జీవితాలతో పేకాట! | poker game life end in srikakualm | Sakshi
Sakshi News home page

జీవితాలతో పేకాట!

Published Wed, Aug 6 2014 2:31 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM

జీవితాలతో పేకాట! - Sakshi

జీవితాలతో పేకాట!

 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం పట్టణంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు జూదక్రీడకు స్వర్గధామంగా విలసిల్లుతున్నాయి.  పేద, మధ్య తరగతి జీవితాలను నరకప్రాయం చేస్తున్నాయి. విచ్చల విడిగా జూదాలు నిర్వహిస్తూ కొందరు లక్షలాది రూపాయలను అప్పనంగా సంపాదిస్తున్నారు. పట్టణంలోని కొన్ని చోట్ల నిత్యం జూదం జరుగుతున్నా పోలీసులు, అధికారులు అటువైపు కన్నెత్తి చూడకుండా కొంతమంది బడాబాబులు, నాయకు లు లోపాయికారీగా ‘మేనే జ్’ చేస్తున్నట్టు తెలిసింది. ఎప్పటి నుంచో సాగుతున్న ఈ దందా గురించి కొందరు పోలీసు అధికారులకు తెలిసినా చూసీ చూడకుండా వ్యవహరిస్తూ నెలవారీ మామూళ్లు దండుకుంటున్నారని సమాచారం.
 
 జూదం ద్వారా ఎన్నో కుటుంబాల ఆస్తులను లాగేసుకుంటున్న నిర్వాహకులు.. ఆటలో గెల్చిన వారిపైనా అల్లరిమూకలతో దాడులు చేయించిన సంఘటనలు కూడా ఉన్నాయి. పరువు పోతుందన్న భయంతో బాధితులు ఈ విషయాలను బయటకు చెప్పుకోలేకపోతున్నారు. తాజాగా గత ఆదివారం అర్ధరాత్రి వర కు పట్టణ శివార్లలో జూదం జరిగింది. కొవ్వొత్తుల లైటింగ్‌లో మట్టిరోడ్డుకు సమీపంలోని గుడారాల్లో ఇదంతా జరిగినట్లు తెలిసింది. విచిత్రమేమిటంటే మామూలు రోజులు కన్నా వారాంతాల్లో జరుగుతున్న ఆటల్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నట్లు సమాచారం.
 
 ఇవే జూదానికి అడ్డాలు
 పట్టణంలో రోజూ కొన్ని లాడ్జీలు, హోటళ్లలోని గదులు ప్రత్యేకంగా జూదం కోసమే బుక్ అవుతున్నాయి. పేకాట కోసం తీసుకునే గదులకు సాధారణ రేటు మీద రెట్టింపు వసూలు చేస్తూ చతుర్ముఖ పారాయణానికి అవసరమైన సరాంజామా సమకూరుస్తున్నట్టు కొందరు జూదప్రియులే చెబుతున్నారు. ఇక పట్టణంలోని పి.ఎన్.కాలనీ, అంబేద్కర్ కూడలి, దమ్మల వీధి, మంగువారితోట ప్రాంతాల తోపాటు సమీపంలోని ఫరీదుపేట, చల్లపేట తోటలు, తోటపాలెం, కిళ్లిపాలెం గ్రామ ప్రాంతాల్లో రోజూ సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు పేకాట జరుగుతున్నట్టు పోలీసుల వద్ద సమాచారం ఉంది. గతంలో  మండలవీధిలో పేకాట జరుగుతున్నప్పుడు తలెత్తిన ఘర్షణ లో ఓ వ్యక్తి మృతి చెందడంతో కొన్నాళ్లపాటు అక్కడ జూదం ఆపేశారని, మరికొన్నాళ్లు పెదపాడు రోడ్డులో రహస్యంగా జూదగృహం నిర్వహించేవారని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల రెండు వర్గాల మధ్య జూదం విషయమై ఘర్షణ చోటు చేసుకోవడంతో ఓ వ్యక్తిపై దుండగులు మద్యం సీసాతో దాడి చేసిన సంఘటన కూడా ఉంది.
 
 ‘సూట్’లదే హవా..
 పేకాట నిర్వహించాలంటే దమ్మూ ధైర్యంతో పాటు పోలీసుల రాకను పసిగట్టగలిగే నిఘా నెట్‌వర్క్ కూడా అవసరం. పట్టణానికి కొంతమంది గ్రూపుగా ఏర్పడి కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి జూదగృహాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్రూపులను ‘సూట్’లుగా వ్యవహరిస్తుంటారు. ఎక్కడ ఆట జరిగినా ఈ గ్రూపు సభ్యులుంటారు. తెలియని వ్యక్తుల్లా జూదంలో చేరి సిండికేట్‌గా ఏర్పడి కొత్తగా ఆటకు వచ్చిన వారి నుంచి డబ్బు రప్పించుకోవడంలో వీరు కీలకపాత్ర వహిస్తుంటారు. కొత్తవ్యక్తులను రెచ్చగొట్టి ముగ్గులోకి దించడమే వీరి ప్రధాన విధి. పేకాటకు వచ్చే వారికి కొన్ని ఆఫర్లు కూడా ఇస్తున్నారు. కార్లలో వచ్చే వారికి కనీసం రూ.3 వేలు, ద్విచక్ర వాహనంపై వచ్చే వారికి రూ.500 నజరానాగా ఇస్తున్నారు.  అదే విధంగా లైటింగ్, టెంట్ ఏర్పాటు చేయడం, ఎవరికీ ఇబ్బంది లేకుండా చూడడం కూడా వీరి బాధ్యతగా పేకాట రాయుళ్లు చెబుతున్నారు.
 
 వాహనాల్లో తరలింపు
 ఇతర ప్రాంతాల నుంచి జూదానికి రప్పించేందుకు హైటెక్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. పేకాట స్థావరం వివరాలను ఎస్సెమ్మెస్ రూపంలో జూదరులకు పంపిస్తున్నారు. అక్కడికి కొంత దూరంలో ఓ వాహనాన్ని ఉంచుతారు. ఆ సమాచారం కూడా పంపిస్తారు. సాయంత్రం వచ్చే జూదరులను వాహనాల్లో స్థావరానికి తరలిస్తున్నారు. ఇలా తరలించేందుకు ఒక్కో ఆటోకూ రూ.500 చెల్లిస్తున్నారు. పోలీసుల రాకను పసిగట్టే కాపలాదారులకు కూడా రోజుకు రూ. 500 చొప్పున చెల్లిస్తున్నారు. వచ్చిన మొత్తానికి మరింత కలిపి డ్రైవర్లు కూడా ఆటలో దిగుతున్నారు.
 
 లొసుగులే ఆధారం
 చట్టంలోని లొసుగుల ఆధారంగానే జిల్లాలో భారీగా జూదం జరుగుతున్నట్టు తెలుస్తోంది. పేకాట సమయంలో డబ్బు దొరక్కుండా నిర్వహకులు జాగ్రత్త పడుతుంటారు. కాయిన్ల రూపంలో పెట్టుబడి పెట్టి గెలిచినవారికి డబ్బు చెల్లించడం రహస్యంగా జరుగుతోంది. పోలీసులకు పట్టుబడితే ‘సూట్’దారులే బెయిల్ తెప్పించడం, వాహనాల్ని విడిపించడం కూడా చేస్తుంటారు. నాయకులతో అధికారులపై ఒత్తిళ్లు తెస్తుంటారు. అవసరమైతే ముందస్తు బెయిల్‌కూ ప్రయత్నిస్తుంటారు. ఇదంతా జరగకుండా ఉం డాలంటే స్థానిక పోలీసులకు నెలవారీ మామూళ్లు చాలు అన్న ధోరణి కనిపిస్తోంది.  పోలీస్ కేసు అం టే.. వీరి దృష్టిలో కోర్టులో జరిమానా కట్టడం వ రకే అన్నట్టుగా ఉంటోంది.
 
 ‘కాయిన్లే’ కాసులు
 పేకాట జరిగే చోట డబ్బు అసలు ఉండదు. ప్లాస్టిక్ కాయిన్లనే డబ్బుగా ఉపయోగిస్తుంటారు. రంగు ఆధారంగా కాయిన్‌కు వెలకడుతుంటారు. పోలీసులొస్తే కాయిన్లే చూపిస్తారు తప్పితే సొమ్ము దొరకదు. అయితే వేరే చోట డబ్బు సంచులతో నిర్వాహకులు ఉంటారు. గెలిచిన వ్యక్తులు అక్కడికి వెళ్లి తమ వద్ద ఉన్న కాయిన్లు ఇస్తే వాటి విలువ ఆధారంగా సొమ్ము చెల్లిస్తుంటారు. ఒక కాయిన్ విలువ కనీసం రూ.1000  ఉంటుంది.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement