దుండగుని తీగలాగితే... ‘దేశం’ డొంక కదులుతోంది | Perfect Plan For Murder Attempt On YS Jagan | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 28 2018 3:11 AM | Last Updated on Sun, Oct 28 2018 12:37 PM

Perfect Plan For Murder Attempt On YS Jagan - Sakshi

సాక్షి ప్రతినిధులు, విశాఖపట్నం, కాకినాడ, అమరావతి: తీగ లాగితే డొంకంతా కదలినట్లు... ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దారుణ హత్యాయత్నానికి ఒడిగట్టిన దుండగుడి గురించి ఆరాతీస్తే తెలుగుదేశం డొంకంతా కదులుతోంది. ఠానేలంక అనే ఓ మారుమూల కుగ్రామంలో మొదలైన ఈ కుట్ర.. విశాఖ ఎయిర్‌పోర్టులోని రెస్టారెంటుకు చేరుకుంది. దుండగుడు జనుపల్లె శ్రీనివాసరావుది తెలుగుదేశం కుటుంబమేననేందుకు స్పష్టమైన ఆధారాలు లభించాయి. అంతేకాదు తెలుగుదేశం నేతలు అతనిని ఎంపిక చేసుకుని మరీ తర్ఫీదు ఇచ్చారు. అనేక రకాలుగా లబ్ధి చేకూర్చారు. ఇతరుల కంటే ఎక్కువ జీతం ఇవ్వడమే కాదు ఇంటి అద్దె కూడా కట్టారు. ఇంకా పెద్ద మొత్తమే ఇచ్చి ఉంటారన్న అనుమానాలకు అనేక ఆధారాలు దొరికాయి.

ఒక రకంగా సుపారీ ఇచ్చారన్నమాట. దాంతో శ్రీనివాసరావు ఎన్నో జల్సాలు చేశాడు. కోటిరూపాయలతో నాలుగెకరాల భూమి బేరం కూడా చేశాడు. ఇదంతా తెలుగుదేశంలోని పెద్ద తలకాయల మార్గదర్శకత్వంలో ఎనిమిదినెలల నుంచి ఓ పక్కా ప్రణాళికతో సాగుతున్న కుట్ర. క్షేత్రస్థాయిలోనూ, విశాఖ విమానాశ్రయంలోనూ కూపీలాగితే నిర్ఘాంతపోయే వాస్తవాలెన్నో బైటపడ్డాయి. శ్రీనివాసరావు వెనక తెలుగుదేశం నేతలు ఎవరెవరున్నారో.. శ్రీనివాసరావుకు ఏమేమి సమకూర్చారో.. వాటితో అతను ఏమేం చేశాడో.. అన్నీ బయటపడ్డాయి... ఆ వివరాలు చూడండి.. 
 
ఈ కుట్రకు ఎనిమిది నెలల క్రితమే బీజం.. 
పందెం కోళ్ళకు కత్తులు కట్టడంలో ఆరితేరిన శ్రీనివాసరావు ఈ ఏడాది జనవరిలో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు విశాఖలో భారీ ఎత్తున నిర్వహించిన కోడిపందేల నిర్వహణకు వచ్చాడని అంటున్నారు. వెలగపూడికి సన్నిహితుడైన హర్షవర్ధన్‌ చౌదరికి కోడిపందేల నేపథ్యంలోనే పరిచయం అయ్యాడని, ఆ క్రమంలోనే జగన్‌పై కుట్రకు బీజం పడిందని అంటున్నారు. శ్రీనివాసరావుపై పూర్తిస్థాయిలో నమ్మకం కుదిరిన తర్వాత పోలీసుల చేత నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌వోసీ) ఇప్పించి మరీ తన రెస్టారెంట్‌లో పనికి పెట్టుకున్నారు. పైగా.... ఎయిర్‌పోర్టుకు సమీపంలోని విమాననగర్‌లో అతను నివాసం ఉంటున్న ఇంటికి హర్షవర్ధనే అద్దె చెల్లిస్తున్నాడు.

శ్రీనివాసరావును ప్రధాన కుక్‌గా పనిలో పెట్టుకున్నానని, రూ.20వేలు జీతం కూడా ఇస్తున్నానని హర్షవర్ధన్‌ రెండురోజులుగా మీడియాకు చెబుతున్నారు. అలాంటపుడు తన వద్ద పనిచేస్తున్న ఓ ఉద్యోగి నివాసం ఉంటున్న ఇంటికి అద్దె చెల్లించాల్సిన అవసరం ఎందుకొచ్చిందన్న ప్రశ్న తలెత్తుతోంది. పోనీ తన రెస్టారెంట్‌లో పనిచేస్తున్న వారందరికి వసతిసౌకర్యం కల్పిస్తామని ఏమైనా ఒప్పందం చేసుకున్నారా? అంటే లేదనే సమాధానం వస్తుంది. హోటల్‌లోని పని చేస్తున్న ఇతర సిబ్బంది తామంతా అద్దె ఇళ్లల్లోనే ఉంటున్నామని తమకు జీతాలు ఇస్తాన్నారే తప్ప ప్రత్యేకంగా అద్దెలు చెల్లించడం లేదని శనివారం ఆ రెస్టారెంట్‌కు వెళ్ళిన సాక్షి ప్రతినిధితో చెప్పారు. అయితే వ్యూహాత్మకంగా ఇటీవల శ్రీనివాసరావుకు ఇచ్చిన రూమ్‌లో కొత్తగా వచ్చిన సిబ్బందికి షెల్టర్‌ ఇచ్చినట్టు చెబుతున్నారు.

వారిలో ఒకరు తెలుగువారు కాగా, మిగిలిన ఇద్దరు మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌కు చెందిన వారని అంటున్నారు. శ్రీనివాసరావు ఉంటున్న గదికి నెలనెలా అద్దెలు చెల్లిస్తుండడం చూస్తుంటే పథకం ప్రకారమే ఇక్కడికి తీసుకొచ్చి రెస్టారెంట్‌లో ఉద్యోగం ఇచ్చాడని అర్ధమవుతోంది. ఇక శ్రీనివాసరావుకు రూ.20వేల జీతం ఇచ్చేవాడినని హర్షవర్ధన్‌ చెబుతున్నారు. కానీ వాస్తవానికి మిగిలిన సిబ్బందికి అందరికీ పదివేలలోపు జీతాలు ఇస్తూ 8నెలల క్రితం చేరిన శ్రీనివాసరావుకు ఒక్కరికే 20వేలు ఎందుకు ఇస్తున్నాడన్నదే అనుమానాలకు బలం చేకూరుస్తోంది. 
 
కత్తులు దాచింది రెస్టారెంట్‌లోనే..  
వైఎస్‌ జగన్‌పై దాడికి తెగబడిన కత్తితో పాటు పోలీసులు శుక్రవారం బయటపెట్టిన మరో కత్తిని శ్రీనివాసరావు ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌లోనే భద్రపరిచినట్టు స్పష్టమవుతోంది. ఆ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న సిబ్బంది అందరూ తమ బ్యాగులను వంటగది సమీపంలోని రూమ్‌లో పెట్టుకునే వారని, కానీ శ్రీనివాసరావు మాత్రం ఎప్పుడూ క్యాష్‌ కౌంటర్‌ వద్దనే బ్యాగ్‌ పెట్టుకునే వాడని చెబుతున్నారు. క్యాష్‌కౌంటర్‌ మూలన సీసీ ఫుటేజ్‌ స్పష్టంగా వెళ్ళదని, అది దాటి ముందుకు వస్తే ఫుటేజ్‌ వస్తుందని అందుకే అతను ఎప్పుడూ బ్యాగులను అక్కడే పెట్టుకున్నట్టు ఇప్పుడు మాకు అర్ధమైందని సిబ్బంది అంటున్నారు.

‘‘వారం కితమే సొంతూరు వెళ్ళి వచ్చాడు.. బహుశా అప్పుడే కత్తులు తీసుకుని వచ్చి ఉంటాడు.. మేం ఇక్కడ సిబ్బంది అన్ని విషయాలు మాట్లాడకూడదు.. వాస్తవానికి అతని తీరు చాలా అనుమానాస్పదంగానే ఉండేది.. వారం కితం ఊరి నుంచి వచ్చిన తర్వాత చాలా తెగింపుగా కనిపించాడు,, త్వరలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తానని అనే వాడు.. కానీ ఇలాంటి పని చేస్తాడని అనుకోలేదు.. అతను ఎప్పుడూ సాయంత్రం బి– షిఫ్ట్‌.. ఆరోజు మాత్రం అతను ఉదయం ఎ– ఫిఫ్ట్‌కు వచ్చాడు... ఆ రోజు ఎందుకొచ్చాడో తెలియలేదు. కుక్‌కి హెల్పర్‌గా పనిచేస్తున్న అతను జగన్‌కు నేనే సర్వ్‌ చేస్తానంటూ అడిగి మరీ వెళ్ళాడు..

అతనెందుకలా చేశాడో జగన్‌పై హత్యాయత్నం జరిగిన తర్వాత కానీ మాకు అర్ధం కాలేదు’’అని ఫ్యూజన్‌ఫుడ్స్‌లో పని చేస్తున్న సిబ్బంది వివరించారు. ఆ రోజు అతని ఆవేశం చూస్తే.. జగన్‌ మోహన్‌రెడ్డి గొంతు కోయాలనే అనుకున్నట్టు అర్ధమైందని, దేవుడు దయ వల్ల ఆయన పక్కకు తిరగడంతో భుజానికి తీవ్ర గాయమైందని ఆ హోటల్‌ సిబ్బందితో పాటు విమానాశ్రయం లాంజ్‌లో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులు అంటున్నారు. 
 
రెస్టారెంట్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించని అధికారులు 
జగన్‌పై హత్యాయత్నం ఫుటేజీ విషయమై వీవీఐపీ రూమ్‌లో సీసీ కెమెరాలు లేవని అధికారులు చెప్పుకొస్తున్నారు. కానీ ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ మొత్తం సీసీ టీవీ నిఘాలోనే ఉంది. నిందితుడు శ్రీనివాసరావు జగన్‌పై హత్యాయత్నానికి ఉపయోగించిన కత్తిని వాటర్‌ బాటిల్‌ వేపర్‌ చాటుగా తెచ్చాడని పోలీసులే చెబుతున్నారు. మరి రెస్టారెంట్‌లోనే భద్రపరిచిన కత్తిని అక్కడే వాటర్‌ బాటిల్‌ వేపర్‌లో పెట్టి తీసుకువచ్చినప్పుడు కచ్చితంగా సీసీ ఫుటేజీ ఉండి తీరుతుంది. కానీ ఆ దిశగా ఇంతవరకు అధికారులు దృష్టిసారించలేదు. కనీసం ఫ్యూజన్‌ఫుడ్స్‌ను పరిశీలించే సాహసం కూడా చేయడం లేదు. 
 
ఎయిర్‌పోర్టులో హర్షవర్ధన్‌ ఇష్టారాజ్యం 
ఎనిమిదేళ్ళ కిందట ఎయిర్‌పోర్టులో క్యాంటీన్‌కు అనుమతులు తెచ్చుకున్న హర్షవర్ధన్‌.. చంద్రబాబు పాలన వచ్చిన తర్వాత, అశోక్‌గజపతి రాజు కేంద్ర పౌర విమానాయానమంత్రిగా ఉండగా ఎయిర్‌పోర్టులో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయాడు. విమానాలు ల్యాండ్‌ అయ్యే వరకు వెళ్ళగలిగిన యాప్రాన్‌ పాస్‌ మొదలు.. అతను అక్కడ ఏది చెబితే అది కాదనే పరిస్థితికి వెళ్ళాడు. ఎయిర్‌పోర్టు చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ వేణుగోపాలరావు సహా అందరినీ గుప్పిట్లో పెట్టుకున్నాడు. అందుకే వ్యూహాత్మకంగా ఎయిర్‌పోర్ట్‌ క్యాంటీన్‌ కేంద్రంగానే శ్రీనివాసరావుతో వైఎస్‌ జగన్‌పై దాడి చేసేందుకు పక్కా పథకం రూపొందించినట్టు స్పష్టమవుతోంది. 
 
శ్రీనివాస్‌ ‘ఎల్లో’లింకులకు ఎన్నో ఆధారాలు.. 
జనుపల్లి శ్రీనువాసరావు కుటుంబ సభ్యులతో పాటు శ్రీనివాసరావు తెలుగుదేశంపార్టీ సభ్యుడేనని అనేక అంశాలు స్పష్టం చేస్తున్నాయి. శ్రీనివాస్‌ తండ్రి తాతారావు, ముమ్మిడివరం మండలం ఠానేల్లంక గ్రామ పంచాయితీ మాజీ ఉపసర్పంచ్‌ అయిన చిన్నాన్న నాగేశ్వరరావు కూడా టీడీపీ గ్రామ నాయకులుగా కొనసాగుతున్నారు. శ్రీనివాస్‌ కూడా టీడీపీ సభ్యుడేనని ఠానేల్లంక వాసులు «ఘంటాపథంగా చెబుతున్నారు. శ్రీనివాస్‌ వ్యవహారశైలితో విభేదించిన ఠానేల్లంక గ్రామ పంచాయితీ పరిధిలోని బూరుగులంక గ్రామ టీడీపీలో ఒక వర్గం పార్టీలో అతని సభ్యత్వాన్ని కొనసాగించవద్దని గట్టిగా పట్టుబట్టిందని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు.

జన్మభూమి కమిటీ సభ్యుడిగా శ్రీనివాస్‌ను నియమించాలని ఇటీవల ప్రతిపాదన వచ్చినప్పుడు కూడా అదే వర్గం అడ్డుకుందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. శ్రీనివాస్‌ తండ్రి తాతారావు, పెద్ద సోదరుడు సుబ్బరాజుల పేరుతో ఠానేల్లంకలో గహనిర్మాణ పథకంలో రెండు ఇళ్లు మంజూరు చేశారు. ఒక్కో ఇంటికి రెండున్నర లక్షలు వంతున రూ.5లక్షలు మంజూరు చేశారు. శ్రీనివాస్‌కు ఎస్సీ కార్పొరేషన్‌లో రుణానికి కూడా ఠానేల్లంక జన్మభూమి కమిటీ సభ్యులు సిఫార్సు చేశారు. ప్రస్తుతం ఆ రుణం బ్యాంక్‌లో పెండింగ్‌లో ఉంది. చివరకు శ్రీనివాస్‌కు తెలుగుదేశంపార్టీకి చెందిన హర్షవర్థన్‌చౌదరికి చెందిన విశాఖ ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్‌ఫుడ్స్‌ రెస్టారెంట్‌లో పని కల్పించడంలో కూడా ఠానేల్లంక జన్మభూమి కమిటీ సిఫార్సుతో నియోజకవర్గ ముఖ్య నేత కీలక పాత్ర పోషించారు.

ఠానేల్లంక పంచాయితీలో వైఎస్సార్‌సీపీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్‌ నక్కా రాంబాబు ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటే వైఎస్సార్‌సీపీ నాయకుడంటూ అసలు దరఖాస్తు కూడా తీసుకోలేదు. టీడీపీ పెద్దలు ప్రచారం చేస్తున్నట్టు శ్రీనివాస్‌ వైఎస్సార్సీపీ సానుభూతిపరుడై ఉండి ఉంటే రెండు ఇళ్లు మంజూరు చేసే వారా అని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా శ్రీనివాస్‌ నివాసం ఉంటున్న ఇంటికి ఆనుకుని మూడు ఇళ్లు కూడా లేవు. కానీ ఆ ప్రాంతంలో రోడ్డు వేయడానికి రూ.6 లక్షలు మంజూరు చేశారు. స్థానికంగా స్థల వివాదంతో ఆ రోడ్డు మొదలు పెట్టలేదు కానీ వైఎస్సార్సీపీ సానుభూతిపరులై ఉంటే ఆ రోడ్డు మంజూరు చేస్తారా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులలో స్వయానా అతని చిన్నాన్న నాగేశ్వరరావు ఆ గ్రామానికి ఇటీవలి వరకు ఉపసర్పంచ్‌గా పనిచేశారు. టీడీపీ తరఫున పంచాయతీ ఎన్నికల్లో బరిలోకి దిగి గెలుపొంది ఉపసర్పంచ్‌ అయ్యారు. గ్రామంలో టీడీపీకి సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ నాగేశ్వరరావు పర్యవేక్షిస్తుంటారు. టీడీపీకి చెందిన ముమ్మిడివరం ఎంపీపీ పితాని సత్యనారాయణ, శ్రీనివాస్‌ తండ్రి తాతారావు పార్టీ కార్యక్రమాల్లో చాలా సన్నిహితంగా ఉంటారని గ్రామస్థులు చెబుతున్నారు. 
 
రూ.కోటితో నాలుగు ఎకరాల బేరం 
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై శ్రీనివాస్‌ హత్యాయత్నానికి తెగబడటం వెనుక భారీ డీల్‌ జరిగినట్టుగా తెలుస్తోంది. ఒకప్పుడు పాకెట్‌ మనీకి కూడా ఠికాణా లేని శ్రీనివాస్‌ ఠానేల్లంకలో రూ.కోటి విలువైన నాలుగు ఎకరాల భూమి కొనుగోలుకు సిద్ధపడ్డాడనే సమాచారం స్థానికంగా చర్చనీయాంశమైంది. తండ్రి తాతారావు ఉపాధి హామీ పథకంలో కూలీ. తాతారావుకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. కుటుంబంలో శ్రీనివాస్‌ ఆఖరి వాడు.

కోడిపందేలకు వినియోగించే కోడిపుంజులకు కత్తులు కట్టడంలో వీరిద్దరు చేయి తిరిగిన వారే. గతంలో పని కోసమని ఒకసారి శ్రీనివాస్‌ కువైట్‌ కూడా వెళ్లి తిరిగొచ్చేశాడు. ఆ తరువాత నుంచి అల్లరి చిల్లరిగా తిరుగుతుండే వాడు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో టీడీపీ నాయకుడైన హర్షవర్థన్‌చౌదరికి చెందిన ఫ్యూజన్‌ రెస్టారెంట్‌లో ఏడువేల జీతానికి చేరిన శ్రీనివాస్‌ గడచిన ఏడెనిమిది నెలల్లో తొమ్మిది ఖరీదైన మొబైల్‌ ఫోన్‌లు కొనుగోలు చేశాడు. ఈ నెల 16న సోదరుడు కుమారుడి జన్మదిన వేడుకలకు హాజరైన సందర్బంలో ముమ్మిడివరంలో స్నేహితులకు భారీగా విందు ఏర్పాటు చేశాడని చెబుతున్నారు.

అదే రోజు ఉదయం ఠానేల్లంక గ్రామానికి ఆనుకుని గోదావరికి అవతలవైపు లంక ఆఫ్‌ ఠానేల్లంకలో నాలుగు ఎకరాలు ఒకే బిట్టు చూడమని అక్కడ ఒక భూ స్వామితో మాట్లాడాడు. ఠానేల్లంకలో ఎకరం రూ.40 నుంచి రూ.50లక్షలు ఉండటంతో గోదావరి అవతల లంకలో ఎకరం రూ.25 లక్షలు నుంచి రూ.30 లక్షలు ఉండటంతో అక్కడే కొందామని ఆ భూస్వామికి చెప్పాడని సమాచారం. అంతేకాదు అందుకు సంబంధించిన ఒక బిట్టు కూడా చూశాడని విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో రూ.10లక్షలు అడ్వాన్సుగా కూడా ఇస్తానన్న శ్రీనివాస్‌ వారం రోజుల్లో తిరిగొస్తానని చెప్పడంతో ఆ భూస్వామి విస్తుపోయాడంటున్నారు.

పనిపాటా లేకుండా జులాయిగా తిరిగిన శ్రీనివాస్‌ అంత సొమ్ము పెట్టి నాలుగు ఎకరాలు ఎలా కొంటానంటున్నాడో అర్ధంకాలవడం లేదని ఆ భూస్వామి తన సన్నిహితులతో చెప్పినట్లు తెలిసింది. ఇంతలో విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిపై కోడిపందెం కత్తితో హత్యాయత్నానికి తెగబడిన విషయం బయటపడింది. అంటే శ్రీనివాస్‌తో ఎవరో భారీ డీల్‌ కుదుర్చుకున్నారని, ఆ డబ్బుతోనే ఇక్కడ భూమి కొనడానికి ప్రయత్నించాడని స్థానికులు చర్చించుకుంటున్నారు.  
 
కుటుంబీకుల్లో కనిపించని పశ్చాత్తాపం 
ఎవరి ముఖంలోనూ పశ్చాత్తాపం కనిపించడం లేదు. పీకల్లోతు ఆపదలో చిక్కుకున్నామన్న భయం లేదు. అక్కడ నిందితుడు శ్రీనివాసరావు ఏవిధంగానైతే ఏ మాత్రం భయాందోళన లేకుండా కనిపిస్తున్నాడో.. ఠాణేలంకలోని ఇంటి వద్ద అతడి కుటుంబ సభ్యులు కూడా అదే రకంగా ఉంటున్నారు. అతడి సోదరుడు సుబ్బరాజైతే మరింత ధీమాగా కనిపిస్తున్నాడు. ఆయనలో ఏమాత్రం బెంగ కనబడటం లేదు. వచ్చిన వారందరితో హుషారుగానే నవ్వుతూ మాట్లాడుతున్నాడు. అంత ఘటన జరిగాక అలా ఉండగలరా అని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. 
 
ఏ కార్యక్రమానికీ రాలేదు 
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఆవిర్భావం నుంచీ పార్టీలో ఉన్నాను. పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమంలోనూ నేను పాల్గొంటున్నాను. వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన జనిపెల్ల శ్రీనివాసరావు ఏ రోజూ, ఎప్పుడూ ఏ కార్యక్రమానికీ హాజరు కాలేదు. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో సహితం కనిపించలేదు. అటువంటి నిందితుడిను జగన్‌ అభిమానిగా చెప్పడం కేవలం టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం మాత్రమే. నిందితుడు శ్రీనివాస్, అతడి కుటుంబం టీడీపీలో కొనసాగుతున్నారు. కావాలనే వైఎస్సార్‌ సీపీ అని చెబుతూ హత్యాయత్నం కేసును దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. 
తన్నిడి రాధాకృష్ణ, గురజాపులంక, ముమ్మిడివరం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement