- తొలిసారి వెలుగుచూసిన వైనం
- పట్టుబడినవారికి అధికార పార్టీ అండదండలు!
- పీలేరులో ఆగని స్మగ్లింగ్
- పెరిగిన నిఘా
సాక్షి, చిత్తూరు: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాతి నిధ్యం వహిస్తున్న పీలేరు నియోజకవర్గంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పునాదులు ఉన్నాయని మరోమారు రుజువైంది. కేవీ.పల్లె మండలంలో ఎర్రచందనం డంప్‌ను పోలీసులు ఆది వారం స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్‌పార్టీ నాయకుల అండదండలతో పీలేరు నియోజకవర్గంలో ఎర్రచందనం స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు పోలీసులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎర్రచందనం అక్రమరవాణాకు సహకరిస్తూ వస్తున్నారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ గతంలో చాలాసార్లు పట్టుబడినవారు పీలేరు నియోజకవర్గంలోని కె.వి.పల్లె, పీలేరు, కలకడ మండలాల్లో ఉన్నారు. వీరు అధికారపార్టీ నాయకులుగా ముద్ర వేసుకుని పోలీసులను ఉపయోగించుకుంటూ వచ్చారు. ఈ విషయమై ఎస్పీ రామకృష్ణ రహస్యంగా ఆరా తీసి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఈ క్రమంలో పీలేరు సీఐ పార్థసారథి, ఎర్రావారిపాళెం ఎస్‌ఐ సస్పెండ్ అయ్యారు.
పీలేరు సర్కిల్లోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ఎర్రచందనం అక్రమరవాణాపై దాడులు పెంచి నిందితులను పట్టుకోవాలని అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో స్మగ్లర్లు నిర్వహిస్తున్న ఎర్రచందనం డంప్‌ను కె.వి.పల్లె పోలీసులు ఆదివారం గుర్తించారు. కె.వి.పల్లె మండలం ఎం.వి.పల్లె పంచాయతీ ఊరమాదిగపల్లె సమీపంలో గుట్ట కింద దాచిన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ అంతర్జాతీయంగా కోటి రూపాయల వరకు ఉండవచ ్చని అంచనా.
అసలు వ్యక్తులను పట్టుకుంటారా?
కె.వి.పల్లె మండలంలో పట్టుబడిన ఎర్రచందనానికి సంబంధించి అసలు సూత్రధారులెవరనేది వెలుగు చూడాల్సి ఉంది. ఎర్రచందనం దుంగల అక్రమరవాణాతో సంబంధం ఉందని పోలీసులు కేవలం ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. అయితే వీరితోపాటు, కాంగ్రెస్‌పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉంటూ, ఎర్రచందనం స్మగ్లింగ్‌లో కీలకపాత్ర పోషిస్తున్నవారిని పీలేరు సర్కిల్ పోలీసులు కొన్నేళ్లుగా చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. ఇందుకు తాజా నిదర్శనమే కె.వి.పల్లెలో ఎర్రచందనం డంప్ స్వాధీనం, ఎర్రావారిపాళెంలో రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం, లారీల స్వాధీనం.
ఇలాంటి డంప్‌లెన్నో
పీలేరు పోలీస్ సర్కిల్‌లోని ఎర్రావారిపాళెం, రొంపిచెర్ల, భాకరాపేట, కె.వి.పల్లె, పీలేరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎర్రచందనం అక్రమరవాణా కోసం తాత్కాలిక స్థావరాలుగా వాడుతున్న డంప్‌లు చాలానే ఉన్నాయి. వీటికి సంబంధించి స్థానిక పోలీసులకు సమాచారం ఉన్నా గతంలో దాడులు నిర్వహించలేదు. చామల అటవీ రేంజ్‌లోని ముప్పాతిక భాగం పీలేరు పోలీస్ సర్కిల్‌లోనే ఉంది. ఇక్కడ అటవీ అధికారులు సమాచారమిచ్చినా రవాణా అవుతున్న ఎర్రచందనాన్ని పట్టుకోవటంలో, కేసులు పెట్టడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చారు. తాజాగా ఉన్నతాధికారులు నేరుగా రంగంలోకి దిగడంతో ఇప్పుడు దాడులు నిర్వహిస్తుండడం గమనార్హం.