సాక్షి కడప : తెలుగుదేశం ప్రభుత్వంలో పలు సామాజిక వర్గాలకు సంబంధించి కార్పొరేషన్లు పెట్టినా.. లంచాలు, కమిటీల ముద్ర పడనిదే అందక అవస్థలు పడుతున్న అభాగ్యులకు నేనున్నానంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇస్తున్నారు. వెనుకబడిన సామాజిక వర్గాలకు సంబంధించి కార్పొరేషన్ ద్వారా ఏకంగా పెద్ద మొత్తంలో డబ్బు అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పలు సామాజిక వర్గాలకు చెందిన మహిళల్లో లక్ష్మీ కళ ఉట్టిపడనుంది. ఇప్పటికే స్వయం సహాయక గ్రూపులకు సంబంధించి ఎన్నికల నాటికి ఉన్న మొత్తం రుణాన్ని అంతా నాలుగు విడతల్లో చెల్లిస్తానని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాకుండా మహిళలకు రుణాల విషయంలో ‘సున్నా’ వడ్డీ విప్లవం తీసుకు వస్తానని ప్రకటించారు. వెనుకబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లోని 45 ఏళ్లు నిండిన మహిళల కుటుంబాలకు ఏకంగా రూ. 75 వేలు ఉచితంగా అందజేస్తానని సంచలన ప్రకటన చేయడంతో వారిలో హర్షం వ్యక్తమవుతోంది.
టీడీపీది అంతా ప్రచార స్టంట్
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త సీసాలో పాత సారా చందాన పాత పథకాలకే కొత్త పేర్లు పెడుతూ పబ్లిసిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. పలు సామాజిక వర్గాలకు కార్పొరేషన్లు పెట్టినా జన్మభూమి కమిటీల పేరుతో కేవలం టీడీపీ అనుయాయులకు అందజేసుకుంటూ అర్హులకు అన్యాయం చేస్తున్నారు. అందులోనూ కార్పొరేషన్లకు సంబంధించి యూనిట్లు అరకొరగా కేటాయించడం.. నిధులు కూడా అంతంత మాత్రమే ఇస్తున్నారు. దీంతో అనేక సామాజిక వర్గాల్లో పేదరికంలో మగ్గుతున్న వారికి రుణాలు అందడం కష్టతరంగా మారింది. పైగా ఎంతో కొంత లంచాలు, కమిటీల ఆమోదాలు, ఆన్‌లైన్ పేరుతో దోపిడీ పర్వం కొనసాగుతోంది.
డ్వాక్రా మహిళలకు రుణ విముక్తి
స్వయం సహాయక బృందాల మహిళలకు సంబంధించి తీసుకున్న రుణాలను మొత్తం నాలుగు విడతల్లో అక్కచెల్లెమ్మల చేతికే అందిస్తామని గతంలోనే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రకటించారు. ఎన్నికల నాటికి రుణం ఎంతున్నా అంత సొమ్మును చెల్లించనున్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళలకు రుణ మొత్తం నాలుగు విడతల్లో ఇంటికి చేరనుంది. జిల్లాలో దాదాపు ఐదు లక్షల మంది డ్వాక్రా మహిళలకు లబ్ధి ఒనగూరనుంది. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు డ్వాక్రా రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని చేతులు ఎత్తేశారు. ఆ తర్వాత ఒక్కొక్క సభ్యురాలికి రూ. 10 వేలు ఇస్తామంటూ.. అదీ కూడా ఒకేసారి కాకుండా పలు విడతల్లో ఇవ్వడంతో డ్వాక్రా మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు ఉచితంగా రూ. 75 వేలు
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లోని మహిళలకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రత్యేక వరం ప్రకటించారు. ఆయా సామాజిక వర్గాల్లోని 45 ఏళ్లు నిండిన మహిళల కుటుంబాలకు ఏకంగా వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ. 75 వేలు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అందులోనూ రూ. 75 వేల సొమ్మును నాలుగు విడతల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా అందించనున్నారు.
‘0’ వడ్డీ విప్లవం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సున్నా వడ్డీ విప్లవం తీసుకురానున్నారు. ఇప్పటికే రైతుల రుణాలకు సంబంధించి సున్నా వడ్డీతో అందించనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా డ్వాక్రా మహిళలకు సంబంధించి కూడా తీసుకున్న రుణాలపై సున్నా వడ్డీతో ఇస్తామని ప్రకటించడంతో పొదుపు సంఘ మహిళల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
జగన్ సీఎం అయ్యే రోజు కోసం ఎదురు చూస్తున్నాం
ఈ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ ఆటో ఖర్చులకే సరిపోయింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డ్వాక్రా మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ప్రకటించిన పథకాలు బాగున్నాయి. ఆయన సీఎం అయ్యే రోజు కోసం ఎదురు చూస్తున్నాం. – వీరమ్మ, లక్ష్మి స్వయం సహాయక సంఘం
Comments
Please login to add a commentAdd a comment