హైదరాబాద్: సమ్మెకు దిగిన పెట్రోల్ బంకులపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ హెచ్ఆర్సీలో ఫిర్యాదు నమోదైంది. పెట్రోల్ బంకులను మూసివేసి అత్యవసర సేవలకు విఘాతం కల్గిస్తున్న వారిపై చర్యలు తీసుకువాలని హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించాడు. ఈ సేవలను పౌరసరఫరాల శాఖకు అప్పగించాలని ఆయన తన ఫిర్యాదులో విజ్ఞప్తి చేశాడు. తూనికలు, కొలతల అధికారుల దాడుల నేపథ్యంలో నగరంలోని పలుచోట్ల పెట్రోల్ బంకులను ఆదివారం సాయంత్రం మూసివేసిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్‌లో, శివార్లలో అధికారులు పెట్రోల్ బంకులపై దాడులు జరుపుతున్నట్లు సమాచారం అందగానే బంకులను మూసివేశారు. పెట్రోల్ బంకుల్లో తప్పుడు మీటర్లతో వినియోగదారులను మోసగిస్తున్నట్లు ఇటీవల ఆరోపణలు వెలువడిన విషయం తెలిసిందే. సాధారణంగా బంద్‌లు, ఆందోళనల సందర్భంగా మూసివేసే పెట్రోల్ బంకులను ఊహించని విధంగా మూసివేయడంతో నగరంలోని వాహనదారులు అయోమయానికి గురయ్యారు. పెట్రోల్ దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.