
మలయాళ సినిమా అనగానే అందరికీ గుర్తొచ్చేవి థ్రిల్లర్స్. ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో థ్రిల్లర్ మూవీస్ తీస్తూనే ఉంటారు. అలా ఈ ఏడాది జనవరిలో థియేటర్లలో రిలీజై హిట్ కొట్టినంది 'రేఖాచిత్రం'. ఇప్పుడు దీని తెలుగు వెర్షన్ సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)
కథేంటి?
రాజేంద్రన్ (సిద్ధిఖ్) అనే ఓ పెద్దాయన.. మలకపార ప్రాంతంలోని అడవిలో గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. చనిపోవడానికి ముందు ఓ వీడియో రికార్డ్ చేస్తాడు. 40 ఏళ్ల క్రితం ఓ అమ్మాయిని హత్య చేశామని, మరో ముగ్గురితో కలిసి ఇప్పుడు కూర్చున్న చోటే ఆమెని పాతిపెట్టాం అని సదరు వీడియోని ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తాడు. అదేరోజు ఆ ఊరి ఎస్ఐగా వివేక్ (అసిఫ్ అలీ) జాయిన్ అవుతాడు. రాజేంద్రన్ చెప్పినట్లు అక్కడ తవ్వితే నిజంగానే ఓ అమ్మాయి ఎముకలు దొరుకుతాయి. అలా ఈ కేసు దర్యాప్తు మొదలవుతుంది. ఇంతకీ హత్యకు గురైన అమ్మాయి ఎవరు? ఆమెను ఎందుకు చంపారు? హత్య చేసిన వాళ్లు పట్టుబడ్డారా లేదా అనేదే స్టోరీ.

ఎలా ఉందంటే?
క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు తీయడం మలయాళీ దర్శకులకు వెన్నతో పెట్టిన విద్య. అలా అని 'రేఖాచిత్రం' ఏదో డిఫరెంట్ అని కాదు. ఎప్పటిలానే ఇదో మర్డర్ మిస్టరీ. కాకపోతే దీన్ని డీల్ చేసిన విధానం. సస్పెన్స్ ఎలిమెంట్స్ ని ఒక్కొక్కటిగా రివీల్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది.
వివేక్ ఓ పోలీస్. కానీ డ్యూటీ టైంలో బెట్టింగ్స్ ఆడుతున్నాడని సస్పెండ్ చేస్తారు. కొన్నాళ్లకు ఓ మారుమూల పల్లెటూరికి ట్రాన్స్ ఫర్ చేస్తారు. సరిగ్గా జాయిన్ అయిన రోజే ఓ అమ్మాయి మర్డర్ కేసు. అది కూడా 40 ఏళ్ల క్రితం ఈమెని చంపి పాతిపెట్టి ఉంటారు. రాజేంద్రన్ అనే వ్యక్తి ఈ విషయాల్ని బయటపెట్టి చనిపోతాడు. దీంతో అసలు రాజేంద్రన్ ఎవరు? చనిపోయిన అమ్మాయి ఎవరు? ఆమెకు 1985లో రిలీజైన మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి 'కాతోడు కాతరం' సినిమాకు సంబంధం ఏంటనేది వివేక్ ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఈ క్రమంలోనే పలు అడ్డంకులు కూడా ఎదురవుతాయి.
సినిమా మొదలైన ఐదు నిమిషాలకే మర్డర్ గురించి తెలుస్తుంది. అలా మనల్ని దర్శకుడు కథలోకి నేరుగా తీసుకెళ్లిపోతాడు. స్టోరీ ఎక్కడా పరుగెట్టదు కానీ అనవసర సీన్ ఒక్కటీ ఉండదు. యువతి కాలిపట్టితో మొదలుపెట్టి.. ఒక్కో పాత్ర ఒక్కో లింక్ ని పట్టుకుని స్టోరీ తెలిసేకొద్ది యమ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
(ఇదీ చదవండి: Chhaava Review: ‘ఛావా’(తెలుగు వెర్షన్) మూవీ రివ్యూ)
చనిపోయిన రాజేంద్రన్.. తనతో పాటు విన్సెంట్ కూడా హత్యలో భాగమని చెబుతాడు. నిజంగానే విన్సెంట్ హత్య చేశాడా? దీన్ని వివేక్ ఎలా నిరూపించడనేది చివరివరకు మనల్ని ఎంగేజ్ చేసే విషయం. చూస్తున్నంతసేపు ఎక్కడా మనం ఓ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ రాదు. మన చుట్టుపక్కలా జరుగుతున్నట్లే చాలా నేచురల్ గా ఉంటుంది. చివరకొచ్చేసరికి ఓ మంచి థ్రిల్లర్ సినిమా చూశామనే అనుభూతి మాత్రం కలుగుతుంది.
ఓ యువతి హత్యకు మమ్ముట్టి సినిమా, షూటింగ్ తో లింక్ చేసి చూపించడం ఆసక్తికరంగా ఉంటుంది. హీరో మమ్ముట్టి అప్పటి లుక్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ టెక్నాలజీ ఉపయోగించి యువకుడిలా చూపించడం కూడా బాగుంది. ప్రతి పాత్రని పరిచయం చేసిన తీరు, ముగించిన తీరు చాలా ఆకట్టుకుంటుంది.

ఎవరెలా చేశారు?
ఓటీటీ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కాస్తోకూస్తో తెలిసిన అసిఫ్ అలీ, అనస్వర రాజన్.. వివేక్, రేఖ పాత్రల్లో ఇమిడిపోయారు. ఎక్కడ ఓవరాక్షన్ లేకుండా సింపుల్ గా చేసుకుంటూ వెళ్లిపోయారు. మిగిలిన ప్రతి పాత్రధారి తమ నటనతో ఆకట్టుకున్నారు.
ఈ సినిమాలో పాటలు పెద్దగా లేవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరిపోయింది. మిగతా టెక్నీషియన్స్ తమకిచ్చిన పనికి న్యాయం చేశారు. తెలుగు డబ్బింగ్ బాగుంది. కుటుంబంతో కలిసి ఎంచక్కా ఎంజాయ్ చేసే థ్రిల్లర్ మూవీ ఈ 'రేఖాచిత్రం'.
-చందు డొంకాన
(ఇదీ చదవండి: నా భర్తతో ఎలాంటి గొడవలు లేవు.. వీడియో విడుదల చేసిన కల్పన)
Comments
Please login to add a commentAdd a comment