‘చుక్..చుక్’ కలలకు గ్రీన్ సిగ్నలేనా!
సాక్షి, కాకినాడ : నాటి ఎన్డీఏ హయాంలో పునాదిరాయి పడిన రైల్వేప్రాజెక్టులకు నేటి ఎన్డీఏ ప్రభుత్వంలోనైనా మోక్షం లభించకపోతుందా, రైల్వే మంత్రి సదానందగౌడ్ మంగళవారం ప్రవేశపెట్టనున్న రైల్వేబడ్జెట్ అయినా తమ ఆకాంక్షలను సాకారం చేయకపోతుందా అని జిల్లావాసులు ఆశపడుతున్నారు. పెండింగ్ ప్రాజెక్టుల్ని పట్టాలెక్కించడంతో పాటు రాష్ర్ట విభజన నేపథ్యంలో మరికొన్ని ప్రాజెక్టులు, రైళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
విశాఖ- చెన్నైల మధ్య ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కానున్న నేపథ్యంలో కాకినాడ-బాపట్ల మధ్య కొత్త రైల్వేలైన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్‌ను పట్టాలెక్కించడంతో పాటు నర్సాపురం నుంచి మచిలీపట్నం-రేపల్లె-నిజాంపట్నంల మీదుగా బాపట్ల వరకు పొడిగిస్తూ, కాకినాడ-మచిలీపట్నం-నిజాంపట్నం ఓడరేవులను కలుపుతూ కొత్తలైన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
వందలకోట్లు ఇస్తున్నా చిన్నచూపే..
దక్షిణ మధ్య రైల్వేకి రూ.900 కోట్లకు పైగా ఆదాయాన్ని తెచ్చి పెడుతున్న మన జిల్లా పట్ల కేంద్ర ప్రభుత్వాలు వివక్ష చూపుతూనే ఉన్నాయి. దశాబ్ద కాలంగా యూపీఏ- 1, 2 హయాంలో ప్రతి రైల్వే బడ్జెట్‌లో మొండిచేయే మిగిలేది. ఈఏడాది ఫిబ్రవరి 12న అప్పటి రైల్వేమంత్రి మల్లిఖార్జునఖార్గే ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జిల్లా మీదుగా కొత్తగా సికింద్రాబాద్-విశాఖపట్నం ఏసీ ఎక్స్‌ప్రెస్ మినహా ఒరిగిందేమీ లేదు. జిల్లా కేంద్రమైన కాకినాడను మెయిన్‌లైన్‌కు అనుసంధానించాలన్నది దశాబ్దాల కల. అనుసంధానానికి కాకినాడ-పిఠాపురంల మధ్య 21 కిలోమీటర్ల బ్రాడ్‌గ్రేజ్ లైన్ వేయాలి. రూ.126 కోట్లు వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుకు 2012 బడ్జెట్‌లో రూ.5 కోట్లు కేటాయిస్తే 2013లో రూ.కోటి మాత్రమే విదిల్చారు. ఈ బడ్జెట్‌లోనైనా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తారని కాకినాడ వాసులు ఆశిస్తున్నారు.
కోనసీమకు రైల్వేకూత వినిపించేనా?
కోటిపల్లి-నర్సాపురం రైల్వేప్రాజెక్టుకు దివంగత లోక్‌సభాపతి జీఎంసీ బాలయోగి కృషితో 2000 నవంబరు 16న నాటి ఎన్డీఏ హయాంలో పునాదిరాయి పడింది. 55 కిలో మీటర్ల ఈ లైన్ నిర్మాణ వ్యయం 2000లో రూ.329 కోట్లు కాగా ప్రస్తుతం రూ.1100 కోట్లకు చేరింది. ట్రాక్, స్టేషన్ నిర్మాణాలకు 161.43 ఎకరాలు సేకరించగా,ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కోసం రూ.70 కోట్లు మాత్రమే కేటాయించారు. దీంట్లో అధిక మొత్తం పరిహారానికి, మిగిలింది సర్వేలకు ఖర్చుచేశారు. నిర్మాణ వ్యయంలో 25 శాతం నిధులు ఇచ్చేందుకు దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చినా కేంద్రం పట్టించుకోనేలేదు.
ఎంపీలు హామీలు నిలుపుకోవాలి..
కొవ్వూరు-భద్రాచలం రైల్వేలైన్ సర్వేకు 2012 బడ్జెట్‌లో ఆమోదం తెలిపినా నేటికీ నిధులు కేటాయించలేదు. కాకినాడ నుంచి ఢిల్లీ, కోల్‌కతా, వారణాసిలకు కొత్త రైళ్లు, కాకినాడ రాజమండ్రిల మీదుగా హైదరాబాద్, తిరుపతిలకు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లను నడపాలని, సర్కార్ ఎక్స్‌ప్రెస్‌ను పుదుచ్చేరి వరకు పొడిగించాలన్న డిమాండ్లు ఈసారైనా కార్యరూపం దాలుస్తాయని ఆశిస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న కాకినాడ- కోటిపల్లి లైన్‌లో రాయగడ వరకు పాసింజర్ రైలును కొత్తగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మెయిన్‌లైన్, కోనసీమ రైల్వేలైన్ సాధిస్తామని కాకినాడ, అమలాపురం ఎంపీలు తోట నరసింహం, పండుల రవీంద్రబాబు ఎన్నికల్లో హామీలిచ్చారు. తోట లోక్‌సభలో టీడీపీ పక్ష నేతగా ఉన్నందున పెండింగ్ రైల్వేప్రాజెక్టులను పట్టాలెక్కిస్తారని ఆశిస్తున్నారు.