
కలెక్టరేట్ వద్ద బైఠాయించిన ఐదు గ్రామాల ప్రజలు
సాక్షి, ఒంగోలు: భగీరథ కెమికల్స్ ఫ్యాక్టరీపై ఆరు గ్రామాల ప్రజలు భగ్గుమన్నారు. ఫ్యాక్టరీ నుంచి వస్తున్న విషవాయువులు, రసాయనాల నుంచి తమను రక్షించాలని కోరుతూ ఒంగోలు నగర శివారులోని వెంగముక్కలపాలెం, చెరువుకొమ్ముపాలెం, యరజర్ల, పెళ్లూరు, సర్వేరెడ్డిపాలెం గ్రామస్తులు ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్, డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఒంగోలులో సోమవారం నిరసన తెలియజేశారు. తొలుత ఒంగోలు పాత జెడ్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీ, నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ భగీరథ కంపెనీ ప్రమాదకర రసాయనాలను తయారు చేస్తూ, వ్యర్థాల రూపంలో వచ్చే భయంకరమైన రసాయనాలను పరిసరాల్లో ఉన్న ఎర్రవాగు, చెరువు, కుంటల్లోకి వదులుతుండటంతో భూగర్భజలాలు తీవ్రంగా కలుషితమయ్యాయన్నారు.
గాలిలో కూడా రసాయనాలతో కలుషితం అయ్యిందన్నారు. ఇప్పటికే ఈ గ్రామాల పరిధిలోని నవజాత శిశువులు, గర్భిణులు కాలుష్యం బారిన పడ్డారన్నారు. ఈ వ్యర్థ రసాయనాలతో చర్మవ్యాధులు, ఊపిరితిత్తులు, క్యాన్సర్, గుండెజబ్బులు వస్తున్నాయన్నారు. ఈ కాలుష్యం కొద్ది దూరంలోనే ఉన్న సమ్మర్‌స్టోరేజీ ట్యాంకుకు కుడా చేరే ప్రమాదం ఉందన్నారు. అయినా కంపెనీ అవేమీ పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూపోతోందన్నారు. అధికారులు వెంటనే స్పందించి ఫ్యాక్టరీ బారి నుంచి తమను రక్షించాలని గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు.
కాలుష్యం బారిన పడి అనారోగ్యం పాలైన వారిని కంపెనీచే చికిత్స అందించాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ భగీరథ కెమికల్స్ వల్ల సమీప ప్రాంతాల గ్రామస్తులు తీవ్రంగా కాలుష్యానికి గురవుతున్నారన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అయిల్ రంగుకు మారిన నీటితో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఫ్యాక్టరీ కారణంగా తాము ఇటువంటి నీటిని తాగునీటిగా తీసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పి.గోపాల్‌రెడ్డి, డి.కోటేశ్వరరావు, కృష్ణారెడ్డి, ఎం.అంజిరెడ్డి, బి.కోటేశ్వరరావు, పి.సంజీవరెడ్డి, జె.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

చర్చి సెంటర్‌లో మానవహారం నిర్వహిస్తున్న గ్రామస్తులు

రంగు మారిన నీళ్ల బాటిళ్లను చూపిస్తున్న గ్రామస్తులు
Comments
Please login to add a commentAdd a comment