కర్నూలు (ఓల్డ్‌సిటీ) : పింఛన్లు పొందడంలో పండుటాకుల కష్టాలు తారాస్థాయికి చేరాయి. గజగజ వణికే చలిని లెక్క చేయకుండా సాయంత్రం వరకు పడిగాపులు కాచినా పింఛన్లు అందడం లేదు. నడవలేక పోస్టాఫీసులకు వెళ్లలేని స్థితిలో ఉన్న వారు సైతం తప్పని పరిస్థితుల్లో ఆటోల్లో తిరుగుతున్నారు. ఆటో ఖర్చులు మోపడవుతున్నా మిషనులో వేలిముద్రలు పడటం లేదు. మంగళవారం సర్వర్ డౌన్ అయిపోవడంతో గంటకు ఓ పెన్షన్ కూడా అందలేదు. ఒకసారి ఆఫ్ అయిన మిషన్లు తిరిగి ఓపెన్ కాలేదు.
ఇలాంటి పరిస్థితి మంగళవారం జిల్లా అంతటా నెలకొంది. 30వ తేదీకి పంపిణీని ముగిస్తారంటూ ఆందోళన పడుతూ వచ్చిన వృద్ధులకు ఇదో ఆశనిపాతంగా మారింది. ఏం చేయాలి, ఎవరి సాయం అర్థించాలో తెలియక పలుచోట్ల ధర్నాలు చేపట్టారు. జిల్లాలో 3,02,101 మంది పింఛన్ల పంపిణీ బాధ్యతను అధికారులు పోస్టాఫీసులకు అప్పగించారు. అయితే అధికారులు సోమవారం సాయంత్రానికి కేవలం 2,34,670 పింఛన్లు మాత్రమే పంపిణీ అయ్యాయి. మిగతా 67,432 పింఛన్లను 30వ తేదీ పూర్తి చేయాలని అధికారులు అనుకుంటున్న సమయంలో ఇలాంటి పరిస్థితి నెలకొంది.
సర్వర్ మొరాయించడంతో కొన్నిచోట్ల మిషన్లు కూడా ఓపెన్ కాలేదు. నగరంలోని మెడికల్ కళాశాలలో ఉన్న పంపిణీ కేంద్రం వద్ద సుమారు 800 మంది లబ్ధిదారులు పడిగాపులు కాశారు. అధికారులు సరైన విధానం పాటించకుండా తమను ఇబ్బంది పెడుతున్నారంటూ శాపనార్థాలు పెట్టారు. ఎస్‌ఏపీ క్యాంప్ పోస్టాఫీసు వద్ద సుమారు 700 మంది వృద్ధుల్లో మధ్యాహ్నం ఒక్కరికి కూడా పింఛన్ లభించకపోవడంతో ఏపీఎస్‌పీ క్యాంప్ ఎదుట రోడ్డుపై ధర్నా చేపట్టారు.దీంతో గంట సేపు బస్సులు, ఇతర వాహనాలు ఆ మార్గంలో వెళ్లలేకపోయాయి. అలాగే బుధవారపేటకు చెందిన వృద్ధులు స్థానిక కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా చేపట్టారు. ధర్నాకు సీపీఎం నాయకులు కూడా సంఘీభావంగా నిలిచారు.
పంపిణీ మరో రోజు పొడిగిస్తాం
మొదట ఈనెల 30వ తేదీతో పంపిణీ ముగించాలనుకున్నాం. అయితే చివరి రోజున ఆన్‌లైన్‌లో సాంకేతిక కారణాల వల్ల సర్వర్ సరిగ్గా పనిచేయలేదు. అందువల్ల పింఛన్ల పంపిణీని మరుసటి రోజు అంటే బుధవారం కూడా పంపిణీ చేస్తాం. పంపిణీ కాని పింఛన్లు ఎక్కడికీ పోవు. వాటిని తదుపరి నెలలో కలిపి చెల్లిస్తాం.
- కె.వి.సుబ్బారావు, పోస్టల్ సూపరింటెండెంట్
సర్వర్ డౌన్.. పింఛన్లకు బ్రేక్
Published Wed, Dec 31 2014 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM
Advertisement
Advertisement