నంద్యాల : కొత్త సినిమాలను పైరసీ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్న వ్యక్తిని కర్నూలు జిల్లా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం కేంద్రంగా పైరసీ మాఫియా నడుస్తుందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి... స్థానిక ఎస్‌బీఐ కాలనీ వీధిలోని శ్రీ ఎలక్ట్రికల్ మ్యూజిక్ షాప్ యజమాని మధుసూధన్ని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం ఆ షాపులో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మధుసూధన్ కొత్త సినిమాలను పైరసీ చేసి డీవీడీలుగా మార్చి అక్రమంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దుకాణం నుంచి రెండు మానీటర్లు, తొమ్మిది సీపీయూలు, 194 డీవీడీ రైటర్లు, 879 కొత్త సినిమా ప్రింట్లు, 650 నీలి చిత్రాల ప్రింట్లతో పాటు ప్రింట్ వేయడానికి సిద్దంగా ఉంచిన వేల సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకన్నారు. వాటిని సీజ్ చేశారు. మధుసూదన్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.