సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రచ్చబండ కేవలం ప్రచారం కోసమేనని తేలిపోయింది. ఇదే సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతమైన తరుణంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ప్రజాగ్రహానికి కారణమవుతోంది. కర్నూలు, మహానందిలో సోమవారం ప్రారంభమైన 3వ విడత రచ్చబండ తీరుతెన్నులే ఇందుకు నిదర్శనం. కర్నూలులో మున్సిపల్ పాఠశాలలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి రాష్ట్ర చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనేక మంది సమస్యలపై వినతులు ఇవ్వాలని వచ్చినప్పటికీ ఏ ఒక్కరి నుంచి అర్జీలు తీసుకోలేదు. సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన రచ్చబండలో జనానికి మాట్లాడే అవకాశం ఇవ్వాల్సి ఉంది. అయితే ఏ ఒక్కరినీ మాట్లాడించిన దాఖలాలు లేవు.
గతంలో నివర్వహించిన రచ్చబండలో వచ్చిన ఫిర్యాదుదారుల్లో ఓ ముగ్గురిని పిలిచి రేషన్ కార్డు, కూపన్లు, బంగారుతల్లి పథకం, ఇళ్ల స్థలాలకు సంబంధించిన పత్రాలను పంపిణీ చేశారు. అయితే వాటిలో రవి అనే వ్యక్తి ఇచ్చిన రేషన్‌కార్డులో పేరు తప్ప అతని ఫొటో లేదు, వారి కుటుంబసభ్యుల పేర్లు లేనే లేవు. వచ్చిన వారంతా అధికారుల కనుసన్నల్లో మెలిగే వారే కనిపించారు. రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వస్తే పట్టించుకున్న పాపాన పోలేదు. ఇదిలా ఉంటే రచ్చబండలో సమస్యలపై ప్రజలు నిలదీస్తారనే ఉద్దేశంతో ముందస్తు చర్యగా పోలీసులను భారీగా మొహరించారు. అందులో భాగంగానే కొంతమంది సీపీఎం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్‌కు తరలించటం గమనార్హం.
మహానందిలో జరిగిన రచ్చబండ కార్యక్రమాని న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి హాజరయ్యారు. రచ్చబండలో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అనేక మంది గిరిజనులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఏ ఒక్కరికీ పరిష్కారం దొరకలేదు. ఇదే విషయాన్ని పార్వతీపురం కాలనీకి చెందిన గిరిజన మహిళలు వెంకటమ్మ, చందు, సుబ్బమ్మ మంత్రి ఏరాను నిలదీశారు. అదేవిధంగా బుక్కాపురం గ్రామానికి చెందిన వికలాంగుడు అందెరాముడు, శ్రీనివాసులు తదితరులు ఫించన్లు ఇస్తారోమోనని వచ్చారు. అయితే వారికీ నిరాశే మిగిలింది. చేస్తాం.. చూస్తాం.. అంటూ అధికారులను కలవమని చెప్పి ఎవరి దారిన వారు వెళ్లిపోవడం గమనార్హం.
చచ్చుబండ
Published Tue, Nov 12 2013 1:35 AM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM
Advertisement