సుపరిపాలనకు ప్రజలు ఉద్యమించాలి: ఎ. చక్రపాణి | People fight for good governance, says A Chakrapani | Sakshi
Sakshi News home page

సుపరిపాలనకు ప్రజలు ఉద్యమించాలి: ఎ. చక్రపాణి

Published Sat, Aug 17 2013 1:20 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM

People fight for good governance, says A Chakrapani

సాక్షి, హైదరాబాద్: సమాజంలో ఇప్పటికీ అసమానతలు కొనసాగుతున్నాయని, ప్రజాస్వామ్య, లౌకిక వ్యవస్థలకు విఘాతం కలుగుతున్న ఫలితమే నేటి ఉద్యమాలని శాసనమండలి చైర్మన్ ఎ. చక్రపాణి అభిప్రాయపడ్డారు. విశాలాంధ్ర ప్రచురణాలయం 60వ వార్షికోత్సవం సందర్భంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరిట ప్రచురించిన గ్రంథాన్ని చక్రపాణి శుక్రవారమిక్కడ ఆవిష్కరించారు.
 
 ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ కె.ఎస్.చలం అధ్యక్షతన జరిగిన ఆవిష్కరణ సభలో శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి, గ్రంథ అనువాదకుడు ప్రొఫెసర్ చందు సుబ్బారావు, విశాలాంధ్ర ప్రచురణాలయం సంపాదకులు ఏటుకూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అంబేద్కర్ జీవితం, రచనలు జాతీయ సంపదని, వాటిని భావితరాలకు అందించాల్సిన ఆవశ్యకత ఉందని వక్తలు పేర్కొన్నారు. ఉత్తమ రాజ్యాంగం ఉంటే సరిపోదని, దాన్ని సమర్థంగా అమలు చేసే సుపరిపాలన కోసం ప్రజలు ఉద్యమించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఎక్కడ ఉత్తమ పాలకులు, సాహసోపేతమైన ప్రభుత్వం, నిజాయితీ కలిగిన ప్రభుత్వ యంత్రాంగం ఉంటుందో అక్కడ చట్టాలు సజావుగా అమలవుతాయని చక్రపాణి హితవుపలికారు. అటువంటి వారిని ఎన్నుకునే బాధ్యత ప్రజలపైనే ఉంటుందని ఉద్బోధించారు. ఏదైనా సాధించాలంటే ఉత్తమ పాలకులే పరిష్కారమన్నారు. కుల,మతాల గోడలు బద్దలు కొట్టాలని, అందుకు అంబేద్కర్ నుంచి స్ఫూర్తి పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
 
 నాదెండ్ల మనోహర్ ప్రసంగిస్తూ.. జాతి కోసం త్యాగం చేసిన వారిలో అంబేద్కర్ ఒకరని, ఎన్నో అవమానాలను భరించి ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరగలిగారని చెప్పారు. పాలకుల్లో అంకితభావం కొరవడితే అనర్ధాలు తప్పవన్నారు. అంబేద్కర్ రచనలను ప్రభుత్వం ప్రచురించేందుకు ముందుకు రాకపోతే విశాలాంధ్ర ఆ పని చేస్తుందని సురవరం చెప్పారు. నారాయణ మాట్లాడుతూ ఆర్థిక సమస్యలకు ఇచ్చిన ప్రాధాన్యతను వామపక్షాలు సామాజిక అంశాలకు ఇవ్వలేదన్నారు. సమావేశానికి న్యూడెమోక్రసీ నాయకుడు గోవర్ధన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.రామకృష్ణ, వకుళాభరణం రామకృష్ణ తదితరులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement