నిస్సహాయం..!
కర్నూలు(అగ్రికల్చర్): ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన స్వయం సహాయక సంఘాలు నేడు దీనస్థితిలో కొట్టమిట్టాడుతున్నాయి. ఆర్థికాభివృద్ధికి బ్యాంకులు చేయూతనివ్వకపోవడంతో పొదుపు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవసరాల కోసం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సి వస్తోంది. మైక్రో ఫైనాన్స్ ఊబిలో చిక్కుకొని చాలా మంది విలవిల్లాడుతున్నారు. అక్కలు..చెల్లమ్మలూ ఎవరూ ఆందోళన చెందవద్దు.. అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చి.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట మార్చారు.
సంఘానికి రూ.లక్ష ప్రకారం రివాల్వింగ్ ఫండ్ ఇస్తామని ప్రకటించారు. ఇందుకు అనేక షరతులను విధించారు. చంద్రబాబు మాటలు నమ్మి డ్వాక్రా మహిళలు.. ఏప్రిల్ నుంచి రుణాలు చెల్లించడం మానేశారు. రుణాల రికవరీ లేదని బ్యాంకులు సైతం కొత్తవాటిని ఇవ్వలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో 24,663 ఎస్‌హెచ్‌జీలకు రూ.712 కోట్లు బ్యాంకుల నుంచి లింకేజీ రుణాలను ఇప్పించే విధంగా ప్రభుత్వం లక్ష్యాన్ని ఇచ్చింది. ఆగస్టు నెల వరకు 6,069 సంఘాలకు రూ.165.4 కోట్లు రుణాలు ఇవ్వాల్సి ఉంది. అయితే బ్యాంకులు ఏమాత్రం చొరవ తీసుకోవడం లేదు. ఇప్పటివరకు 1,789 సంఘాలకు రూ.45.56 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. ప్రభుత్వం పట్టించుకోక, బ్యాంకులు రుణాలు ఇవ్వక మహిళల ఆర్థికాభివృద్ధిపై నీలినీడలు కమ్ముకున్నాయి.
అర్హత కలిగిన స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించే బాధ్యత ఏపీఎంలపై ఉంది. వీరు ఎస్‌హెచ్‌జీలకు సంబంధించి సూక్ష్మ ప్రణాళికను బ్యాంకులకు సమర్పిస్తే రుణాలు అందుతాయి. ఏపీఎంలు, సీసీలు.. ఎవరూ స్పందిచడం లేదు. పలువురు ఏపీఎంలు ఇంతవరకు తమ పరిధిలో ఒక్క సంఘానికి కూడా రుణాలు ఇప్పించకపోవడం గమనార్హం.
ఏప్రిల్ నుంచి ఆగస్టు నెల వరకు..
బ్యాంకు ఇవ్వాల్సిన రుణం
(రూ.కోట్లలో)
ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు 85.60
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 18.67
ఆంధ్ర బ్యాంకు 12.42
సిండికేట్ బ్యాంకు 32.61
ఇండియన్ బ్యాంకు 9.40