
బాబ్బాబు ప్లీజ్..
- ఎమ్మెల్సీ, ఉడా చైర్మన్ పదవులపైనే అందరి దృష్టి
- ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు
- బాబు హామీలు నెరవేర్చేనా?
జిల్లాల్లో ‘నామినేటెడ్’ కాక రాజుకుంది. ఎమ్మెల్సీ, ఉడా చైర్మన్ పదవుల కోసం టీడీపీ నాయకుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. జిల్లాలోని ముఖ్య నేతలు పదవుల కోసం పోటీ పడుతుండటంతో అధినేత ఎవరికి పట్టం కడతారనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంత్రులు, ఎంపీలు కూడా తమ వర్గ నేతలకు పదవులు కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయవాడ : నామినేటెడ్ పదవుల పంపకానికి ప్రభుత్వం ‘పచ్చ’జెండా ఇచ్చేసింది. ఎలాగైనా కీలక పదవులు పొందాలని టీడీపీ నేతల్లో ఆరాటం మొదలైంది. కృష్ణా జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం, వీజీటీఎం ఉడా చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు పలువురు పావులు కదుపుతున్నారు. ఎవరికి వారే పార్టీలో తమ గాడ్‌ఫాదర్ల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు నేరుగా చంద్రబాబును కలిసి ‘గతంలో మీరు చెప్పినట్టే నడుచుకున్నామని, మీరు కూడా మాకు హామీ ఇచ్చినట్లుగానే నామినేటెడ్ పదవి ఇవ్వాలని’ కోరుతున్నారు.
ఎమ్మెల్సీ స్థానం కోసం పట్టు...
స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ పదవీకాలం కొద్దికాలం కిందట ముగిసింది. ఎలాగైనా తానే తిరిగి ఎమ్మెల్సీ పదవి పొందాలని ఆయన ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధ, టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. బుద్దా వెంకన్న గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నించారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని, ఎమ్మెల్యే సీటు మరొకరికి కేటాయిస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో వెంకన్న అంగీకరించారు.
పెనమలూరు నియోజకవర్గం నుంచి వైవీబీ రాజేంద్రప్రసాద్, పంచుమర్తి అనూరాధ కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించారు. వారికి కూడా చంద్రబాబు ఇదే తరహా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్సీ పదవికి వీరి మధ్య పోటీ తీవ్రమైంది. మరోవైపు పామర్రు నుంచి పోటీ చేసి ఓడిపోయిన వర్ల రామయ్య కూడా రేసులో ఉన్నారు. వీరిలో కొందరికి మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు, ఎంపీ కేశినేని నాని మద్దతు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో పదవులు పందేరం విషయంలో టీడీపీ నాయకులు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది.
‘ఉడా’ చైర్మన్ గిరీ కోసం..
ఉడా చైర్మన్ పదవి కోసం టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుత చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డిని తొలగించి తమకు పదవి కేటాయించాలని పలువురు నేతలు అధినేతను కోరుతున్నట్లు తెలిసింది. జగ్గయ్యపేటకు చెందిన ఆప్కాబ్ మాజీ చైర్మన్ తొండెపు దశరథజనార్దన్, గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడిన నాగుల్‌మీరా, బందరు టికెట్ కోసం ప్రయత్నించిన బచ్చుల అర్జునుడు, బుద్దా వెంకన్న, టీడీపీ విజయవాడ అర్బన్ ఉపాధ్యక్షుడు ముష్ఠి శ్రీనివాస్ పోటీ పడుతున్నారు.
విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి ఇప్పటికే సీఎంతో చంద్రబాబు నాయుడుతో మాట్లాడినట్లు సమాచారం. తనకే ఉడా చైర్మన్ పదవి వస్తుందని రవి ప్రసాచారం సాగిస్తున్నారు. చంద్రబాబు కూడా నామినేటెడ్ పదవి ఇస్తానని రవికి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. నాగుల్‌మీరాకు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడి ఆశీస్సులు ఉన్నాయి. పంచుమర్తి అనూరాధ నేరుగా చంద్రబాబుతోనే సంప్రదింపులు జరుపుతున్నారు.
బుద్దా వెంకన్నకు మంత్రి దేవినేని ఉమా అండగా ఉన్నారు. యలమంచిలి రవికి సుజనా చౌదరి మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, దూళిపాళ్ల నరేంద్ర కూడా తమ అనుచరులకు ఉడా చైర్మన్ పదవి దక్కించుకునేందకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు విజయవాడ వారికే ఉడా చైర్మన్ పదవి ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు ప్రకటించిన విషయాన్ని ఇక్కడి నేతలు ప్రస్తావిస్తున్నారు.
‘వణుకూరి’ ముమ్మర ప్రయత్నాలు
కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో చివరిలో ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి పదవి పొందారు. ఆయన నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావుకు అత్యంత సన్నిహితుడు. శ్రీనివాసరెడ్డి కూడా రాయపాటి ద్వారా తన పదవిని కాపాడుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒకే సామాజికవర్గానికి పదవులు !
ఇప్పటికే జిల్లాలో చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన వారికి ముఖ్యమైన మంత్రి పదవులు దక్కాయి. ఎమ్మెల్యేలుగా కూడా వారే ఎక్కువ మంది ఉన్నారు. మేయర్ పదవి కూడా ఇదే సామాజికవర్గానికి చెందిన వారికి దక్కింది. ఉడా చైర్మన్ పదవి విషయంలో బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని టీడీపీలోనే పలువురు పట్టుపడుతున్నారు. అయితే బాబు ఎవరికి పట్టం కడతారో వేచిచూడాల్సిందే.