బస్సుల కోసం ప్లాట్‌ఫారాలపై ఎదురుచూస్తున్న ప్రయాణికులు
గుంటూరు నడిబొడ్డున ‘నారా హమారా.. టీడీపీ హమారా’ పేరిట జరిగిన సీఎం సభ ప్రయాణికులతో పాటు, నగర ప్రజలను అష్టకష్టాలకు గురిచేసింది. షెడ్యూలు బస్సులను రద్దుచేసి మరీ ప్రజలను సభకు తరలించేందుకు కేటాయించారు. దీంతో గంటలతరబడి గుంటూరు బస్టాండ్‌కు బస్సులు రాలేదు. వచ్చిన అరకొర బస్సులు చాలకపోవడంతో ప్రయాణికులు ఆటోలు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. వాటిలో అధిక చార్జీలు వసూలు చేశారు. మరో వైపు నగరం మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాతగుంటూరులో దుకాణాలను కూడా మూసివేయించడంతో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఆటోలు ఎక్కేందుకు, ఇళ్లకు చేరుకునేందుకు కిలోమీటర్ల కొద్దీ నడవాల్సిన దుస్థితి నెలకొంది.
నెహ్రూనగర్(గుంటూరు): ‘ముఖ్యమంత్రి వచ్చిన ప్రతిసారీ బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నాం. గంటల తరబడి ఎదురు చూస్తే ఒక్క బస్సు వచ్చింది. ఆ బస్సేమో కిటకిటలాడుతోంది. కాలుపెట్టే జాగాలేదు.. పిల్లాజెల్లతో ఇంటికి ఎలా వెళ్లాలి?’ అంటూ ప్రయాణికులు వాపోయారు. ‘ముఖ్యమంత్రి పర్యటన అంటేనే భయమేస్తోంది. పోలీసులు అడుగడుగునా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. బస్సులు లేవని పిల్లలు కాలేజీలకు వెళ్లకుండా ఇంటికి వచ్చేశారు. అన్ని దుకాణాలను కూడా మూసివేయిస్తే ఎలా?’ అంటూ గుంటూరు నగర ప్రజలు అసహనం వ్యక్తం చేశారు.‘నారా హమారా...టీడీపీ హమారా’ పేరిట గుంటూరు నగరం నడిబొడ్డను ఉన్న బ్రహ్మానందరెడ్డి (బీఆర్)స్టేడియంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నిర్వహించిన మైనార్టీ సదస్సు నగర ప్రజలకు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగించింది. బీఆర్ స్టేడియంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఈ సభ కోసం అధికారులు సోమవారం సాయంత్రం నుంచే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టారు.
సభకు ప్రజలను తరలించేందుకు జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు కేటాయించారు. ఈ బస్సులను వివిధ ప్రాంతాలకు తరలించి అక్కడి నుంచి మైనార్టీలను సభకు తీసుకొచ్చారు. బస్సులు లేకపోవడంతో షెడ్యూలు సర్వీసులు రద్దయ్యాయి. ఫలితంగా బస్సులు లేక గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వెలవెలబోయింది. ప్రయాణికులు మాత్రం ప్లాట్‌ఫాంలపై కిక్కిరిశారు. ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు గంటకో, రెండు గంటలకో ఒకటి చొప్పున రావడం, అది కాస్తా క్షణాల్లో కిటకిటలాడటంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. గంటల తరబడి మరో బస్సు కోసం ఎదరు చూడలేక, పిల్లలతో బస్టాండ్‌లోనే వేచివుండలేక ఆటోలను ఆశ్రయించక తప్పలేదు. ఆటోవాలాలు అధిక చార్జీలు వసూలుచేయడంతో ప్రయాణికుల జేబులు ఖాళీకాక తప్పలేదు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు మాత్రం ఆటోలు కూడా లేక గంటల తరబడి బస్టాండ్‌లోనే పడిగాపులు కాశారు. చివరకు ప్రైవేటు వాహనాల్లో గమ్యస్థానాలకు చేరాల్సిన పరిస్థితి దాపురించింది.
జిల్లా నుంచి 436 బస్సులు
గుంటూరు రీజియన్ పరిధిలో 13 డిపోలు ఉన్నాయి. ఈ డిపోల్లో మొత్తం 1,017 బస్సులు ఉన్నాయి. వాటిలో 436 బస్సులు సీఎం సభ కోసం కేటాయించారు. ఇందు కోసం ఆయా బస్సులు షెడ్యూలు సర్వీసులను రద్దుచేశారు. షెడ్యూలు బస్సులు లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండుటెండలో రోడ్డుపక్కనే బస్సుల కోసం పడిగాపులుకాశారు. మరోవైపు బస్సుల్లో విధులకు వెళ్లే ఉద్యోగులకూ ఇబ్బందులు తప్పలేదు.
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థులు
గుంటూరు నుంచి నరసరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరిపేట, పొన్నూరు, విజయవాడలలోని వివిధ ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, మెడిసిన్ కాలేజీలకు వేల సంఖ్యలో విద్యార్థుళు వెళ్లొస్తుంటారు. సీఎం సభకు బస్సులను కేటాయించడం, నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో విద్యార్థులు ఇ బ్బందులు ఎదుర్కొన్నారు. సరిపడ బస్సులు లేకపోవడంతో చాలా మంది కళాశాలలకు వెళ్లకుం డానే ఇంటిబాట పట్టారు. ఇంటికి వెళ్లేందుకు సైతం ట్రాఫిక్ ఆంక్షలతో నడిచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. సాయంత్రం వేళల్లో బస్సులు కోసం వేచి వేచి చూసి ఆటోలు, ఇతర ప్రయివేట్ వాహనాల్లో వేలాడుతూ గుంటూరు చేరుకోవాల్సి వచ్చింది.
అధిక చార్జీలు వసూలు
ఆర్టీసీ బస్సులు సరిపడినన్ని లేకపోవడంతో ఆటోలు, ప్రైవేటు వాహనాలకు డిమాండ్ పెరిగింది. దీంతో ఆటోలు, టాటామ్యాజిక్, కార్లు వంటి వాహనాలను ప్రయాణికులు ఆశ్రయించారు. వాటి డ్రైవర్లు చార్జీలను రెట్టింపుచేశారు. ఆర్టీసీ బస్సులో గుంటూరు నుంచి పేరేచర్లకు రూ.10 వసూలు చేస్తే, ప్రైవేట్ వాహనాల్లో రూ.20 వసూలు చేసినట్లు ప్రయాణికులు తెలిపారు.
నగర శివారులో బాగుండేది
సీఎం సభను గుంటూరు నగరం నడిబోడ్డులో ఏర్పాటు చేస్తే ప్రయాణికులు, నగర వాసులు ఇబ్బందులు పడతారే కనీస అవగాహన తెలుగుదేశం పార్టీ పెద్దలకు, ప్రభుత్వానికి లేకపోవడం బాధాకరమని పలువురు పేర్కొన్నారు. సీఎం స్థాయిలో హాజరయ్యే కార్యక్రమాలను నగరానికి దూరంగా శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే బాగుండేదని పలువురు ప్రయాణికులు అభిప్రాయం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment