సాక్షిప్రతినిధి, కరీంనగర్ : బియ్యం అమ్మకం ప్రోత్సాహక అర్హత పర్మిట్ల అక్రమ బదిలీల ప్రక్రియ రైస్ మిల్లింగ్ పరిశ్రమకే పెద్ద దెబ్బగా మారింది. కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని సర్కారుకు సకాలంలో అప్పగించిన వారికి ఇచ్చే పర్మిట్లను అసలు వ్యక్తులకు తెలియకుండా రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షుడు కోలేటి మారుతి ఇతరులకు బదిలీ చేయడం జిల్లాలో సంచలనం కలిగించింది. ఈ వ్యవహారం బయటపడినప్పటి నుంచి బియ్యం అమ్మకం అర్హత పర్మిట్ల బదిలీలు పూర్తిగా ఆగిపోయాయి. ఈ విషయంలో తదుపరి నిర్ణయం తీసుకునే వరకు కొత్తగా పర్మిట్లు జారీ చేయవద్దని జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయించారు.
రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు మారుతి చేసిన నిర్వాకంతో ఇప్పుడు అర్హులైన వారికి కూడా కొత్తగా బదిలీ అర్హత పర్మిట్లు జారీ కావడంలేదు. కస్టమ్ మిల్లింగ్ సకాలంలో పూర్తి చేసినా తమకు ఇదేమి శిక్ష అని పలువురు మిల్లర్లు వాపోతున్నారు. 2012-13 ఖరీఫ్ మార్కెట్ సీజన్ ముగిసే సెప్టెంబరులోపే పర్మిట్లను బదిలీ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. గడువులోపు పర్మిట్లను వినియోగించుకోకుంటే అంతేసంగతులు. అన్ని సక్రమంగా చేసినా వచ్చే ఆదాయం పోగొట్టుకోవాల్సి వస్తుంది. గడువు ముగిసే తరుణంలో ఎక్కువ మంది మిల్లర్లు ప్రభుత్వ బియ్యాన్ని(సీఎంఆర్) అప్పగిస్తున్నారు.
ఇప్పుడే పర్మిట్ల బదిలీ ఆపేయడంతో రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడిపై భగ్గుమంటున్నారు. సాధారణ ఎన్నికలను తలపించే పోరులో ఓట్లు వేసి గెలిపిస్తే తమకు చేసే మేలు ఇదేనా అని వాపోతున్నారు. అధ్యక్షుడు చేసిన నిర్వాకానికి బదిలీ అర్హత పర్మిట్లే కాదు.. మిగిలిన విషయాల్లోనూ అధికారులు తమను పట్టించుకోవడంలేదని అంటున్నారు. పర్మిట్ల బదిలీ అక్రమాలతో నష్టపోయిన రైస్ మిల్లర్లతో బయట సెటిల్‌మెంట్ చేసుకున్నా... పరిశ్రమలోని అందరికి ఈ వ్యవహారం ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. సంఘం అధ్యక్షుడి చర్యలు, రెండు వర్గాల మధ్య ఆధిపత్యపోరులో పరిశ్రమ దెబ్బతింటోదని వాపోతున్నారు.
2011-12 ఖరీఫ్ మార్కెట్ సీజన్‌లో జిల్లాలో 5.91 లక్షల టన్నుల కస్టమ్ మిల్లింగ్ బియ్యం సేకరణ లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని 426 మంది మిల్లర్లకు ఈ ధాన్యాన్ని ఇచ్చారు. వీరిలో 226 మంది మిల్లర్లు మాత్రమే వంద శాతం బియ్యం అప్పగించారు. వీరు అప్పగించిన 2.06 లక్షల టన్నుల బియ్యానికి సమాన పరిమాణంలో... వారి వద్ద ఉన్న సొంత బియ్యం విక్రయానికి పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో ఇప్పటివరకు 87 వేల టన్నుల బియ్యం విక్రయానికి పర్మిట్లు ఇచ్చారు. దీంట్లో 15 వేల టన్నుల బియ్యం పర్మిట్ల బదలాయింపులో అక్రమాలు జరిగినట్లు ఇటీవల బయటపడింది. బియ్యం ధరలు పెరగడంతో రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడి ప్రమేయంతో ఇది జరిగిందని నష్టపోయిన మిల్లర్ల్లు వెల్లడించారు. అధికారులకు ఫిర్యాదులు చేస్తే కేసులతో మొత్తానికే మోసం జరుగుతుందని గ్రహించిన సంఘం అధ్యక్షుడు మారుతి... 12 మంది మిల్లర్లకు నష్టపరిహారం చెల్లించేలా సంఘం కార్యాలయంలోనే ఒప్పందం చేసుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ వ్యవహారం అధికారులకు ఇబ్బందిగా మారింది. రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు చేసిన తప్పులు తమకు ఇబ్బందిగా మారడంతో మొత్తం పర్మిట్ల జారీ, బదిలీ ప్రక్రియనే పక్కనబెట్టారు. ఎప్పుడు పునరుద్ధరించేది స్పష్టత రావడంలేదు.
అధ్యక్షుడి నిర్వాకం.. అందరికీ శిక్ష!
Published Sat, Sep 14 2013 3:08 AM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM
Advertisement
Advertisement