పెట్రోల్ బంకు
పశ్చిమగోదావరి యలమంచిలి: పెట్రోల్ బంకుల యాజమాన్యాలు నిబంధనలు పాటించడం లేదు. వాహనచోదకులకు కల్పించాల్సిన సదుపాయాల గురించి పట్టిం చుకోవడం లేదు. పైపెచ్చు పెట్రోల్ రీడింగ్‌లోనూ అవకతవకలకు పాల్పడుతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నిబంధనలు ఇవీ..
నిబంధనల ప్రకారం.. బంకుల్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. తాగునీటి వసతి కల్పించాలి. ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలి. వాహనాలకు ఉచితంగా గాలి పట్టడానికి యంత్రాలు ఏర్పాటు చేయాలి. వినియోగదారుల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు పుస్తకం ఏర్పాటు చేయాలి. పెట్రోల్ మీటర్ రీడింగ్‌లో పారదర్శకంగా వ్యవహరించాలి. పెట్రోల్ ధరలు, బంకు వేళలు, నిర్వాహకుడి ఫోన్‌నంబర్, అక్కడ లభించే సేవలు వివరిస్తూ.. బోర్డు ప్రదర్శించాలి. ఆన్‌లైన్ చెల్లింపుల కోసం యంత్రాలు అందుబాటులో ఉంచాలి.
ఎక్కడా కానరావే..!
అయితే వీటిని బంకుల్లో ఎక్కడా అమలు చేయడం లేదు. కొన్నిచోట్ల ఆన్‌లైన్ చెల్లింపుల కోసం యంత్రాలు ఉండడం లేదు. గాలిపట్టే యంత్రాలు ఉన్నా.. పనిచేయట్లేదు. మరుగుదొడ్ల సంగతి సరేసరి. తాగునీటి వసతి కూడా ఎక్కడా కానరాదు. ప్రథమ చికిత్స కిట్లు కూడా కనబడడం లేదు. ఒకవేళ ఉన్నా వాటిలో కాలంచెల్లిన మందులు, దూది ఉంటున్నాయి. కొన్ని బంకుల్లో పెట్రోల్ మీటర్ రీడింగులోనూ అవతవకలు జరుగుతున్నాయి. ధరల బోర్డులు కానరావడం లేదు. అయినా అధికారులు పట్టించుకోవట్లేదు.
కనీస వసతులు ఉండడం లేదు
పాలకొల్లు చుట్టుపక్కల గ్రామాలలో 15 బంకుల వరకు ఉన్నాయి. చాలా బంకుల్లో కనీస వసతులు ఉండడం లేదు. గాలి పట్టే యంత్రాలు దాదాపు లేవనే చెప్పాలి. తాగునీరు కూడా కనిపించదు. మరుగుదొడ్ల సంగతి సరేసరి. కనీసం మూత్ర విసర్జన కూడా చేయలేనంతా అధ్వానంగా ఉంటున్నాయి. – చేగొండి సీతారామస్వామినాయుడు (చిన్ని), దొడ్డిపట్ల
అవగాహన ఉండట్లేదు
బంకుల్లో ఉచిత సేవలు ఉంటాయని వినియోగదారులు చాలా మందికి తెలియదు. దాని వల్లే బంకు యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు స్పందించి బంకుల్లో అందించాల్సిన సేవల వివరాలను పెద్దపెద్ద అక్షరాలతో బోర్డు రూపంలో ఉంచేలా చర్యలు తీసుకోవాలి.– వినుకొండ రవి, ఏనుగువానిలంక
Comments
Please login to add a commentAdd a comment