సాక్షి, తూర్పుగోదావరి: దేవీపట్నం వరద బాధితులందరినీ పునరావాస కేంద్రాలకు తరలించామని.. ముంపు ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపులశాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఆయన ఆదివారం జిల్లాలోని మండపేటలో విలేకరులతో మాట్లాడారు. ప్రజలు వరదలపై ఎటువంటి భయాందోళనకు గురికావద్దని పేర్కొన్నారు. ఎటువంటి పుకార్లు నమ్మవద్దని.. వరద ప్రభావిత ప్రాంతాలకు సరుకులు, బియ్యం, పప్పులు, కిరోసన్, మెడిసిన్ అందజేస్తున్నామని తెలిపారు.
అత్యవసర సమయాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు.. రెవెన్యూ, పోలీసు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా పోలవరం డ్యాం దగ్గర ఇరవై ఆరు మీటర్ల వరకు వరద నీరు ఉందని వెల్లడించారు. దీంతో రేపటివరకు వరద ఉధృతి తగ్గే అవకాశం ఉందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటివరకు ఐదువేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. దీంతోపాటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎనిమిది పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment