జగన్‌పై హత్యాయత్నం కేసును పక్కదారి పట్టిస్తున్నారు | YSRCP Leaders Request to Rajnath Singh about Murder Attempt On YS Jagan | Sakshi
Sakshi News home page

కేంద్ర సంస్థల దర్యాప్తుతోనే..వెలుగులోకి నిజాలు

Published Tue, Oct 30 2018 3:54 AM | Last Updated on Tue, Oct 30 2018 3:54 AM

YSRCP Leaders Request to Rajnath Singh about Murder Attempt On YS Jagan - Sakshi

వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాలని సోమవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు వినతి పత్రం అందజేసి రాష్ట్రంలో పరిస్థితులను వివరిస్తున్న వైఎస్సార్‌ సీపీ నేతలు

సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం వెనుక అసలు సూత్రధారులెవరో తేల్చాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతోనే విచారణ జరిపించాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కోరినట్లు వైఎస్సార్‌ సీపీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని, ఈ నేపథ్యంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని ప్రత్యేక సంస్థలతో దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేసింది. ఈమేరకు శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ సోమవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రిని కలసి వినతిపత్రం అందచేశారు. అనంతరం మేకపాటి రాజమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్‌పై హత్యాయత్నం జరిగిన విశాఖ విమానాశ్రయం భద్రతా పరిధి కేంద్రం ఆధీనంలో ఉందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణ జరిపించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే చెప్పారన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ వెంటనే కల్పించుకొని కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విచారణను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని మేకపాటి ఆరోపించారు. ఘటన జరిగిన తరువాత అదో చిన్న ఘటన అంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం, పబ్లిసిటీ కోసమే చేశారంటూ డీజేపీ వ్యాఖ్యలు చేయడం కేసును నీరుగార్చే ప్రయత్నమేనని స్పష్టం చేశారు. తమ విజ్ఞప్తిపై కేంద్ర హోంమంత్రి సానుకూలంగా స్పందించారని, విచారణ అంశాల పరిధిని పరిశీలించి వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు.

వైఎస్‌ జగన్‌కు భద్రత పెంచాలి: వైవీ సుబ్బారెడ్డి
‘ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనందున కేంద్ర బలగాలతో భద్రత పెంచాలని రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరాం. జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనను పక్కదారి పట్టించేదుకు టీడీపీ సర్కారు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం జరిపే విచారణపై మాకు నమ్మకం లేదు. ఆపరేషన్‌ గరుడ వెనుక ఎవరున్నారో తేలాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలని కోరాం. జగన్‌పై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమే అని రిమాండ్‌ రిపోర్టులో తేలినా నిందితుడు విచారణకు సహకరించడం లేదంటూ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు’ 

కుట్రలో బాబు, లోకేష్, డీజీపీ భాగస్వాములు: విజయసాయిరెడ్డి
వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కుట్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డీజేపీలు భాగస్వాములు. అసలు విచారణ ప్రారంభం కాకముందే, ఘటన జరిగిన వెంటనే ఇదో పబ్లిసిటీ స్టంట్‌ అని డీజేపీ వ్యాఖ్యానించడం, ఇదంతా డ్రామా అంటూ సీఎం చంద్రబాబు నిందితుడికి క్లీన్‌చిట్‌ ఇవ్వడంతో ఈ కేసును నీరుగార్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కుట్రదారులు బయట పడాలంటే కేంద్ర సంస్థతో విచారణ జరపాలని రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరాం. ఆయన సానుకూలంగా స్పందించారు. సీఎం చంద్రబాబు కొన్నేళ్లుగా నిన్న చెప్పింది ఇవాళ మరిచిపోయే అల్జీమర్స్‌ వ్యాధితో బాధ పడుతూ ప్రజలనూ బాధలు పెడుతున్నారు. ఆయన మాట తీరు, పాలన చూస్తే ఇది అర్థమవుతుంది. తాము తల్చుకుంటే జగన్‌ను ఖైమా చేస్తామని, ప్రతిపక్ష నేతను అంతం చేయాలనుకుంటే భారీ స్థాయిలో ప్లాన్‌ చేస్తామంటూ టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై కూడా విచారణ జరపాలని కోరాం. మేం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరడం లేదు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలని మాత్రమే అభ్యర్థిస్తున్నాం.’

సీఎం, మంత్రులకు పదవుల్లో కొనసాగే హక్కు లేదు: వరప్రసాదరావు 
ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే నైతిక బాధ్యతతో కనీసం పరామర్శించకుండా హేళన చేసి రౌడీల్లా మాట్లాడిన ముఖ్యమంత్రి, మంత్రులకు  ప్రజాప్రతినిధులుగా కొనసాగే హక్కు లేదు. వీరి తీరు వల్ల కేసు విచారణలో నిజాలు బయటకు రావు. అందుకే కేంద్ర సంస్థతో విచారణ జరిపించాలి. డీజేపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ హత్యాయత్నాన్ని తప్పుదోవ పట్టించేలా మాట్లాడడం సిగ్గుచేటు.’

రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు..: బొత్స సత్యనారాయణ
‘ప్రతిపక్ష నేత జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణ తమ పరిధిలో లేదని చంద్రబాబు చెప్పినందు వల్లే కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరాం. ఏపీలోనే కాకుండా ఢిల్లీ వచ్చినప్పుడు కూడా చంద్రబాబు ఇదే విషయాన్ని చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపితేనే నిజాలు బయటికొస్తాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. ఎమ్మెల్యేలకు కూడా రక్షణ కల్పించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. తిత్లీ పెను తుఫాను బాధితులను ఆదుకోవాలని కూడా రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరాం. బాధితులను ఆదుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. వీరికి అండగా నిలవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాం.’ 

రిమాండ్‌ రిపోర్డులపై స్పందించరేం?: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
‘వైఎస్‌ జగన్‌పై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమే అని రిమాండ్‌ రిపోర్టు తేల్చి చెప్పింది. ఇదంతా డ్రామా అని, పబ్లిసిటీ కోసం చేశారని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజేపీ ఇప్పుడెందుకు స్పందించడం లేదు? జగన్‌పై హత్యాయత్నం జరిగితే కనీసం పరామర్శించాల్సింది పోయి దీన్ని ఖండించిన వారిని కూడా చంద్రబాబు తప్పుబట్టడం సిగ్గుచేటు.’ 

కేంద్ర విచారణను వ్యతిరేకిస్తే కుట్రలో టీడీపీ పాత్ర ఉన్నట్లే : మిథున్‌రెడ్డి
‘జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించడాన్ని వ్యతిరేకిస్తే ఈ కుట్రలో టీడీపీ పాత్ర ఉన్నట్లే. ఈ కేసు విచారణ తమ పరిధిలో లేదని చంద్రబాబు చెబుతున్నారు కాబట్టి కేంద్రం విచారణ జరపాలని రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరాం. ఆయన సానుకూలంగా స్పందించారు.’

సీపీఐ నేతలతోనూ భేటీ..
ఢిల్లీ పర్యటన సందర్భంగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, ఎంపీ డి.రాజా, కార్యవర్గ సభ్యుడు నారాయణలతో వైఎస్సార్‌ సీపీ నేతలు భేటీ అయ్యారు. పార్టీ నేతలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, వరప్రసాదరావు ఢిల్లీలోని సీపీఐ కేంద్ర కార్యాలయానికి చేరుకుని జగన్‌పై హత్యాయత్నం ఘటన, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పక్కదారి పట్టించేందుకు చేస్తున్న యత్నాల గురించి వివరించారు. 

‘ప్రతిపక్ష నేత జగన్‌పై హత్యాయత్నం జరిగిన విశాఖ విమానాశ్రయం భద్రతా పరిధి కేంద్రం ఆధీనంలో ఉందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణ జరిపించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ వెంటనే కల్పించుకొని కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణకు ఆదేశించాలని కోరుతున్నాం.’
– కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలసిన అనంతరం మీడియాతో వైఎస్సార్‌ సీపీ నేతలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement