చంద్రబాబూ.. గో బ్యాక్‌ | People Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ.. గో బ్యాక్‌

Published Tue, Jan 14 2020 5:30 AM | Last Updated on Tue, Jan 14 2020 5:30 AM

People Fires On Chandrababu - Sakshi

చంద్రబాబు గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు, స్థానికులు

హిందూపురం/అనంతపురం టౌన్‌/పెనుకొండ/సోమందేపల్లి/అనంతపురం: రాష్ట్ర రాజధానిని అమరావతి నుంచి మార్చకూడదని డిమాండ్‌ చేస్తూ సోమవారం అనంతపురం జిల్లాలో బస్సు యాత్ర చేపట్టిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి చేదు అనుభవం ఎదురైంది. ప్రజలు అడుగడుగునా ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. రాజధాని విషయంలో బాబు తీరు పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై పాలసముద్రం వద్ద ప్రజలు ఆందోళన చేపట్టడంతో అరగంట పాటు ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు కాన్వాయ్‌ జాతీయ రహదారికి చేరుతుండగానే నిరసనకారులు నల్ల జెండాలు, ప్లకార్డులు ప్రదర్శించారు.

బాబు కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు గో బ్యాక్‌.. రాయలసీమ ద్రోహులు అనే నినాదాలతో హోరెత్తించారు. ఒక దశలో చంద్రబాబు వాహనం దిగి, వారిని వారించే ప్రయత్నం చేశారు. చివరకు చంద్రబాబు నడుచుకుంటూ జోలె పట్టి ముందుకు కదిలినా నిరసనకారులు అడ్డుకున్నారు. రోడ్డు పక్కన ఉన్న దుకాణాల వద్దకు వెళ్లేందుకు బాబు ప్రయత్నించగా నిరసనకారులు అడ్డుకోవడంతో కొంతదూరం నడిచి మళ్లీ వాహనంలోకి వెళ్లిపోయారు. నిరసనకారులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు నిరసనకారులను బలవంతంగా పక్కకు తొలగించారు. తర్వాత రోప్‌ పార్టీతో బాబు కాన్వాయ్‌ని ముందుకు పంపించారు.  

‘రండ్రా నా కొడుకుల్లారా చూసుకుందాం’ 
చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకున్న ప్రజలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి చిందులు తొక్కారు. ‘రేయ్‌.. రండ్రా నా కొడుకుల్లారా చూసుకుందాం’ అంటూ నానా దుర్భాషలాడారు. పోలీసులు ఆయనను బలవంతంగా వాహనంలోకి ఎక్కించారు. అయినప్పటికీ వాహనంలో నుంచి చేయి చూపుతూ నిరసనకారులనుద్దేశించి దురుసుగా మాట్లాడారు. ఆయన అనుచరులు కూడా తొడలు కొడుతూ రేయ్‌ నరుకుతాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకారులపై టీడీపీ కార్యకర్తలు చెప్పులు విసిరారు.  

అమరావతి కోసం ఉద్యమించాలి  
రాజధానిగా అమరావతి కోసం యువత ఉద్యమించాలని, లేకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని చంద్రబాబు అన్నారు. సోమవారం అనంతపురంలో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి చంద్రబాబు క్లాక్‌ టవర్‌ నుంచి సప్తగిరి సర్కిల్‌ వరకు జోలె పట్టుకొని ర్యాలీగా చేరుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని పేర్కొన్నారు. అన్ని జిల్లాలకు సమదూరంలో ఉన్న అమరావతినే రాజధానిగా ఉంచాలని స్పష్టం చేశారు. రాజధానిని మార్చితే  ఉద్యమిస్తామని హెచ్చరించారు. జీఎన్‌రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ నివేదికలను భోగి మంటల్లో వేసి తగులబెట్టాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రజలు రాష్ట్ర రాజధానిగా అమరావతినే కోరుకుంటున్నారని అన్నారు.  
 
అమరావతి కోసం జైలుకెళ్లడానికైనా సిద్ధమే 
రాజధాని అమరావతి కోసం తాను జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలో బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రజలందరిదీ ఒక దారి అయితే, సీఎం జగన్‌ది మరోదారిగా ఉందన్నారు. ముఖ్యమంత్రి మూడు ముక్కలాట ఆడుతున్నారని విమర్శించారు. దీన్ని ప్రజలంతా ఖండించాలని కోరారు. రాజధానిని విశాఖపట్నానికి తరలించాలంటే మొదట 151 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని, ప్రజలు ఆ పార్టీని గెలిపిస్తే తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని చంద్రబాబు సవాల్‌ విసిరారు.  

చంద్రబాబు జోలెకు ప్రజా స్పందన సున్నా 
అమరావతి పరిరక్షణ సమితి పేరిట చంద్రబాబు చేపట్టిన బస్సుయాత్ర అనంతపురం జిల్లా సోమందేపల్లి వై.జంక్షన్‌లో కొద్దిసేపు ఆగింది. కాన్వాయ్‌ని ఆపగానే చంద్రబాబు తన మెడలో ఉన్న టవల్‌ను జోలెగా పట్టుకొని విరాళాల కోసం అభ్యర్థించగా ప్రజలెవరూ ఆసక్తి చూపలేదు. దీంతో ఆయన కంగుతిన్నారు. అక్కడున్న కొందరు టీడీపీ నాయకులు విరాళాలు అందించాలని తమ పార్టీ కార్యకర్తలకు సూచించారు. కొంతమంది కార్యకర్తలు చంద్రబాబు జోలెలో డబ్బులు వేసి మమ అనిపించారు. బాబు పర్యటనపై రెండు రోజులుగా టీడీపీ ప్రచారం చేస్తున్నా స్పందన లేకపోవడం గమనార్హం.
 
రాయలసీమ ద్రోహి చంద్రబాబు   
చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని బీసీ సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షుడు రమేష్‌గౌడ్‌ మండిపడ్డారు. సోమవారం అనంతపురంలోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. చంద్రబాబు గోబ్యాక్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement