పాతిక లక్షలు కతికేశారు..
Published Tue, Apr 8 2014 12:10 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
పిఠాపురం, న్యూస్‌లైన్ :ఎన్నికైన పురపాలకులూ లేరు. ఆర్థిక విషయాలను చూడాల్సిన కీలక స్థానాల్లో అర్హులైన ఉద్యోగులూ లేరు. ఇంకేముంది- పిఠాపురం మున్సిపాలిటీలోని అవినీతిపరులైన అధికారులకు పంట పండింది. పురపాలక సంఘం పరిధిలో జరిగే వివిధ పనులకు సంబంధించి సెక్యూరిటీ డిపాజిట్లు, వ్యాట్, ఇన్‌కం ట్యాక్స్‌ల నిమిత్తం కాంట్రాక్టర్ల నుంచి కట్టించుకున్న సొమ్మును రూ.25 లక్షల వరకూ స్వాహా చేసేశారు. కొందరు అధికారులు కలిసి పాల్పడిన స్వాహాపర్వం బయటకు పొక్కడంతో తమ పై అధికారులకు ముడుపులు ముట్టజెప్పీ, ఆయా ఖాతాల్లో నామమాత్రపు మొత్తాలు జమ చేసీ తాము బయట పడాలని ప్రయత్నిస్తున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి విశ్వసనీయంగా తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. సాధారణంగా మున్సిపాలిటీ పరిధిలో ఏ విభాగానికి సంబంధించి ఏ పని చేపట్టినా.. సంబంధిత కాంట్రాక్టర్ నుంచి ఆ పని విలువలో 7.5 శాతం సెక్యూరిటీ డిపాజిట్‌గా, 5 శాతం ఁవ్యాట్‌రూ.గా, 2.5 శాతం ఇన్‌కం ట్యాక్స్‌గా వసూలు చేస్తారు.
ఈ సొమ్ము డీడీలు, చెక్కులుగా ఆయా విభాగాల ఖాతాల్లో జమ చేయాలి. పిఠాపురం మున్సిపాలిటీలో పది మంది క్లాస్ వన్ కాంట్రాక్టర్లు ఉన్నారు. వీరికి ఏ పని కేటాయించినా.. ఈ పని విలువలో 7.5 శాతం సెక్యూరిటీ డిపాజిట్‌గా కట్టించుకుని, ఆ పని సక్రమంగా, నాణ్యంగా పూర్తయిందని నిర్ధారణ అయ్యాక తిరిగి చెల్లిస్తారు. అలాగే వ్యాట్, ఇన్‌కం ట్యాక్స్‌లుగా వసూలు చేసిన మొత్తాన్ని మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు వెచ్చించాలి. అయితే 2005 నుంచి మున్సిపాలిటీ పరిధిలో ఇలా సేకరించిన సెక్యూరిటీ డిపాజిట్లు రూ.11 లక్షలు మేరకు, వ్యాట్ రూ.10 లక్షల మేరకు, ఇన్‌కం ట్యాక్స్ రూ.4 లక్షల మేరకు కొందరు అధికారులు సొంత అవసరాలకు యథేచ్ఛగా వాడుకున్నారు.
ఆర్థిక వ్యవహారాాలను చూసే స్థానాల్లో అర్హులైన వారు లేకపోవడంతో వారి పని సునాయాసమైంది. పనులు పూర్తయ్యాక కాంట్రాక్టర్లకు సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాల్ని తిరిగి చెల్లించకపోయినా..వారు మున్సిపాలిటీలో తాము తిరిగి కొత్త పనులను చేపడుతూనే ఉంటాము గనుక.. ఎప్పటికో అప్పటికి వస్తాయి కదా అన్న భావనతో ఉండిపోయారు. మొత్తం మీద అన్నిరకాలుగా రూ.25 లక్షలను ఆయా ఖాతాల నుంచి నగదుగా డ్రా చేసి దారి మళ్లించిన ఆ నలుగురు అధికారులూ ఇప్పుడు విషయం బయటకు పొక్కడంతో.. తమపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు పై అధికారులకు ముడుపులు ముట్టజెపుతున్నారని సమాచారం. అంతేకాక ఆయా విభాగాల ఖాతాల్లో నామమాత్రంగా రూ.3 లక్షలు జమచేసి అంతా సక్రమంగా ఉన్నట్టు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.
అనర్హులకు పగ్గాలతో.. కళ్లేలు తెంచుకున్న అవినీతి..
కాగా మున్సిపాలిటీలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేసిన ఓ ఉద్యోగిని అర్హత లేకున్నా 2008లో రెవెన్యూ విభాగంలో కీలకమైన పోస్టులో నియమించిన నాటి నుంచి సొమ్ములు దారి మళ్లడం జోరందుకున్నట్టు తెలుస్తోంది. అలాగే మరో రికార్డు అసిస్టెంట్‌ను ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మరో కీలక స్థానంలోనియమించడం కూడా ఈ కుంభకోణానికి దోహదపడినట్టు చెపుతున్నారు. మున్సిపాలిటీ అక్కౌంటెంటుగా 2013 జూన్ 14నే పద్మజ్యోతి బాధ్యతలు చేపట్టినా ఆ ఉద్యోగులిద్దరూ తమ వద్ద ఉన్న రికార్డులు అప్పగించక పోవడం గమనార్హం. అయినా కమిషనర్ పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా.. మున్సిపాలిటీలో నిధులు దారి మళ్లినట్టు వచ్చిన ఆరోపణల గురించి కమిషనర్ బి.రాముని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా.. ఆరోపణలపై విచారణ జరిపిస్తామని చెప్పారు. ఆర్‌ఐ, షరాబులు కొత్తగా వచ్చిన అక్కౌంటెంటుకు రికార్డులు అప్పగించక పోవడం వాస్తవమేనన్నారు.
Advertisement
Advertisement