జారిపోతున్న ‘పచ్చ’కండువాను సరిచేసుకుంటూ.. ఎక్కడ మళ్లీ ఆత్మ వెంటపడి భుజంపై వాలుతుందోననే భయంతో కారుతున్న చెమటను తుడుచుకుంటూ.. అడుగులు తడబడుతూ..బెదురు చూపులతో నడుస్తున్న ఆ పచ్చనేత తలపై ఓ ఊత కర్రతో ఆగకుండా వరుసగా ఠఫీ, ఠఫీమంటూ దెబ్బలు పడుతున్నాయి. ఇన్నాళ్లూ భుజంపై బరువు, ప్రశ్నలతో వేధింపులు, మరీ కోపం వస్తే పీకనొక్కుడుకే పరిమితమైన ఆత్మ ఈ సారి కట్టెతో కొడుతుందేమిటంటూ పరుగులు తీస్తూనే వెనుతిరిగి చూసిన ఆ నేత ఒక్కసారిగా కంగుతిన్నాడు.
ఎందుకంటే ఎదురుగా ఉన్నది ఆత్మ కాదు, గాంధీ తాత. ఆ శాంతి దూత కళ్లు ఎందుకో ఎర్రబడ్డాయి. నమస్కారం చేద్దామనేలోగానే ఆ చేతులపై ‘సుర్రు’మన్నట్టుగా మరో రెండు దెబ్బలు పడడంతో..‘బాపూజీ...ఏమిటీ దాడి? అజాత శత్రువువైన నీవు హింసకు దిగుతున్నావా...ఆపు, ఆపు!’ అంటున్నా గాంధీ గారి కోపం తగ్గనట్టుంది..వరుస బాదుడే బాదుడు. ఏడుపు లంకించుకున్న ఆ నేత ‘ నీవు బ్రిటిష్ వాళ్లపై కూడా ఇలా ఎప్పుడుదాడి చేసినట్టు నేనెక్కడా చదవలేదు, విషయం చెప్పి కొట్టు తాతాజీ’ అని కొట్టిన దెబ్బలను తడుముకుంటూ వేడుకున్నాడు.
గాంధీజీ : కొట్టాలా ... నిన్ను చంపేయాలా!
నేత: అదేంటీ బాపూ...మీ నోటి వెంట చంపేయాలా అనే మాటా?
గాంధీజీ: చంపేయాలా...పాతరేయాలా? నేను స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన సమయంలో కూడా ఇలాంటి కోపం ఎవరూ రప్పించలేదు. మీ అధినేతతో పాటు మీరు చేస్తున్న ఇంత నీచమైన రాజకీయాలను నేనెప్పుడూ చూడలేదు. నేను చనిపోయిన తరువాత ఈ డైబ్భై ఏళ్లలో కూడా ఇలాంటి తుచ్ఛ నేతలను చూడలేదు...థూ...మీ బతుకు చెడా!
నేత: జాతి పితా.. తండ్రిలాంటి మీరు ఇంతగా మీ బిడ్డలమైన మాపై అంతలా ఈసడింపులా? మొన్ననే మా అధినేత ‘గాంధీలా నేను బతుకుతున్నాను...ఆయనలా నేను నిరాడంబరంగా, ఏ ఆర్భాటాలు లేకుండా, పేద, బీదా, బిక్కీలా..సామాన్యుడిగా బతుకుతున్నానని బహిరంగ సభలో, కరతాళ ధ్వనులే కాదు, హర్షధ్వనాల మధ్య అదరగొట్టే డైలాగ్ చెప్పారు. మా మీడియాలన్నీ ఊదరగొట్టేశాయి.
నేత మాట ఇంకా నోట్లోనే ఉంటుండగానే మళ్లీ గాంధీ గారి చేతిలో కర్ర పైకి లేచింది.
ఈసారి దెబ్బ శబ్దం గట్టిగా వినిపించింది. ‘వామ్మో’ అంటూ వీపు తడుముకుంటూ ఆ నేత పరుగులు తీస్తున్నాడు. అదే కర్రను కాళ్లల్లో పెట్టగా ఆ నేత దభేల్‌మని కిందపడ్డాడు.
గాంధీజీ: ‘అదిగో ఆ మాట అన్నందుకే నిన్ను ఇలా చితగ్గొట్టాను. ఖద్దరు, ఖాదీ కడితే నాలా బతికేసినట్టేనా ...? నేను చేసిన త్యాగాలు, చేసిన రాజీలేని పోరాటాలు తెలుసా? అవినీతి, అక్రమాలకు ఎంత దూరంగా ఉన్నానో తెలుసా? అందులో ఒక్కశాతం కూడా మీరు పాటిస్తున్నార్రా? చెబుతా రాసుకో...
హద్దులు మీరిన పుత్రప్రేమ
నా ఆశ్రమం జమా ఖర్చులు చూసుకొనే బాధ్యత నా కొడుక్కి అప్పగించాను. వేరే పట్టణంలో ఓ ముఖ్యమైన పని కోసం వెళ్లడానికి ఆశ్రమ నిధులను కమిటీ అనుమతి తీసుకోకుండా ఖర్చు పెట్టాడు. నెలాఖరులో జమ చేసేద్దామనుకున్నాడు. చేయలేకపోయాడు. విషయం బయటపడింది. నా దృష్టికి వచ్చిన వెంటనే ఆ నిధులను తను సంపాదించిన డబ్బులతో భర్తీ చేయాలని ఆదేశించాను. అంతవరకు ఆశ్రమం విడిచి వెళ్లిపోవాలని శాసించాను. ఆ డబ్బులను సమకూర్చుకోడానికి వేరే పట్టణం వెళ్లి, ఎక్కడెక్కడో పనిచేసి, నాలుగు నెలల తరువాత వచ్చి ఆ డబ్బులను జమ చేశాడు. ఇదీ నా కొడుకు విషయంలో నేను తీసుకున్న కఠిన నిర్ణయం. మరి మీ నేత కొడుకు విషయంలో ఏమి చేస్తున్నాడు, సంపాదించిన అక్రమ ఆస్తితో కోటీశ్వరుడిని చేసి, మరింత దోచుకోవాలంటూ అర్హత లేకపోయినా, మూడు శాఖలకు మంత్రి పదవులు ఇచ్చి రాష్ట్రం మీదకు వదిలాడా...లేదా?
అప్పుల్లో ముంచడమేనా అనుభవం..
దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు నాకు బంగారం, నగదు, విలువైన వజ్రాలు విరాళాలుగా వచ్చాయి. అక్కడ ఉన్న భారతీయుల కోసం పోరాటాలు చేసి విజయాలు సాధించాం. వకీలుగా ఉండడంతో ఆ విశ్వాసంతో ఇండియాకు తిరిగి వస్తున్న సమయంలో సన్మానాలు చేసి ఇచ్చారు. వీటిని నేను తీసుకోకూడదనుకున్నాను. ఈ విషయంలో ఇంట్లో నా భార్య కూడా నా నిర్ణయంతో విభేదించింది. ‘ఇదొక్క నగ మాత్రం ఉంచేసుకుంటా’నని ముచ్చటపడినా ‘ససేమిరా’ అన్నాను. ఆ నగలకు నోటు రాసుకొని బ్యాంకులో వేసి, ఆ నిధులను కూడా ప్రజా సేవకే వినియోగించాను. పక్కా లెక్కలతో రికార్డును మెయిన్‌టైన్ చేశాను. మరి మీ నేత... విభజనకు గురై కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి వచ్చిన నిధులను ఏమి చేశాడు? విచ్చలవిడిగా జల్సాలకు ఖర్చులు చేసి రాష్ట్రాన్ని ఓవర్ డ్రాఫ్టుల్లో ముంచి ...చేతికందినకాడికి అప్పులు చేసి...కోట్ల అప్పుల్లోకి నెట్టేశాడు. మీ నేతకు కనీస బాధ్యత ఉందా..? ఇతరులు ఇచ్చిన సొమ్ము విషయంలోనే అంత బాధ్యతగా ఉంటే ప్రభుత్వ సొమ్ము విషయంలో ఇంకెంత బాధ్యతగా ఉండాలి!
ప్రయాణం ఖర్చు నూరు కోట్లు దాటడమేనా నిరాడంబరత..
నిరాడంబరతను నాతో పోల్చుకుంటారా.. ఆశ్రమ జీవితం...ఖాదీ...అందులో సగం వస్త్రం మాత్రమే. శాకాహారం, ఉపవాసం, నిరాహార దీక్షలు, ఎక్కడకు వెళ్లినా అతి తక్కువ ఖర్చుతో పయనం. రైళ్లలో అయితే మూడో తరగతి, లేదంటే మామూలు పెట్టెలో పయనం. ఇతర దేశాలకు విమానంలో వెళ్లినప్పుడు కూడా పొదుపే. ఇదీ నా జీవన గమనం. కానీ మీ అధినేత ఈ రాష్ట్రం కోసం కనీసం ఆలోచించాడా? విదేశాలకు వెళ్తే ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్లు, ఆ ఖర్చే రూ.100 కోట్లు దాటింది కదా. మీ అధినేత ఎక్కడ ఉంటాడో తెలియకుండానే రూ.50 కోట్లకుపైగా ఖర్చు చేసి.. చివరకు ఆక్రమించిన భూమిలో కట్టిన భవంతిలో ఉంటున్నాడు కదా. రాజలాంఛనాలతో పదవిని అనుభవించి నిరాడంబరత పేరు పెడతారా...ఆ విషయంలో నా పేరును వాడుకుంటారా?
పూటకో మాట మార్చే ఊసరవెల్లి
నా బాల్యంలో కూడా ఉపాధ్యాయులతో గానీ, విద్యార్థులతోగానీ అబద్ధాలు ఆడినట్టుగా నాకు గుర్తు లేదు. హైస్కూల్లో చేరిన మొదటి సంవత్సరంలో మా స్కూలుకు ఇన్‌స్పెక్షన్‌కు జెయిన్స్ అనే పేరుగల ఇన్‌స్పెక్టర్ వచ్చారు. మా అక్షర జ్ఞానాన్ని పరీక్షించేందుకు ఐదు ఇంగ్లిషు వర్డ్స్ ఇచ్చారు. అందులో ‘కెటిల్’ అనే పదాన్ని నేను తప్పుగా రాశాను. అది గమనించిన ఉపాధ్యాయుడు తన బూటు కాలితో నా కాళ్లను గట్టిగా నొక్కి తప్పును సరిదిద్దుకోవాలని, పక్కవారి పలకలో రాసింది చూసి సరి చేసుకోవాలని సైగ చేశారు. కానీ ఎందుకో నాకా పద్ధతి నచ్చలేదు. అదీ బాల్యంలో నా నిజాయితీ. అప్పట్లో ‘సత్య హరిశ్చంద్ర’ నాటకం నా మదిపై ప్రగాఢ ప్రభావం చూపించింది. టికెట్ పెట్టి ఆ నాటకం చూడాలి. ఎన్నోసార్లు చూద్దామన్నా చేతిలో డబ్బులు లేక ఒక్కసారికే పరిమితం చేసుకున్నాను. సత్య హరిశ్చంద్రుడిలా సత్యాన్నే పలకాలని ఆనాడే అనుకున్నాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ బాటను వీడలేదు.
కానీ మీ అధినేత పూటకోమాట. ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాలు ఎండగడుతున్నా నిస్సిగ్గుగా మాట మార్చేస్తున్నాడు. నిండు అసెంబ్లీలో ప్రధాని మోదీని పొగిడిన నోరే తెగడుతోంది. హోదా కావాలంటూ ఎన్నికల ముందు ఎలుగెత్తిన గళమే తరువాత ప్యాకేజీ పాట పాడింది. మోదీపై అసమ్మతి కోసం వైఎస్సార్ సీపీ చేపట్టిన తీర్మానానికి మద్దతు ఇస్తానని చెప్పిన ఆ నాలుకే తెల్లారేసరికి మాట మార్చేసింది. ఇలా ఒకటేమిటి...సత్య హరిశ్చందుడు ఇల్లు మా వెనకాలే అన్నట్టుగా ఫోజు కొడుతూ అడుక్కో అబద్ధమాడుతూ రాష్ట్రాన్ని నవ్వులపాలు చేస్తున్నాడు కదరా మీ బడా నేత. వకీలు వృత్తి అంటేనే అబద్ధాలు. లేదంటే కేసులు గెలవడం కష్టం. అలాంటి వృత్తి చేపట్టినా సరే అబద్ధాల జోలికిపోని కేసులనే స్వీకరించాను. అంతే తప్ప ఆదాయ ఆర్జనకు నానా గడ్డి తినలేదు మీ అధినేతలా...!
దళితుల పుటకను చిన్నబుచ్చిన కుసంస్కారి
నా గుమస్తా ఓ దళితుడు. నా ఇంట్లోనే ఓ గదిలో అద్దెకు ఉన్నాడు. ఆ గదికి పాయిఖానా లేదు. అందుకే ప్రతి గదిలోనూ పాత్రలు పెట్టాం. ఆ పాత్రలో మూత్ర విసర్జన చేస్తే దాన్ని శుభ్రం చేసే బాధ్యత ఆ ఇంటి యజమానులదే. ఆయన మూత్రాన్ని ఓ గిన్నెలో పోస్తే ఆ గిన్నెను నేను, లేదా నా భార్య కస్తూర్బా బయటకు తీసుకువెళ్లి శుభ్రం చేసి వచ్చేవారం. ఈ విషయంలో దంపతుల మధ్య పొరపొచ్చాలొచ్చినా సరే కొన్నాళ్లు అదే కొనసాగించాం. తరువాత కూడా అంటరానితనం నిర్మూలన కోసం కడవరకూ పోరాటం చేశాను. మరి మీ అధినేత? ‘దళితుడిగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా’ అని ఛీ...దరించుకున్న మీ నేత అసలు మనిషేనా? మానవత్వం ఉందా? నాయకుడిగా ఉండడానికి కనీస అర్హత కూడా లేదుకదరా?
మీ వాడి పాలనలో పట్టపగలే పడతులపై దాడులు
అర్ధరాత్రి మహిళ వీధిలో ఒంటరిగా తిరిగిన రోజున మాత్రమే దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్టుగా నేను భావించాను. కానీ మీ అధినేత పాలనలో పట్టపగలే లైంగిక దాడులు, హత్యలు. మహిళా అధికారులను కూడా జుత్తు పట్టుకొని ఈడ్చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి కదరా!
అమెరికాలో పుట్టాలనుకునే దేశ భక్తుడు
పుట్టుక నా చేతిలో ఉంటే నేను అమెరికాలో పుట్టేవాడినని వాగాడు మీ అధినేత మరచిపోయావా? ఈ మాట వేరే దేశంలో అనుంటే ఆ దేశ ప్రజలు కుక్కను కొట్టినట్టు కొట్టి దేశం నుంచి తరిమేసేవాళ్లు. ఇంకొన్ని దేశాలైతే పౌరసత్వాన్ని రద్దు చేసి.. దేశం నుంచే బహిష్కరించే వారు. మనది పెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఇంకా మీ నేత ప్రజల మధ్య తిరుగుతున్నాడు. మీ వాడికి దేహభక్తే తప్ప దేశ భక్తి లేదు. కాబట్టే ఇటీవల పాకిస్తాన్ వాళ్లు కశ్మీరులో 40 మంది సైనికులను కాల్చేస్తే సమర్థింపు మాటలు మాట్లాడారు. అంతకన్నా దేశద్రోహం ఉంటుందా...అదే పాకిస్తాన్‌లో ఉండి భారత్‌ను సమర్థించి ఉంటే నడిబజార్లో కాల్చేసేవారు.
నేత: నిజంగా మీరు గాంధీగారేనా? సమకాలీన అంశాలు...రాజకీయ కుట్రలు, అక్రమాలు పూసగుచ్చినట్టుగా చెప్పేస్తున్నారు. ఇప్పటికే మా పార్టీ నుంచి వలసలు జోరందుకున్నాయి. ‘బాబో’...య్ నిన్ను ప్రచారంలోకి తీసుకువస్తే ఉన్న ఆ డొకడా సైకిల్ కూడా దక్కేట్టు లేదురా నా...న్నోయ్.
గాంధీజీ: చివరిగా వెన్నుపోటు..ఆ విషయం కూడా చెప్పేస్తాను విను.. సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీని నడిపి.. స్వాతంత్య్రం సాధించిన నేనేనాడూ పదవులను ఆశించలేదు. మరి మీ అధినేతో.. కాంగ్రెస్ పార్టీలో ఉండి...పక్కపార్టీ అధికారంలోకి రాగానే గోడ దూకేసి...ఆ పార్టీ అధినేతనే వెన్నుపోటు పొడిచి ...ఆ కుర్చీనే ఆక్రమించేసిన దుర్మార్గుడు. ఇలాంటి అన్యాయం రాచరికంలో కూడా నేను చూడలేదు. మీ డర్టీ నేతకు నాతో పోలికా!
అంటూ గాంధీజీ మరోసారి చేతి కర్రపైకెత్తగా నేత తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే భుజం బరువుగా ఉండడంతో అటువైపు తలెత్తి చూడగా ఎప్పుడూ వెంటాడే ఆత్మ.
నేత: ఏమిటీ.. ఇంతసేపు గాంధీగారి వేషంలో ముప్పుతిప్పలు పెట్టింది నీవా?
ఆత్మ: మీ మొహాలకు ఆ గాంధీగారే రావాలా...నేను సరిపోతానని.. బాపూజీని ఆవాహనం చేసుకొని నీ వీపు వాయించాను.
ఆత్మ ఇలా అనగానే...నేత ‘వామ్మో.. ఇంకా నయం..ఈ విషయాలన్నీ జనం మధ్యకు వచ్చి చెప్పలేదంటూ పరుగులు తీశాడు.
‘ఇలాంటి మనిషి ఈ భూమి మీద తిరుగాడాడంటే భావితరాలు నమ్మడం కష్టం’ అని గాంధీ గారిని ఉద్దేశించి ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ అన్నారు.. కానీ నేటి తరం మీ నేత కోసం నెగెటివ్ టచ్‌తో అదే వాక్యం స్ఫురణకు తెచ్చుకుంటున్నార్రా..’ అంటూ ఆత్మ అక్కడి నుంచి మాయమయింది.
– కృష్ణారావ్
Comments
Please login to add a commentAdd a comment