేవి. కొందరు ప్రాణాలు సైతం కోల్పోవడంతో గ్రామంలో సారా తయారీ అరికట్టాలని బాల్యానాయక్‌ నిర్ణయించుకున్నారు. ఈ విషయంపై స్థానిక యువతను తోడుగా తీసుకున్నారు. సారా తయారీ, తాగుడు వల్ల జరుగుతున్న అనర్థాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. కొన్ని రోజుల్లోనే వారు ఆశించిన ఫలితం కనిపించసాగింది. నెమ్మదిగా ఒక్కొక్కరు సారా కాచే పని మానుకుని వ్యవసాయంపై దృష్టిసారించసాగారు. గ్రామ పరిధిలో రెండు వేల ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ అసైన్డ్ భూమిని అర్హులకు పంపిణీ చేయించారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ వక్క, పూల తోటలతో లాభాలు గడించారు. ముఖ్యమంత్రిగా డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో పక్కా గృహాలను నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఆ గ్రామంలో ఎటు చూసినా అభివృద్ధి కనడపడుతోంది. గ్రామంలో పిల్లలను బాగా చదివిస్తున్నారు. పలువురు ప్రభుత్వ ఉద్యోగులుగాను స్థిరపడ్డారు. పోలీసులు సైతం ఆ గ్రామం వైపు కన్నెత్తి చూడకపోవడంతో అక్కడ  ప్రశాంతత వెల్లివిరుస్తోంది. 
 
అప్పట్లో కుటుంబాలు వీధులపాలయ్యాయి
 
40ఏళ్ల క్రితం సారా బట్టీలతో నిత్యం తాగి ఇంటికొచ్చేవారు. భార్య,పిల్లలను ఇబ్బందులకు గురి చేసేవారు. అప్పట్లో పలు కుటుంబాలు వీధిపాలయ్యాయి. ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. పిల్లలను బాగా చదివిస్తున్నారు. అందరూ దీన్నే కోరుకుంటున్నారు.– ముద్దమ్మ, హెచ్‌డీహళ్లి తండా  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement