కొవ్వూరు టీటీడీ కల్యాణ మండపం వద్ద వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వీడ్కోలు పలికేందుకు తరలివచ్చిన అశేష జనవాహిని
ఏటయ్యిందే గోదారమ్మా.. ఎందుకీ ఉలికిపాటు, తుళ్లిపాటు.. ఎవరో వచ్చినట్టు.. మన సీమకు మంచి ఘడియే రాబోతున్నట్టూ.. అంటూ ఓ సినీకవి రాసినట్టు దాదాపు నెలరోజులపాటు జన గోదారి ఎగసిపడింది. జయహో..జగన్ అంటూ నినదించింది. మంగళవారం అఖండ గోదారిపై రోడ్ కం రైలు వంతెనను ముంచెత్తింది. జననేతకు ఘన వీడ్కోలు పలికింది. దుష్టపాలనకు ఆఖరి ఘడియ దగ్గరైనట్టు హెచ్చరికలు పంపింది.
సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోదావరి తీరం ఉప్పొం గింది. ‘నేల ఈనిందా.. ఆకాశం నుంచి చుక్కలు నేలను తాకాయా.. అన్న చందంగా ఎగసి పడిన జన గోదారి తరంగంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తడిసి ముద్దయ్యారు. ఆయన మంగళవారం జిల్లాలో ప్రజాసంకల్ప పాదయాత్రను ముగించుకుని తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా కొవ్వూరు రోడ్డు కం రైలు వంతెనపై జిల్లా ప్రజలు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ‘మా గుండెల్లో కొలువయ్యావు.. మా కోసం మళ్లీమళ్లీ రావాలి.. ముఖ్యమంత్రిగా రావాలి అంటూ.. ఆకాంక్షించారు. విజయీభవ అంటూ దీవించారు. అదే సమయంలో తూర్పు గోదావరి ప్రజలు జననేతకు అపూర్వ స్వాగతం పలికారు.
ఆకాశం దిగివచ్చిందా..
ఆకాశం దిగి వచ్చిందా అన్నట్టూ.. రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి నీలి రంగులో మెరిసిపోయింది. వైఎస్సార్ సీపీ జెండాలతో రెపరెపలాడింది. గోదావరిలో ఏకంగా సుమారు 600 పడవల్లో కార్యకర్తలు పార్టీ జెండాలు ఎగురవేసి.. జగన్‌తోనే మేమంటూ ముందుకు సాగారు. ప్యారాచూట్‌లతో ఆకాశంలోనూ జెండాలు ఆవిష్కరించి అబ్బురపరిచారు.
ఉరకలెత్తిన ఉత్సాహం..
108మంది మహిళలు కలశాలతో వైఎస్ జగన్‌కు స్వాగతం పలికారు. 30మంది బాలికలు వీణలతో జయజయధ్వానాలు చేశారు. 150మంది గుమ్మడి కాయలతో హారతులు పట్టారు. డప్పు వాయిద్యాలు, గరగ నృత్యాలు, తీన్‌మార్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. యువకులు ఉరిమే ఉత్సాహంతో ర్యాలీలు నిర్వహించారు. నృత్యాలతో కేరింతలు కొట్టారు. జగన్ వెంట ఉరకలెత్తారు.
జన ప్రభంజనమై..
ప్రజాసంకల్ప పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలోకి మే 13న దెందులూరు నియోజకవర్గం పెదయడ్లగాడ, కలకుర్రు మధ్య ప్రవేశించింది. ఏలూరు, దెందులూరు, గోపాలపురం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, ఉండి, భీమవరం, నరసాపురం, పాలకొల్లు, ఆచంట, తణుకు, నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాలు జన ప్రభంజనమై జననేత వెంట నడిచాయి. పల్లెలు జగన్‌కు జేజేలు పలికాయి. అన్నార్తులు, ఆపన్నులు జననేతతో కష్టసుఖాలు పంచుకున్నారు. అందరికీ అండగా ఉంటానని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. అందరి బంధువునని నిరూపించారు.
యాత్ర సాగిందిలా..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర కొవ్వూరు నియోజకవర్గంలో 187వ రోజు దిగ్విజయంగా జరిగింది. ఉదయం 9 గంటలకు పాదయాత్రను కొవ్వూరు గోదావరి గట్టు నుంచి జననేత ప్రారంభించారు. గోదావరి ఒడ్డున గోష్పాదక్షేత్రం వద్ద గోదారమ్మ తల్లికి శాస్త్రోక్తంగా హారతులు ఇచ్చి పూజలు చేశారు. అనంతరం పాదయాత్రగా శ్రీనివాసపురం వరకూ ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగారు. శ్రీనివాసపురంలో వైఎస్ జగన్ మధ్యాహ్న శిబిరానికి చేరుకున్నారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర అట్టహా సంగా వేలాదిమంది ప్రజల జయజయ ధ్వానాలతో కొవ్వూరు రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి మీదుగా తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది.
28రోజులు.. 13 నియోజకవర్గాలు
పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర 28రోజులు సాగింది. 13 నియోజకవర్గాల్లో జనదీవెన అందుకుంది. ఏలూరు నియోజకవర్గంలో 2వేల కిలోమీటర్ల మైలురాయి వైఎస్ జగన్ పాదాక్రాంతమైంది. చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచింది. అక్కడ జననేత 40 అడుగుల పైలాన్‌ను ఆవిష్కరించారు. జిల్లాలో ఏకంగా 24 మండలాలు, ఏలూరుతోపాటు ఏడు పట్టణాల్లో పాదయాత్ర జరిగింది. 316.9కిలోమీటర్ల మేర జగన్ నడిచారు. 11బహిరంగ సభల్లో జననేత ప్రసంగించారు. ప్రజలకు భరోసా ఇచ్చారు. వరాల జల్లు కురిపించారు. నాలుగు ప్రాంతాల్లో వివిధ వర్గాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు.
తరలివచ్చిన శ్రేణులు
పాదయాత్రకు పార్టీ శ్రేణులు తరలివచ్చాయి. పార్టీ జిల్లా పరిశీలకుడు, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆళ్లనాని, నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొయ్యే మోషేన్‌రాజు, ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు తానేటి వనిత, జి. శ్రీనివాసనాయుడు, గ్రంధి శ్రీనివాస్, పుప్పాల వాసుబాబు, కొట్టు సత్యనారాయణ, తెల్లం బాలరాజు, తలారి వెంకట్రావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కారుమూరి నాగేశ్వరరావు, గుణ్ణం నాగబాబు, మధ్యాహ్నపు ఈశ్వరి, ఎలీజా, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పార్టీ నేతలు తలశిల రఘురామ్, కొఠారు రామచంద్రరావు, పాతపాటి సర్రాజు, గాదిరాజు సుబ్బరాజు, కవురు శ్రీనివాస్, కమ్మ శివరామకృష్ణ, దిరిశాల కృష్ణశ్రీనివాస్, ఏలూరు నగర అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్, పార్టీ నేతలు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, గూడూరి ఉమాబాల, జగ్గవరపు జానకీరెడ్డి, పరిమి హరిచరణ్, మంతెన యోగీంద్రబాబు, మామిళ్లపల్లి జయప్రకాష్, కారుమంచి రమేష్, యడ్ల తాతాజీ, కుమార దత్తాత్రేయ వర్మ, పాతపాటి వర్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment