TS History:1948 పోలీస్‌ యాక్షన్‌ – మరో కోణం | 1948 Police Action Another Perspective | Sakshi
Sakshi News home page

TS History:1948 పోలీస్‌ యాక్షన్‌ – మరో కోణం

Published Sat, Oct 7 2023 12:29 PM | Last Updated on Sat, Oct 7 2023 12:29 PM

1948 Police Action Another Perspective - Sakshi

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, అది సృష్టించిన సాహిత్యం మన రాజకీయాల్లో, సాహిత్యంలో చివరకు మన జీవితాల్లోనూ విడదీయరాని భాగం. ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలకు రెండు తెలుగు రాష్ట్రాల చట్టసభల్లో ఒక్క ప్రతినిధి కూడా లేడు. అయినప్పటికీ, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో వామపక్ష భావజాలమే ఇప్పటికీ బలంగా ఉంది. తెలుగు సాహిత్యంలో అత్యధిక భాగం ‘సామ్యవాద వాస్తవికత’ ప్రభావంలోనే ఉందంటే అతిశయోక్తి కాదు.


భాషా ప్రయుక్త రాష్ట్రాల విధానం వచ్చాక 1956లో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రరాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేశారు. నిజాం సంస్థానం చాలా పెద్దది. అందులోని ఐదు ప్రధాన ప్రాంతాల్లో తెలంగాణ ఒకటి. తెలంగాణలోని నల్లగొండ, వరంగల్‌ రెండు జిల్లాల్లో ప్రధానంగానూ, మరో ఒకటి రెండు జిల్లాల్లో స్వల్పంగానూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగింది. ఆనాటి చారిత్రక సంఘటనల మీద తమ అనుభవాలను గ్రంథస్థం చేసిన ఆ పోరాట అగ్రనాయకులు అందరూ తెలంగాణకు పరిమితమయ్యారు.

తమ పుస్తకాలకు నిజాయితీగా ‘తెలంగాణ’ అనే శీర్షికలే పెట్టారు. మిగిలిన నిజాం సంస్థానాన్ని వదిలేశారు. దానికి రెండు కారణాలు. మొదటిది ఉర్దూ భాషా సమస్య, రెండోదిముస్లిం మత సమస్య.నిజాం పాలన గురించి మనకు, ముఖ్యంగా, తెలుగు పాఠకులకు తెలిసింది చాలా తక్కువ. నిజాం సంస్థానంలో పెట్టుబడీదారీ అభివృద్ధి గురించి పరిశోధనలు చేసిన ప్రొఫెషనల్స్‌ కొందరు లేకపోలేదు.

వారిలో ఒకడైన సివి సుబ్బారావు ఆ రోజుల్లో జవహర్‌ లాల్‌ నెహ్రూ వాగ్దానం చేసిన ఇండియాకన్నా మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ పాలనలోని నిజాం సంస్థానంలో కొనసాగుతున్న అభివృద్ధి  మెరుగ్గా ఉందనే నిర్ధారణకు వచ్చాడు.ఇంతకీ తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా భారత కమ్యూనిస్టు పార్టీ సాధించిందేమిటి? వాదన కోసం; నిజాం రాచరిక పాలననో, జాగీర్దార్ల భూస్వామ్యాన్నో వాళ్ళు అంతం చేసేశారు అనుకుందాము.

భూస్వామ్య వ్యవస్థను అంతం చేశాక పెట్టుబడీదారీ వ్యవస్థ ఏర్పడుతుందని సాక్షాత్తు ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’లో కార్ల్‌ మార్క్స్‌– ఫ్రెడరిక్‌ ఏంగిల్స్‌ చెప్పారు. అంతేకాని భూస్వామ్య వ్యవస్థను కూల్చేస్తే సమసమాజం వస్తుందనో, కమ్యూనిస్టు రాజ్యం వస్తుందనో, కనీసం ‘రైతు–కూలీ రాజ్యం’ వస్తుందనో వాళ్ళెక్కడా చెప్పలేదు.తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ రాచరిక – భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేసిన తరువాత అక్కడ అత్యంత సహజంగానే పెట్టుబడీదారీ వ్యవస్థ అభివృద్ధి చెందడాన్ని మనందరం చూస్తున్నాం.

1940ల చివర్లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీగానీ, 1980ల మొదట్లో నక్సలైట్‌ పార్టీలుగానీ ఉద్దేశ్యపూర్వకంగా కాకపోయినా పెట్టుబడిదారులు పెరగడానికి కారణమయ్యారు. సమాజానికి తనదైన ఒక రోడ్‌ మ్యాప్‌ ఉంటుంది. ఒకరు అనుకున్నా అనుకోకపోయినా అదలా సాగిపోతుందంతే. ఒక కఠోర చారిత్రక వాస్తవం ఏమంటే ప్రపంచంలో ఇప్పటి వరకు పెట్టుబడీదారీ వ్యవస్థ అభివృద్ధి చెందిన ఏ దేశంలోనూ సోషలిస్టు విప్లవం విజయవంతం కాలేదు.

 
1948 నాటి పోలీస్‌ యాక్షన్‌ గురించి కమ్యూనిస్టు నాయకులు చెప్పని ఇంకో పెద్ద నిజం కూడా ఉంది. జె.ఎన్‌. చౌధరి నాయకత్వంలోని ‘పోలీసు యాక్షన్‌’ కమ్యూనిస్టు ప్రభావిత జిల్లాలకు చేరుకోవడానికి ముందే నిజాం సంస్థానంలో  సాయుధపోరాటంలో మరణించిన 3 వేలకు ఓ పది రెట్లకు పైగా ముస్లింలను అతి క్రూరంగా చంపేశారు. వాళ్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపైన నెహ్రూ వేసిన సుందర్‌ లాల్‌ బహుగుణ కమిటీ మాత్రమేకాక, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీకి అప్పటి పార్లమెంటరీ రాజకీయాల వేదికగా ఉన్న ‘పీపుల్స్‌ డెమోక్రాటిక్‌  ఫ్రంట్‌ ’(పీడీఎఫ్‌) నాయకులు కూడ ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందచేశారు.

సుందర్‌ లాల్‌ బహుగుణ నివేదికను జాతీయభద్రత దృష్ట్యా చాలాకాలం దాచిపెట్టారుగానీ ఇప్పుడు అది అందుబాటులో వుంది. ఇండో–అమెరికన్‌ రచయిత అఫ్సర్‌ మహమ్మద్‌ 1948 నాటి పోలీస్‌ యాక్షన్‌ బాధిత కుటుంబాల సంతతిని కలిసి వాళ్ళ అనుభవాలను నమోదు చేసే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. ఈ అంశం మీద ఓ దశాబ్దం పాటు విçస్తృత పరిశోధనలు చేసి ఇప్పుడు ‘రీమేకింగ్‌ హిస్టరీ –1948 పోలీస్‌ యాక్షన్‌ అండ్‌ ది ముస్లిమ్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’ శీర్షికతో ఒక భారీ చారిత్రక డాక్యుమెంట్‌  ప్రచురించాడు.

2002 గుజరాత్‌ అల్లర్ల తరువాత తను ముస్లిం సమాజం మీద దృష్టి పెట్టాడు. మొహర్రం పండుగ సందర్భంగా తెలంగాణలో వెల్లివెరిసే మతసామరస్యం మీద పరిశోధన సాగించాడు. ఆ క్రమంలో 1948 పోలీస్‌ యాక్షన్‌ బాధితులు అతనికి తారసపడ్డారు. దాచేస్తే దాగని సత్యాలను వెళ్ళడించడానికి సిద్ధపడ్డాడు. దాని ఫలితమే ఈ పరిశోధనా గ్రంథం. 

ప్రపంచం అనేది చాలా పెద్దది. అందులో మనకు తెలిసింది చాలా తక్కువ, తెలియాల్సింది చాలా ఎక్కువ అనే స్పృహ చాలామందికి ఉండదు. ప్రపంచం మొత్తం తెలియకపోయినా మనదేశం గురించి, మన రాష్ట్రం గురించయినా తెలియాలి. హీనపక్షం మనతో వందల సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్న సమూహాల మనోభావాలనైనా తెలుసుకోవాలిగా. దానికి ఈ పుస్తకం తోడ్పడుతుందని ఆశిస్తాను.


వ్యాసకర్త సమాజ విశ్లేషకులు, సీనియర్‌ జర్నలిస్టు 
మొబైల్‌: 9010757776 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement