అనుష్కతో ఫోన్‌లోనే పరిచయం | Phone contact with Anushka | Sakshi
Sakshi News home page

అనుష్కతో ఫోన్‌లోనే పరిచయం

Published Wed, Sep 17 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 1:28 PM

అనుష్కతో ఫోన్‌లోనే పరిచయం

అనుష్కతో ఫోన్‌లోనే పరిచయం

పాకిస్థాన్ నుంచి ఆమె పంపిన డబ్బులనే పటన్ అకౌంట్‌లో వేశా
పటన్ వివరాలిచ్చింది అనుష్కనే
రెండోరోజు విచారణలో ఆసిఫ్‌అలీ

 
హైదరాబాద్ : ‘పాకిస్థాన్ ఏజెంట్ అనుష్క అగర్వాల్‌తో నాకు నేరుగా  పరిచయం లేదు.. కేవలం ఫోన్లోనే ఆమె నాతో మాట్లాడేది..’ అని ఆర్మీ రహ స్యాల బహిర్గతం కుట్ర కేసులో నిందితుడైన ఆసిఫ్‌అలీ  నగర నేర పరిశోధక విభాగం అధికారుల విచారణలో వెల్లడించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దేశ ఆర్మీ రహస్యాలను పాకిస్థాన్ ఏజెంట్ అనుష్కకు వెల్లడించిన సికింద్రాబాద్ ఆర్మీ  సుబేదార్ పటన్‌కుమార్ పొద్దార్ కేసులో మరో నిందితుడైన ఆసిఫ్‌అలీని  చంచల్‌గూడ జైలులో  సీసీఎస్  దర్యాప్తు అధికారుల బృందం ఏసీపీ జోగయ్య నేతృత్వంలో  మంగళవారం రెండోరోజు  విచారించింది.  మూత్ర నాళాల వ్యాధితో బాధపడుతున్న అలీని సీసీఎస్ కస్టడీకి  ఇవ్వడానికి  నిరాకరించిన నాంపల్లి కోర్టు  అతన్ని జైల్లోనే విచారించడానికి అనుమతించిన విషయం తెలిసిందే.  దీంతో సోమ, మంగళవారాల్లో దర్యాప్తు అధికారులు ఆయన్ను చంచల్‌గూడ జైల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గదిలో  విచారించారు. కాగా, ఈ విచారణ కోసం వారు ప్రత్యేక  ప్రశ్నాపత్రాన్ని రూపొందించుకున్నా రు.

ఇంతకుముందు విచారించిన పటన్‌కుమార్ నుంచి రాబట్టిన కొన్ని అంశాల్ని క్రోడీకరించిన అధికారులు అలీని ప్రశ్నిస్తున్నారు.  దీంతో కొన్నిసార్లు అతను మౌనంగా ఉంటూ, మరికొన్నిసార్లు కాదు.. అని సమాధానం ఇస్తున్నట్లు తెలిసింది. పటన్‌తో ఫోన్లో, మెయిల్‌లో చాటింగ్ చేసిన అనుష్క వివరాలను అలీ నుంచి రాబట్టేందుకు అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నట్లు సమాచారం. పటన్ వివరాలు, మెయిల్ ఐడీ, బ్యాంక్ అకౌంట్ వివరాల్ని కూడా ఆమే ఇచ్చినట్లు విచారణలో అలీ వెల్లడించినట్లు సమాచారం.  ఆమె సూచనల మేరకే తాను పటన్ అకౌంట్‌లో రూ.70 వేలు  వేసినట్లు అలీ తెలిపాడు. అలా ఎందుకు చేశావని ప్రశ్నిస్తే.. చేసిన పనికి ప్రతిఫలంగా తనకూ డబ్బులు అందాయని చెప్పిన అలీ.. ఆ డబ్బులు ఎంత అనేది ఒక్కోసారి ఒక్కోరీతిగా చెప్పినట్లు సమాచారం.

విచారణ మరో రెండురోజులు

ఇదిలా ఉండగా ఆసిఫ్‌అలీ ఆనారోగ్యం కారణంగా అతన్ని విచారించడానికి తమకిచ్చిన గడువు సరిపోలేదని, మరో రెండురోజులు పొడిగించాలని  సీసీఎస్ అధికారులు నాంపల్లి కోర్టును మంగళవారం కోరారు. దీనికి స్పందించిన న్యాయమూర్తి మరో రెండురోజులు (బుధ, గురువారం)  విచారణ గడువును పొడిగించారు.  దీంతో ఈ రెండురోజులు మరింత పకడ్బందీగా అలీని ప్రశ్నించడానికి సీసీఎస్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పాక్ ఏజెంట్‌గా పేర్కొంటున్న అనుష్క అగర్వాల్ ఎవరు.. ఆమె అసలు పేరేమిటి?,  ఆమె వలలో ఆసిఫ్‌అలీ పడటానికి కారణమేమిటి.. ఇంకా ఇందులో ఎవరెవరికి సంబంధాలున్నాయి? కేవలం డబ్బుల కోసమే అలీ ఈ పనికి ఒప్పుకున్నాడా.. మరేమైనా కారణాలున్నాయా? అన్న కోణాల నుంచి  సీసీఎస్ దర్యాప్తు ముందుకు సాగనుందని తెలిసింది.
 కాగా, పీటీ వారెంట్‌పై మీరట్ నుంచి తీసుకొచ్చిన అలీని 18వ తే దీ రాత్రి సీసీఎస్ అధికారులు మళ్లీ అక్కడికే తరలించనున్నారు. ఇదిలావుండగా, ఆర్మీ అధికారులు రెండురోజులపాటు పటన్‌ను విచారించేందుకు కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆర్మీ అధికారుల విజ్ఞప్తి మేరకు చంచల్‌గూడ జైల్లో ఎప్పుడైనా.. ఏరోజైనా అక్కడి సూపరింటెండెంట్ అనుమతిలో పటన్‌ను విచారించుకోవచ్చని నాంపల్లి కోర్టు తాజాగా ఆదేశించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement