ప్రాజెక్టులు పట్టాలెక్కేనా?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:జిల్లాలో రైల్వే సమస్యల పరిష్కారానికి మరో అవకాశం లభించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్‌లో పొందుపరిచేందుకు అవసరమైన ప్రతిపాదనలు, ఇంతకు ముందు పెండింగులో ఉన్న సమస్యలు, ప్రాజెక్టుల వివరాలు ఇవ్వాలని రైల్వే బోర్టు ఎంపీలందరినీ కోరింది. ఈ మేరకు శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో రైల్వే సమస్యలు, పెండింగు ప్రాజెక్టుల వివరాలు సమర్పించేందుకు స్థానిక ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి ప్రతి ఏటా రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు తీవ్ర అన్యాయమే జరుగుతోంది.
జిల్లా పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. బ్రిటీష్ కాలం నుంచి జిల్లాలో పలు స్టేషన్లున్నా మౌలిక సదుపాయాల పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుంది. కొత్త రైళ్లు, హాల్టులతోపాటు పొందూరు-రాజాం రైల్వే లైను, గుణుపురం వరకు బ్రాడ్‌గేజ్ రైళ్లు, రైల్వే ఓవర్‌బ్రిడ్జిల నిర్మాణాలకు కొన్నేళ్ల క్రితమే ప్రతిపాదనలు చేసినా అవేవీ ఇప్పటికీ పట్టాలెక్కడం లేదు. జిల్లా ప్రజాప్రతినిధులు లేఖలు రాసి చేతులు దులుపుకోవడం తప్ప రైల్వేబోర్డు, రైల్వే మంత్రిత్వ శాఖపై రాజకీయంగా ఒత్తిడి తెచ్చేందుకు ఏమాత్రం ప్రయత్నించడం లేదన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వేలకు సంబంధించి ఉన్న సమస్యలను ప్రస్తావించాలంటూ రైల్వే బోర్డు తాజాగా ఎంపీలను కోరడంతో తన పరిధిలోని ఎమ్మెల్యేలు, రైల్వేస్టేషన్ల అధికారులు, నిపుణులు, స్వచ్చంద సంస్థల సూచనలు స్వీకరించాలని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు నిర్ణయించుకున్నారు.
అన్నీ సమస్యలే..
శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో పొందూరు, శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస), దూసి, జి.సిగడాం, తిలారు, కోటబొమ్మాళి, డి.జి.పురం, నౌపడ, పూండి, రౌతుపురం, పలాస, మందస, హరిపురం, కంచిలి(సోంపేట ఆర్‌ఎస్), హరిశ్చంద్రపురం, ఉర్లాం, జాడుపూడి ఆర్‌ఎస్, ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్లు ఉన్నాయి. అయితే ఏ స్టేషన్‌లోనూ సరైన మరుగుదొడ్లు, మంచినీరు, ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు, ఇతర వసతులు లేవనే విషయం అందరికీ తెలిసిందే. అదే విధంగా శ్రీకాకుళం మీదుగా ప్రయాణించే చాలా రైళ్లు రెండుమూడు స్టేషన్లు తప్ప ఎక్కడా ఆగడం లేదు. జిల్లా మీదుగా పలు సూపర్‌ఫాస్ట్ రైళ్లు నడుస్తున్న శ్రీకాకుళం రోడ్, పలాస వంటి పెద్ద స్టేషన్లలోనూ ఆగడం లేదు. కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలు రికార్డులకే పరిమితమవుతున్నాయి.
తిలారు స్టేషన్ వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించాలన్న ప్రతిపాదన ఉన్నా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. పలాసలో ఫ్లై ఓవర్ పనులు మందకొడిగా సాగుతున్నాయి. రెండు నెలల క్రితం భువనేశ్వర్‌లో జరిగిన రైల్వే జనరల్ మేనేజర్ల సమావేశంలో ఈ సమస్యలను స్థానిక ఎంపీ వారికి నివేదించారు. కాగా ఏటా ఫిబ్రవరిలో పార్లమెంటులో ప్రవేశపెట్టే రైల్వేబడ్జెట్ రూపకల్పనకు మూడు నాలుగు నెలల ముందునుంచే కసరత్తు మొదలవుతుంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో రైల్వే బోర్డు అధికారులు ఎంపీలందరి నుంచి ప్రతిపాదనలు కోరడం ఆనవాయితీగా వస్తోంది. ఎంపీలిచ్చే నివేదికల్లోని సాధ్యాసాధ్యాలను, అవసరాలను పరిశీలించి బడ్జెట్‌లో పొందుపరుస్తారు. ఈసారి కూడా రైల్వేబోర్డు నుంచి నివేదికలు కోరిన విషయాన్ని ఎంపీ రామ్మోహన్‌నాయుడు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా.. గతంలో జీఎం సమావేశంలో సమస్యలపై నివేదించానని, వచ్చే ఏడాది బడ్జెట్ కోసం అందరి సూచనలతో మరో నివేదిక తయారు చేసి బోర్డుకు త్వరలోనే అందజే స్తానని చెప్పారు.