
బంగారం కొనొద్దు: జయప్రకాష్ నారాయణ
బంగారం కొనకూడదని ప్రతి ఒక్కరూ నిర్ణయం తీసుకోవడం ద్వారా గాంధీ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించగలమని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు.
హైదరాబాద్: బంగారం కొనకూడదని ప్రతిఒక్కరూ నిర్ణయం తీసుకోవడం ద్వారా గాంధీ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించగలమని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. ఒకవేళ తప్పనిసరిగా కొనాల్సివస్తే మనం అనుకున్నదాంట్లో 50 శాతం మాత్రమే కొనాలని సూచించారు. మౌలికావసరాలకు ఢోకాలేనివారు తమ ఆదాయం, సమయంలో పది శాతం సమాజానికి కేటాయించాలని కోరారు. మహాత్ముడు పుట్టినరోజు సందర్భంగా ప్రజలు ఈ రెండు ప్రతిజ్ఞలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
గాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా బుధవారం పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను, పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బంగారం డిమాండ్‌ను తగ్గించి మనకున్నదాంట్లో పది శాతం సమాజానికిస్తే అందరం అభివృద్ధి చెందుతామని, దేశమూ అభివృద్ధి చెందుతుందన్నా రు. బంగారం దిగుమతిని ఆపితే మనకు కరెంట్ ఖాతా లోటు ఉండదన్నారు.