
గులాబీ కండువా? కాషాయ తీర్థమా?
- అంతర్మథనంలో టీటీడీపీ నేతలు
- తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మడం లేదంటున్న నేతలు
- టీఆర్‌ఎస్, బీజేపీల వైపు చూపులు కంటోన్మెంట్ ఫలితాలతో
- గ్రేటర్‌పై కూడా సడలిన నమ్మకం
- పార్టీ మారే యోచనలో మరికొందరు ఎమ్మెల్యేలు, జిల్లాల నాయకులు
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రజలు న మ్మడం లేదని ఆ పార్టీ నాయకులు నిర్ధారణకు వచ్చారా..? భవిష్యత్తులో పార్టీకి పునాదులు లేకుండా పోతాయని భయపడుతున్నారా? తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీనే చూస్తున్నారా? ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతల పరిస్థితిని చూస్తే అదే నిజమనిపిస్తోంది.
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం కేసీఆర్ టీడీపీనే టార్గెట్‌గా చేసుకొని తెలంగాణలో ఆంధ్రపార్టీలకు స్థానం లేదని చెపుతూ ఆ దిశగా పావులు క దుపుతున్నారు. దానికి తోడు చంద్రబాబు తెలంగాణ పట్ల వ్యవహరిస్తున్న తీరు.., కరెంటు, సాగునీరు, ఎంసెట్ తదితర విషయాల్లో తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణలో ఆ పార్టీ నేతలకు సైతం రుచించడం లేదు. ఇప్పటి వరకు టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న కొన్ని వర్గాల ప్రజలు కూడా బాబు నిర్ణయాలను వ్యతిరేకిస్తుండడంతో దాన్ని కేసీఆర్ తనకు అనువుగా మలచుకున్నారు. దీంతో తెలంగాణలో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి తలెత్తింది.
టీడీపీ కరడుగట్టిన నేతలుగా పేరు పొందిన తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వర్ రావు వంటి నేతలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం ద్వారా టీఆర్‌ఎస్ మినహా మరో ప్రాంతీయ పార్టీకి ఇక్కడ స్థానం లేదనే సంకేతాలను పంపించారు. దీంతో ప్రస్తుతం పార్టీలో మిగిలిన టీడీపీ నాయకుల్లో అంతర్మథనం మొదలైంది. పలు నియోజకవర్గాల ఇన్‌చార్జులు, పార్టీ ముఖ్య నేతలు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం లేని నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ బలపడుతుందని భావిస్తున్న నాయకులు కాషాయ జెండా పుచ్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్ సిట్టింగ్‌లు అధికంగా ఉన్న ఉత్తర తెలంగాణలో టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీలోకి వెళ్లేందుకు ఆ పార్టీ నేతలతో చర్చిస్త్తున్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోనూ కొందరు బీజేపీ వైపు దృష్టి పెట్టినట్లు సమాచారం.
మిగతా ఎమ్మెల్యేల్లో ఎందరు ఉంటారో?
రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్ అన్ని జిల్లాల్లో తన పట్టు పెంచుకుంది. మొన్నటి ఎన్నికల వరకు టీడీపీ బలంగా కనిపించిన హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు సైతం ఇప్పుడు టీఆర్‌ఎస్ ఖాతాలోకి చేరుతున్నాయి. ఎల్‌బీనగర్ నుంచి గెలిచి, పార్టీతో అంటీముట్టనట్టుగా ఉంటున్న బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కష్ణయ్య బీసీలంతా కలిసొస్తే సొంతపార్టీ ఏర్పాటు చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సుముఖంగా లేని టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలసి మరో ప్రాంతీయ పార్టీ ఏర్పాటు దిశగా ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం.
మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేల్లో రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లే అవకాశాలు లేవు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిని పార్టీ మారాలని ఆ నియోజకవర్గ కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఆయన కూడా పార్టీ మారే విషయాన్ని సీరియస్‌గానే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అక్కడ జరగబోయే మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల తరువాత భవితవ్యం తేల్చుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలోని పదిమంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ఇద్దరు పార్టీ మారగా, మరో ఐదుగురు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.
కంటోన్మెంట్ ఫలితాలతో డీలా!
గ్రేటర్ హైదరాబాద్‌లో తాజా కంటోన్మెంట్ ఎన్నికల ఫలితాలు టీడీపీ నేతల ఆశలపై నీళ్లు చల్లాయి. కంటోన్మెంటులోని 8 వార్డుల్లో బీజేపీ, టీడీపీ కూటమి పోటీ చేసింది. ఐదు వార్డుల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు పోటీ చేయగా, పార్టీ కార్యాలయం నుంచి ఒక్కో వార్డుకు రూ. 50 లక్షల వరకు అందినట్టు తెలిసింది. రెండున్నర కోట్లు ఖర్చు చేసినా ఐదింటిలో ఒక్క సీటు కూడా గెలవలేదు. టీఆర్‌ఎస్, ఆపార్టీ రెబెల్స్ ఏకంగా 6 వార్డుల్లో విజయం సాధించడంతో టీడీపీ నేతలు ఆలోచనలో పడ్డారు. జీహెచ్‌ఎంసీలో టీడీపీ ఫ్లోర్‌లీడర్‌గా మొన్నటి వరకు పనిచేసిన సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకున్నారు. ఇక ముషీరాబాద్ ఇన్‌చార్జి ఎం.ఎన్. శ్రీనివాసరావు బీజేపీలోకి వెళ్లాలనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం.