పింఛన్‌కు కమిటీ కోత! | Pinchanku Committee cut! | Sakshi
Sakshi News home page

పింఛన్‌కు కమిటీ కోత!

Published Thu, Sep 18 2014 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM

Pinchanku Committee cut!

ఎలాగైనా గద్దె నెక్కాలనే ఉద్దేశంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల వేళ హామీల వల విసిరారు. తీరా ప్రజలు పట్టం కట్టిన తరువాత హామీల అమలు విషయంలో రకరకాల కొర్రీలు పెడుతున్నారు. ఎన్నికల ముందు సామాజిక పింఛన్‌లు రూ.1,000, రూ.1,500కు పెంచుతామని హామీ ఇచ్చారు. తీరా ఆ సమయం వచ్చిన తరువాత ఆ భారాన్ని తగ్గించుకునేందుకు ఎన్ని విధాలా చిక్కులు పెట్టాలో అన్నీ పెడుతున్నారు. నిబంధనలు విధించడమే కాకుండా కమిటీల పేరుతో భారీగా కోత విధించేందుకు రంగం సిద్ధం చేశారు. కమిటీలోనూ పచ్చ చొక్కాలదే హవా కానుంది.
 
 
 ఉదయగిరి: టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయినా మునుపటి ముసుగును మాత్రం తొలగించుకోలేదు. ఎన్నికల వేళ ఇబ్బడిముబ్బడిగా హామీలిచ్చేసి వాటిని నెరవేర్చలేక అనేక కిరికిరిలు పెడుతున్నారు. పింఛన్‌ను పెంచుతామన్న హామీ అమలు విషయంలో రకరకాల కుయుక్తులు పన్నుతున్నారు. ఆధార్ అనుసంధానంతో అనేకమంది లబ్ధిదారులు పింఛను కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు. ఇప్పటికే అనేకమందికి ఆధార్ రాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా కమిటీల పేరుతో ప్రస్తుతం పింఛన్లు పొందుతున్న వారి సంఖ్యను తగ్గించుకునేందుకు గ్రామసభలకు ప్రతి ఒక్కరూ హాజరుకావాలని, లేకపోతే వారి పింఛన్లు రద్దవుతాయని ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో అనేకమంది కొన్నేళ్లుగా పొందుతున్న సామాజిక పింఛన్లను కోల్పోయే ప్రమాదం ఉంది.
  జిల్లాలో మొత్తం 2.62 లక్షల మంది సామాజిక పింఛన్లు పొందుతున్నారు. వీరిలో వృద్ధులు 1,24,700 మంది, వితంతువులు 90 వేల మంది, వికలాం గులు 31 వేల మంది ఉన్నారు. వీరితోపాటు అభయహస్తం, చేనేత, కల్లుగీత కార్మికులు మరో పది వేలమంది వరకు ఉన్నారు. ఇంకా ఆధార్ పొందని 20 వేల మందికి పైగా పింఛను కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ నెల 19, 20 తేదీల్లో గ్రామసభల్లో ప్రస్తుతం పింఛను పొందుతున్న వారితో పాటు కొత్తగా అర్హులైన వారు కూడా కమిటీల ముందు హాజరుకావాలని, హాజరుకాని వారిని జాబితా నుంచి తొలగిస్తామని ప్రకటించారు. తక్కువ వ్యవధిలో కమిటీల ముందు హాజరయ్యే పరిస్థితులు లేకపోవడంతో మరికొంతమంది పిం ఛను కోల్పోయే పరిస్థితి.
 కమిటీల్లోనూ పచ్చచొక్కా హవా: ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం గ్రామ కమిటీల్లో సర్పంచ్, ఎంపీటీసీ సభ్యునితో పాటు జిల్లా మంత్రి నిర్ణయించిన ఇద్దరు పొదుపుగ్రూపు సభ్యులు, మరో ఇద్దరు సామాజిక సభ్యులుంటారు. కమిటీలో మెజారిటీ సభ్యులు పచ్చచొక్క తమ్ముళ్లే ఉండే అవకాశముంది.  గ్రామకమిటీ సిఫారసునే మండల జిల్లా కమిటీ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉండడంతో టీడీపీకి చెందిన వారికే లబ్ధి చేకూరనుంది. ప్రతిపక్ష పార్టీల వారిపేర్లు జాబితాలో చోటు చేసుకునే అవకాశం లేదు.    పింఛన్ల వ్యవహారమంతా రాజకీయ నేతల కనుసన్నల్లోకి వెళ్లనుంది. 
 పేరుకే పింఛన్ల పెంపు: చంద్రబాబు మొదట ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవలం రూ.75 చొప్పున కొంతమందికి మాత్రమే పింఛన్లు ఇచ్చారు. వైఎస్సార్ హయాంలో ఈ పరిధిని దాటి అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.200 వంతున పింఛను ఇచ్చారు.  అధికారంలోకి వచ్చేం దుకు పింఛను పెంపును చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టారు. ఈ వాగ్దానం నెరవేర్చుకునేం దుకు ప్రస్తుతం ఉన్న పింఛన్‌దారుల సంఖ్యను తగ్గించేందుకు కసరత్తు చేశారు. మూడు గదుల ఇల్లున్న పింఛన్‌దారున్ని అనర్హులుగా పరిగణిస్తారు. ఐదెకరాల మాగాణి ఉన్నా, అదే కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభుత్వ, ప్రై వేటు, ఔట్‌సోర్సింగ్ పద్దతిలో ఉద్యో గం చేస్తున్నా పింఛనుకు అనర్హులే. గ్రామసభల్లోనే ఇలాంటి వారిని గుర్తిం చి పింఛనుకు అనర్హులుగా గుర్తించనున్నారు. దీంతో జిల్లాలో మరికొన్ని పింఛన్లు గల్లంతు కానున్నాయి. 
 కొత్త పింఛన్లలోనూ ‘పవర్’దే పెత్తనం:ఈ నెల 19, 20 తేదీల్లో జరిగే గ్రామసభల్లో కొత్త పింఛన్‌దారుల దరఖాస్తుల స్వీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 65 ఏళ్లు పైబడిన వారికి, వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరుచేయనున్నారు. వీరు కూడా గ్రామకమిటీ సిఫారసుల మేరకు పింఛను పొందనున్నారు. గ్రామ కమిటీలో అధికార పార్టీకి చెందిన వ్యక్తులే సభ్యులుగా ఉండడంతో వారి దయాదాక్షిణ్యాల మీదనే కొత్త పింఛన్లు పొందే అవకాశముంది. 
 
 
 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement