
సాక్షి, తూర్పుగోదావరి: మనిషిలో మానవత్వం.. మాయమైనప్పుడు.. దానవత్వం ఆవరించినపుడు.. మృగాడు అవతరిస్తున్నాడు. పరిమితులు లేని పైశాచికత్వం వాడి నైజం. విలువలు, విచక్షణ కోల్పోయి.. పేగు బంధం అనికూడా చూడకుండా కన్న కూతురు మొదలుకొని.. 60.. 70 ఏళ్ల ముదుసలి వరకు ఆడదైతే చాలు ఆకలిగొన్న పులిలా అదను చూసుకుని మీదపడి కబళిస్తున్నాడు. ఆ మృగాడి పంజా దెబ్బకి బలైన ఎందరో అబలలు నిస్సహాయులై.. అవమానాలపాలై.. సమాజం జాలి చూపులకు నిస్తేజులై.. అసువులు బాసి.. ఇలా ఎందరెందరో.. శిక్షా స్మృతులు ఎన్ని ఉన్నా నిష్కృతి లేని పాపాలెన్నో జరిగిపోయి కాలగర్భంలో కలసిపోతున్నాయి. మరి ఈ పాశవిక చర్యలకు అంతం ఎక్కడ? వేల గొంతులు ఏకమై ఆక్రోసిస్తున్నాయి.. ఆగ్రహిస్తున్నాయి.. కన్నెర్ర జేస్తున్నాయి.. న్యాయం కావాలని.. మాకూ హక్కులున్నాయి.. వాటికి రక్షణ కావాలని.. ఆ ఆగ్రహ జ్వాలల ఫలితంగా అడపా దడపా ఎన్‌కౌంటర్ల రూపంలో పోలీసులు మృగాళ్లను మట్టుబెడుతున్నారు.
అప్పటికి తాత్కాలిక ఉపశమనం. ఆశించిన న్యాయం దక్కిందన్న ఆనందం. గురువారం తెల్లవారుజామున జరిగిందదే. దిశ కేసుకు సంబంధించి నిందితుల ఎన్‌కౌంటర్‌తో మహిళాలోకం.. ఆ మాటకొస్తే మానవ సమాజం హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. మరో మానవ మృగం మరో పైశాచికత్వానికి పాల్పడాలంటే హడలెత్తిపోయేలా ఉంది పోలీసు చర్య అని అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి దుశ్చర్యలు జరిగినపుడు విచారణ.. శిక్షల అమలులో జాప్యం లేకుండా.. నిందితులు తక్షణ ఫలితం అనుభవించేలా.. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా.. నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించక.. సమాజం ఆక్షేపణకు గురికాకుండా న్యాయస్థానాల ఔన్నత్యం నిలబెట్టుకోవాలని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్‌కౌంటర్ ఘటనపై జిల్లా వ్యాప్తం ప్రజల భావావేశం ఇలా వ్యక్తమైంది.
మృగప్రవృత్తి ఉన్నవాళ్లకి ఇదో హెచ్చరిక
మహిళలపై లైంగిక దాడులు, హత్యలకు పాల్పడే వారికి దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ ఒక హెచ్చరిక లాంటిది. దేశంలో మహిళలపై దాడులకు పాల్పడాలనుకునే వారికి ఈ సంఘటనతో కనువిప్పు కలుగుతుంది. నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌తో దిశ ఆత్మకు శాంతి కలుగుతుంది. ఆమె కుటుంబానికే కాకుండా యావత్ దేశ మహిళలకు న్యాయం జరిగినట్టు భావిస్తున్నాను. విద్యారి్థనులు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండడంతో పాటు ఆపద సమయంలో 100కు ఫిర్యాదు చేయగలిగితే తమను తాము రక్షించుకున్నట్టు అవుతుంది.
– కరుణకుమారి, ఎంబీఏ విద్యారి్థని, కాకినాడ రూరల్
మానవ మృగాల ఎన్‌కౌంటర్ హర్షణీయం
దిశపై అత్యాచారం, హత్య చేసిన కేసులో నిందితులుగా ఉన్న నలుగురు మృగాలను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం హర్షించ దగ్గ విషయం. సీన్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలో పోలీసులపై రాళ్లు రువ్వి పారిపోతున్నప్పుడు సరైన సమయంలో స్పందించి ఎన్‌కౌంటర్ చేయడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తారు. ఈ నలుగురు వ్యక్తులు మనుషులు కాదు మృగాళ్లు. మానహక్కుల సంఘం మనుషులను చంపడం సరికాదని చెబుతోంది. ఈ సంఘం ఎప్పుడూ మానవుల మీద దృష్టి పెట్టాలిగాని, మృగాళ్లు మీద జాలి చూపకూడదు. పోలీసులు మంచి నిర్ణయం తీసుకున్నారు.
– పసుపులేటి శ్రీనివాస్, ఎన్‌జీవోల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కాకినాడ
మానవ మృగాలకు సరైన తీర్పు
దిశ నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం సరైన తీర్పే. నేరాలు, హత్యలు, అత్యాచారాలు చేసి బెయిల్‌పై అనేక మంది జైలు నుంచి బయటకు వస్తున్నారు. దిశ కేసులో నిందితుల మాదిరిగానే అత్యాచారాలు చేసిన వారికి తీర్పు ఇలాగే ఉండాలి. ప్రతి ఒక్కరూ ఈ ఎన్‌కౌంటర్‌ను హర్షించాలి.
– ఎంవీ శ్రీలక్షి్మ, అంగన్‌వాడీ సంఘ నాయకురాలు, సామర్లకోట.
అల్లరిమూకల్లో భయం పెరుగుతుంది
దిశ సంఘటనలో నేరస్తులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి చంపడం ద్వారా బాధిత కుటుంబీకులను ఎటువంటి న్యాయం జరగకపోయినా అల్లరిమూకల్లో భయం పెరుగుతుంది. దిశ సంఘటనతో భయాందోళనలకు గురైన మహిళలకు ఈ ఎన్‌కౌంటర్ ద్వారా పోలీసులు, ప్రభుత్వాలపై కాస్త నమ్మకం పెరిగింది.
– తాడి భువనేశ్వరి, తణుకువాడ పీఏసీఎస్ మాజీ డైరెక్టర్, గొల్లపాలెం
ఇదో గొప్ప గుణపాఠం
దారుణాలకు పాల్పడేవారికి తెలంగాణ పోలీసులు తీసుకున్న చర్య ఒక గొప్ప గుణపాఠంగా నిలిచిపోతుంది. దిశ హత్య కేసులో నిందితులకు తగిన శాస్తి జరిగింది. ఆడపిల్లలను వేధించే వారిపై ప్రభుత్వాలు, పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. దిశ ఆత్మకు శాంతి కలిగేలా ఈ సంఘటన ఉంది.
– చింతా వెంకట రమణి, మాజీ సర్పంచ్, మోరిపోడు
దిశ కుటుంబానికి ఊరట
దిశ కేసులో నిందితులు ఎన్‌కౌంటర్‌లో మరణించడం చాలా ఆనందంగా ఉంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా లోకం ముక్త కంఠంతో కోరుకుంది. దానికి అనుగుణంగానే పోలీస్ ఎన్‌కౌంటర్‌లో నలుగురూ మృతిచెందారు. ఈ చర్య ప్రతి కుటుంబంలో ఆనందం కలిగించింది. దిశ సంఘటన ద్వారా మహిళలను బయటకు పంపించాలంటేనే బయపడే పరిస్థితి తీసుకువచ్చారు. ఈ ఎన్‌కౌంటర్ ద్వారా ఇటువంటి దురాగతాలకు పాల్పడే వారి వెన్నులో వణుకు పుడుతుంది.
– గనిశెట్టి సుజాత, గృహిణి, మామిడికుదురు
వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది
తప్పు చేయాలంటేనే వెన్నులో వణుకు పుట్టేంచేలా ఈ ఎన్‌కౌంటర్ ఉంది. పోలీసుల చర్యలు దిశ కుటుంబ సభ్యులకు ఊరటనిచ్చే విధంగా ఉంది. దిశ హంతకులు మానవ మృగాలు. ఇటు వంటి వారిపై పోలీసులు వ్యవహరించిన తీరు హర్షణీయం.
– రావి దుర్గ ఆలేంద్రమణి, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు, అంతర్వేది
మానవ జాతి హర్షించదగినది
మానవజాతి హర్షించ దగినది. దిశ హత్యకేసులో నిందితులకు సరైన గుణపాఠం జరిగింది. ప్రజలు ఆశించినదే జరిగింది. ఇక నుంచైనా మహిళలపై హత్యాచారాలు ఆగుతాయని ఆశిస్తున్నాను. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నిందితులు చనిపోవడం చాలా సంతోషంగా ఉంది. తల్లిదండ్రులకు కొంతమేర ఉపశమనం కలిగింది.
– ఉద్గళ సుబ్బారావు, మంజరి సంగీత కళాశాల ప్రిన్సిపాల్, కాకినాడ
పునరావృతం కాకుండా చూడాలి
దిశకు జరిగిన సంఘటనలు ఏ ఆడపిల్లకూ జరగకుండా ప్రభుత్వాలు, పోలీసులు ప్రత్యేక నిఘా విభాగాలు ఏర్పాటు చేయాలి. దిశ హంతకులకు తగిన శిక్ష పడింది. నేరం చేయాలంటేనే ఉలిక్కిపడేలా చట్టాల్లో మార్పులు తేవాలి.
– ఉండపల్లి వరలక్ష్మి, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు, కేశవదాసుపాలెం
Comments
Please login to add a commentAdd a comment